భవానిపేట సర్పంచ్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు

ABN , First Publish Date - 2021-01-23T05:16:09+05:30 IST

మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామ శివారులో స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి భూ బాగోతంపై ఆరు నెలల కిందటే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

భవానిపేట సర్పంచ్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు
గత సంవత్సరం జూలైలో సర్పంచ్‌ భూ బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలు

- ఎట్టకేలకు కోర్టు నోటీసులతో కదిలిన పోలీసులు
- మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మాచారెడ్డి పోలీసులు
- లేని భూమికి నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించిన సదరు సర్పంచ్‌
- ప్రజాప్రతినిధి భూ బాగోతం కథనంతో వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
-  రికార్డులోంచి 859/డీ సర్వే నెంబర్‌ తొలగించిన రెవెన్యూ అధికారులు
- ఇప్పటికీ రైతుబంధు నిధులను రికవరీ చేయరు.. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు
- జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా పట్టించుకోని వైనం
- సర్పంచ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్న మండల రెవెన్యూ అధికారులు

కామారెడ్డి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామ శివారులో స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి భూ బాగోతంపై ఆరు నెలల కిందటే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు కామారెడ్డి కోర్టు ఇచ్చిన నోటీసుల మేరకు సదరు ప్రజాప్రతినిధిపై మాచారెడ్డి పోలీసులు చీటింగ్‌, ఫోర్జరీ నాన్‌ బెయిలబుల్‌ కింద ఆరు సెక్షన్‌లపై కేసు నమోదు చేశారు. భవానిపేట గ్రామస్థాయి ప్రజాప్రతినిధి లేని భూమికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలినప్పటికీ అతనిపై మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ రికార్డుల్లోంచి లేని భూమికి ఇచ్చిన సర్వే నెంబర్‌ 859/డిని తొలగించారే తప్ప ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి రైతుబంధు పేరిట వేల రూపాయాలను పొందినప్పటికీ ఆ నిధులను రెవెన్యూ అధికారులు ఎందుకు రికవరీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సదరు ప్రజాప్రతినిధిని మండల స్థాయి రెవెన్యూ అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజాప్రతినిధి భూ బాగోతంను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’

