చిట్‌ల పేరిట టోకరా

ABN , First Publish Date - 2022-05-15T06:32:44+05:30 IST

అనధికారికంగా చిట్‌లు నిర్వహించి సుమారు కోటి రూపాయల మేర టోపీ పెట్టిన సంఘటన గాజువాక సింహగిరి కాలనీలో చోటుచేసుకుంది.

చిట్‌ల పేరిట టోకరా
ఫిర్యాదు చేసేందుకు గాజువాక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన బాధితులు

గాజువాకలో దంపతుల మోసం

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

సుమారు రూ.కోటి వరకూ రావాలని ఫిర్యాదు

మరోవైపు తన భర్త అదృశ్యమైనట్టు చిట్‌ నిర్వాహకుడి భార్య ఫిర్యాదు


గాజువాక, మే 14: అనధికారికంగా చిట్‌లు నిర్వహించి సుమారు కోటి రూపాయల మేర టోపీ పెట్టిన సంఘటన గాజువాక సింహగిరి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహగిరి కాలనీకి చెందిన నరసింగరావు, గంగాభవానీ దంపతులు స్థానికంగా అందరితో మంచిగా వుంటూ రూ.రెండు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ చిట్‌లు నిర్వహించేవారు. అయితే కొద్ది నెలలుగా చిట్‌లు పాడినా తమకు నగదు చెల్లించడం లేదంటూ సుమారు 30 మంది శనివారం పోలీసులను ఆశ్రయించారు. తమకు రూ.కోటి వరకు ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నరసింగరావు ఆచూకీ లేకపోవడంతో ఆయన భార్య గంగాభవానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త నరసింగరావు షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడని, కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కాగా, దంపతులు నరసింగరావు, గంగాభవానీలు తమ సొంత ఇల్లు కూడా అమ్మేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-15T06:32:44+05:30 IST