కాటా తడబడుతోంది!

ABN , First Publish Date - 2022-01-24T05:17:53+05:30 IST

కాటా తడబడుతోంది!

కాటా తడబడుతోంది!
పండ్ల విక్రయాల్లో పాత కాటాలను విక్రయిస్తున్న దృశ్యం

- తూనికలు, కొలతల్లో మోసం

- వారపు సంతల్లో మరీ అధికం

- దోచుకుంటున్న అక్రమార్కులు

- పత్తాలేని అధికారులు

(మెళియాపుట్టి)

- చాపర మార్కెట్‌లో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు 4 కిలోల పండ్లు కొనుగోలు చేశాడు. అనుమానంతో మరోచోట తూకం వేయగా కిలో తక్కువగా చూపాయి. ఇదే విషయమై పండ్ల వ్యాపారిని అడిగితే బుకాయించాడు. అక్కడితో ఆగకుండా చుట్టూ ఉన్న వ్యాపారులు దాడిచేసేంత ప్రయత్నం చేశారు.


- మెళియాపుట్టిలో ప్రతి గురువారం జరిగే వారపు సంతలో ఎక్కడా ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రాలు కనిపించవు. ఇనుప గుళ్లతో కొలిచే కాటాలే ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేసిన నిత్యావసరాలను బయట మరోసారి తూకం వేస్తే కిలో దగ్గర 200 గ్రాముల వరకూ తక్కువ వస్తుందంటే మోసం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


- ఇలా పండ్ల నుంచి కూరగాయల వరకూ... నిత్యావసరాల నుంచి పెట్రోల్‌ వరకూ ప్రతి వస్తువు విక్రయంలోనూ జిల్లాలో భారీగా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కల్తీ... మరోవైపు తూకాల్లో మోసాలతో వినియోగదారులు నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. పండ్ల తూకాల్లో మోసాల సంగతి చెప్పనక్కర్లేదు. కిలో దగ్గర 200 గ్రాముల వరకూ తగ్గించి అమ్ముతున్నారు. కొన్ని వస్తువులను ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతల్లో ఇప్పటికీ రాళ్లనే తూనికలకు వినియోగిస్తున్నారు. ఇక సాధారణ తూనిక రాళ్లపై ఎటువంటి ముద్రలూ ఉండవు. అక్కడ వ్యాపారులు చెప్పిందే వేదం. ఎవరైనా వినియోగదారుడు ప్రశ్నిస్తే... అక్కడి వ్యాపారులంతా మూకుమ్మడిగా దాడులకు దిగుతున్న సంఘటనలూ ఉంటున్నాయి. ఈ మోసాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో సగటు వినియోగదారుడికి తెలియని పరిస్థితి నెలకొంది.  


సిబ్బంది కొరత

వినియోగదారులు మోసాలకు గురికాకుండా చూసుకునే బాధ్యత తూనికలు, కొలతల శాఖ అధికారులది. ఇటువంటి శాఖ ఒకటుందని చాలామందికి తెలియదు. జిల్లాలో తనిఖీలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీనికి సిబ్బంది కొరత అని ఆ శాఖ అధికారులు సాకుగా చెబుతున్నారు. ముఖ్యంగా మూడు డివిజన్ల పరిధిలో ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. కానీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొస్తున్నారు.  గత ఏడాది 935 కేసులు నమోదు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  రూ.44.03 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్టు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఇన్ని కేసులు నమోదవుతున్నా మోసాలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరముంది. 


ఫిర్యాదు చేయండి

తూనికలు, కొలతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.  జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపార సంస్థలు నిర్ణీత ప్రమాణాలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. సిబ్బంది కొరత ఉన్నా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నాం. ఎక్కడైనా మోసా లు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. 9398153671, 9398124319, 9441962429 నంబర్లకు ఫిర్యాదు చేయాలి.

- ఎస్‌.విశ్వేశ్వరరావు, తూనికలు, కొలతల జిల్లా సహాయ నియంత్రణ అధికారి, శ్రీకాకుళం 

Updated Date - 2022-01-24T05:17:53+05:30 IST