మాచారెడ్డి మండలం భవానిపేటలో 859/డీ సర్వే నెంబర్‌పైనే పట్టా భూములు ఉన్నాయి. అయితే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరిట 859/డీ/3 సర్వే నెంబర్‌ను సృష్టించి తమ బంధువుల వద్దనే ఈ సర్వే నెంబర్‌ను 2.09 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు 2015 సెప్టెంబరులో నకిలీ సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని సృష్టించాడు. ఈ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఆధారం చేసుకొని 2015 డిసెంబరు 26న స్థానిక తహసీల్దార్‌ నకిలీ ప్రొసీడింగ్‌ను తయారు చేశారు. ఈ నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా 2015 డిసెంబరు 30న ఖాతా నెంబర్‌ 1,860 పట్టాపాస్‌ పుస్తకాన్ని పొందాడు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ప్రొసీడింగ్‌, పాస్‌ పుస్తకాల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఏకంగా రైతుబంధుతో లబ్ధి పొందుతూ వచ్చాడు. ఈ సర్వే నెంబర్‌తో అదే గ్రామంలో 865 మరో సర్వే నెంబర్‌లో ఉన్న 2.08 ఎకరాల భూమి తమదేనంటూ కబ్జా చేయడంతో బాధితులు ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించడంతో గత సంవత్సరం జూలై 10న జిల్లా ఎడిషన్‌లో ప్రజాప్రతినిఽధి భూ బాగోతం కథనంతో సదరు ప్రజాప్రతినిధి నకిలీ దందా వెలుగులోకి వచ్చింది.
చీటింగ్‌, ఫోర్జరీ, నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ల కింద కేసు నమోదు
భవానిపేట గ్రామ శివారులో లేని భూమికి దొంగ ధ్రువ పత్రాలను సృష్టించడమే కాకుండా, దొంగ సంతకాలు పెట్టి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించడం, నకిలీ రెవెన్యూ ధ్రువ పత్రాలు సృష్టించినందుకు, వీటి ఆధారంగా ప్రభుత్వాన్ని పక్కదోవపట్టించి రైతుబంధు పేరిట ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినందుకు సర్పంచ్‌ రాజుపై మాచారెడ్డి పోలీసులు చీటింగ్‌, ఫోర్జరీ, నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గోపు లక్ష్మీ పేరిట 865 సర్వే నెంబర్‌లో 2.08 ఎకరాల భూమి ఉండగా ఆ భూమికి నకిలీ ధ్రువపత్రాలు, సర్వే నెంబర్‌ 859/డీ,/3 దొంగ సర్వే నెంబర్‌ను సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు యత్నించాడని బాధితులు ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించగా పూర్తి ఆధారాలతో సదరు సర్పంచ్‌ భూ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. వీటి ఆధారంగా బాధితులు మాచారెడ్డి పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన లేకుండా పోయిందని వారు ఆరోపించారు. చివరకు గత సంవత్సరం డిసెంబరులో కామారెడ్డి కోర్టును గోపు లక్ష్మీ ఆశ్రయించారు. కామారెడ్డి కోర్టు మాచారెడ్డి పోలీసులకు నోటీసులు పంపింది. దీని ఆధారంగా మాచారెడ్డి పోలీసులు ఈ నెల 18న భవానిపేట సర్పంచ్‌ రాజుపై 420, 463, 464, 470, 468, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
రైతుబంధు నిధులు రికవరీ చేయకపోవడంలో ఆంతర్యమేంటో?
నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిదే ఆ గ్రామ ప్రజల భూములకు భూ భకాసురుల మింగేయడమే కాకుండా నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ పథకాలతో సొమ్మును స్వాహ చేశాడని అధికారుల విచారణలో బట్టబయలైనప్పటికీ ప్రభుత్వ సొమ్మును ప్రజాప్రతినిధుల నుంచి కక్కించడంలో మండల స్థాయి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవానిపేట గ్రామ శివారులో లేని భూమికి దొంగ ధ్రువపత్రాలు, నకిలీ సర్వే నెంబర్‌లు సృష్టించి వాటి ఆధారంగా క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించి రైతుబంధు పథకం నిధులను 2018 నుంచి 2020 వరకు 5 సార్లు రూ.51 వేల 175 ప్రభుత్వ సొమ్మును అడ్డదారిన స్వాహ చేసినట్లు అధికారుల విచారణలోనూ తేలింది. అయితే ప్రజా సొమ్మును ఓ ప్రజాప్రతినిధి అక్రమంగా స్వాహ చేసినప్పటికీ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. కేవలం నకిలీ సర్వే నెంబర్‌ను రెవెన్యూ రికార్డుల్లోంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. కానీ స్థానిక మండల రెవెన్యూ అధికారులకు విచారణలో భవానిపేట సర్పంచ్‌ దొంగ ధ్రువపత్రాలు, నకిలీ సర్వే నెంబర్‌లు సృష్టించాడని తెలిసినప్పటికీ అతనిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఇప్పటి వరకు చీటింగ్‌ కేసు కూడా నమోదు చేయకపోవడం పట్ల ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలలు గడుస్తున్నా కేసు నమోదు కాదు కదా అడ్డదారిన ప్రభుత్వ సొమ్ము కాజేసిన ప్రజాప్రతినిధి నుంచి ఆ నిధులను స్థానిక తహసీల్ధార్‌ రికవరీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం తర్వాత కలెక్టర్‌ శరత్‌ స్పందించి సదరు ప్రజాప్రతినిధిపై సమగ్ర విచారణ జరిపి రైతుబంఽధుపేరిట స్వాహ చేసిన నిధులను రికవరీ చేయాలని ఆదేశించినప్పటికీ మండలస్థాయి రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సదరు సర్పంచ్‌ను స్థానిక మండల రెవెన్యూ అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై సర్పంచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై స్థానిక మాచారెడ్డి తహసీల్ధార్‌ శ్రీనివాస్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా అందుబాటులోకి రావడం లేదు.

భవానిపేట సర్పంచ్‌పై కేసు నమోదు చేశాం
- శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ, మాచారెడ్డి.
మాచారెడ్డి మండలంలోని భవానిపేట సర్పంచ్‌ మద్దెల రాజుపై చీటింగ్‌, ఫోర్జరీ కింద కేసు నమోదు చేశాం. సర్పంచ్‌ నకిలీ ధ్రువ పత్రాలు సర్వే నెంబర్‌లు సృష్టించి తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని గోపు లక్ష్మీ, కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నోటీసుల ఆధారంగా భూమి కబ్జా చేసేందుకు, నకిలీ ధ్రువ పత్రాలు, సర్వే నెబర్‌ సృష్టించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రజల సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సర్పంచ్‌ రాజుపై ఆరు సెక్షన్‌ల కింద చీటింగ్‌, ఫోర్జరీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం.

Updated Date - 2021-01-23T05:16:09+05:30 IST