పలమనేరు ఏటీఎంలో చీటింగ్‌

ABN , First Publish Date - 2022-08-17T05:43:48+05:30 IST

పలమనేరు పట్టణంలోని మదనపల్లె రోడ్డు పక్కన ఉన్న స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొనేందుకు వెళ్లిన వ్యక్తి నుంచి ఏటీఎం కార్డు తీసుకొని మరో కార్డు చేతిలో పెట్టి రూ.36 వేలు డ్రా చేసుకొని ఉడాయించిన ఆగంతకుడి ఉదంతమిది.

పలమనేరు ఏటీఎంలో చీటింగ్‌
పలమనేరు ఎటీఎంలో మోసపోయిన బాదితుడు జమీల్‌

రూ.36వేల గల్లంతు 


పలమనేరు, ఆగస్టు 16:
పట్టణంలోని మదనపల్లె రోడ్డు పక్కన ఉన్న స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొనేందుకు వెళ్లిన వ్యక్తి నుంచి ఏటీఎం కార్డు తీసుకొని మరో  కార్డు చేతిలో పెట్టి రూ.36 వేలు డ్రా చేసుకొని ఉడాయించిన ఆగంతకుడి ఉదంతమిది. బాధితుడి  ఫిర్యాదు మేరకు పోలీసులకు అందించిన వివరాలు... పలమనేరు పట్టణ సమీపంలోని సిల్కుఫారం వద్ద నివాసముంటున్న జమీల్‌ మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన బావ మౌలా వద్ద తన ఏటీఎం కార్డు ఇచ్చి, పిన్‌ నెంబరు చెప్పి రూ.4వేలు డ్రా చేసుకు రమ్మని పంపించారు. మౌలా పట్టణంలోని మదనపల్లె రోడ్డు పక్కన ఉన్న ఏటీఎంకు వెళ్లాడు.  అక్కడ ఉన్న ఓ యువకుడికి ఏటీఎం కార్డు ఇచ్చి, పిన్‌ నెంబర్‌ చెప్పాడు. అతను మౌలా చెప్పిన విధంగానే రూ.4వేలు డ్రా చేసి డబ్బులు చేతికిస్తూ మరో ఏటీఎం కార్డు అతని చేతిలో పెట్టి పంపేశాడు. మధ్యాహ్నం జమీల్‌ ఖాతాలో రూ.10వేలు చొప్పున మూడుసార్లు, రూ.6వేలు చొప్పున ఒకసారి డ్రా చేసినట్టు బ్యాంకు నుంచి మెసేజ్‌ రావడంతో  ఖంగుతిన్నాడు. వెంటనే పలమనేరు స్టేట్‌ బ్యాంకుకు వెళ్లి విషయం చెప్పడంతో వారు అతని బ్యాంకు ఖాతా స్టేట్‌ మెంట్‌ తీసి ఇచ్చారు. అందులో ఆగంతకుడు నాలుగు పర్యాయాలు రూ.36 వేలు డ్రాచేసిన విషయం నిర్ధరించుకొని పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-08-17T05:43:48+05:30 IST