HYD : ప్రముఖ వ్యాపారవేత్తపై చీటింగ్ కేసు.. రంగంలోకి దిగిన Stephen Ravindra..

ABN , First Publish Date - 2021-11-11T16:55:38+05:30 IST

5వ అంతస్తులో సుమారు 26వేల చదరపు అడుగుల స్థలాన్ని...

HYD : ప్రముఖ వ్యాపారవేత్తపై చీటింగ్ కేసు.. రంగంలోకి దిగిన Stephen Ravindra..

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : ప్రముఖ వ్యాపారవేత్త, బిల్డర్‌ సంధ్యా కన్వెన్షన్‌ అధినేత సరనాల శ్రీధర్‌రావుపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. బుధవారం రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావును అరెస్టు చేసి ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు, ఫిర్యాదుదారులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెంబర్‌ 86,87,88,90,91,92లోని స్థలంలో శ్రీధర్‌రావు కమర్షియల్‌ భవనం నిర్మించారు. 5వ అంతస్తులో సుమారు 26వేల చదరపు అడుగుల స్థలాన్ని మాదాపూర్‌లోని గేట్‌వే ప్రాంతంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల నిర్వహకులు 12మందికి రూ.17కోట్లకు విక్రయించేందుకు 2018లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పలు దఫాలుగా రూ.11.24 కోట్లు చెల్లించారు.


2018 ఏప్రిల్‌ వరకు పనులు పూర్తిచేసి అప్పగిస్తానని హామీ ఇచ్చిన శ్రీధర్‌రావు భవన నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. శ్రీధర్‌రావు తీరుపై కొనుగోలు దారులు పలు దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదు. ఇదిలావుండగానే శ్రీధర్‌రావు నిర్మించిన కమర్షియల్‌ భవనం వెనుకభాగం కొంత ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించాడని జీహెచ్‌ఎంసీ నుంచి శ్రీధర్‌రావుకు నోటీసులు అందాయి. దీంతో శ్రీధర్‌రావుతో తాము కుదుర్చుకున్న భవన నిర్మాణంలో వెనుకభాగం ఒక పిల్లర్ల వరుస మొత్తం తొలగించాల్సి వస్తుందని దీని వల్ల బిల్డింగ్‌ స్లాబ్‌స్ట్రక్చర్‌ దెబ్బతినే అవకాశం ఉందని, దీనిపై శ్రీధర్‌రావుతో మాట్లాడదామని ప్రయత్నించినా ఆయన స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. సీపీ స్టీఫెన్‌ రవీంద్రను ఆశ్రయించిన బాధితులు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 9న శ్రీధర్‌రావుపై ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌రావు పై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2021-11-11T16:55:38+05:30 IST