పెన్షన్‌ పేరుతో టోకరా..!

ABN , First Publish Date - 2020-11-10T07:05:39+05:30 IST

బోర్డు తిప్పేసిన నిర్వాహకుడు

పెన్షన్‌ పేరుతో టోకరా..!
పెన్షన్‌ పథకం నిర్వాహకుడు రూపేష్‌ రాసిచ్చిన ప్రామిసరీ నోటు

- నెలనెలా చెల్లింపులంటూ భారీగా వసూళ్లు

- కరోనా పేరుతో బోర్డు తిప్పేసిన నిర్వాహకుడు

- 45వేలకు పైగా కస్టమర్లు..రూ.50 కోట్ల దాకా వసూలు 


‘మా స్కీంలో ఒకసారి రూ.12వేలు చెల్లించండి. నెలనెలా క్రమం తప్పకుండా రూ.3వేలు అందుకోండి. మీ జీవితానికి భరోసా, ఆసరా ఇచ్చే పథకం ఇది. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరికీ మహిళలయితే అయిదు చీరలు, పురుషులయితే మూడు ప్యాంట్లు, మూడు షర్టులు కూడా ఉచితం. అమెరికాలో స్థిరపడిన కొందరు భారతీయులు ఓ వైపు మనకు సహాయం చేస్తూనే, ట్యాక్సు నుంచి మినహాయింపు పొందడానికి ఏర్పాటు చేసిన స్కీమే ఈ పెన్షన్‌ పథకం’ అంటూ ప్రచారం చేశాడు ఓ యువకుడు.ప్రచారం చేయడమే కాదు..ఏకంగా ఏడాదిపాటు నడిపించి వేలాదిమంది నుంచి 50కోట్ల రూపాయల దాకా వసూలు చేశాడు కూడా. చివరకు కరోనా పేరుతో బోర్డు తిప్పేశాక వేలమంది డిపాజిట్‌దారులు లబోదిబోమంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. 

మదనపల్లె, నవంబరు 9: పెద్దమండ్యం మండలంచెరువుకిందపల్లెకు చెందిన రూపేష్‌కుమార్‌ డిగ్రీవరకు చదువుకున్నాడు.ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా తిరుగుతోన్న ఆ యువకుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తాను ఉద్యోగం చేసే క్రమంలో అమెరికాలో ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా..స్వదేశీయులకు సహాయం చేయడానికి ముందుకొచ్చారని నమ్మించాడు.ఒకసారి కంపెనీకి రూ.12వేలు చెల్లిస్తే, నెలనెలా జీవితాంతం రూ.3వేలు పెన్షన్‌ వస్తుందని చుట్టుపక్కలవారిని నమ్మించాడు.స్కీంలో చేరిన మరుసటి నెల నుంచే పెన్షన్‌ ఇవ్వడంతో పెద్దమండ్యం మండలంలో ప్రారంభమైన ఈ పథకం అనతికాలంలోనే  కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురం, కోలారు, చింతామణి, బాగేపల్లె ప్రాంతాలతోపాటు అనంతపురం, కడప జిల్లాలకూ విస్తరించింది. ఏడాదిలోనే వందల సంఖ్యలో ఏజెంట్లు, 45వేలమంది ఖాతాదారులు, రూ.కోట్లలో టర్నోవర్‌కు చేరుకుంది. ఒక్కో ఇంట్లో కనీసం ఇద్దరి నుంచి ఆరుగురు చొప్పున, ఒక్కో ఏజెంట్‌ పరిధిలో వందల నుంచి వేలసంఖ్యలో కస్టమర్లు చేరిపోయారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం..2020 ఫిబ్రవరితో బ్రేక్‌ పడిందని కస్టమర్లు చెబుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో చెల్లింపులకు బ్రేక్‌ పడడంతో ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు. నిర్వాహకుడు రూపేష్‌కుమార్‌ కూడా ఇదే చెబుతూవచ్చాడు. అక్కడక్కడ కస్టమర్లు ఏజెంట్లను నిలదీయడం, దీనిపై ఏజెంట్లు కూడా నిర్వాహకున్ని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో నిర్వాహకుడు... ఈమధ్య కాలంలో కొందరు ఏజెంట్లు, కస్టమర్లకు రూ.5కోట్ల వరకూ డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. వత్తిళ్లు అధికం కావడంతో పరారయ్యాడు. ప్రజల నుంచి సేకరించిన డబ్బులతో రాయచోటి, తిరుపతి, మదనపల్లె ప్రాంతాల్లో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.డిపాజిటర్ల నుంచి ఒత్తిళ్లు అధికమవడంతో వీటిలో కొన్ని అమ్ముతూ చెల్లింపులు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రూపేష్‌ పరారీతో పెద్దమండ్యంతోపాటు కడప జిల్లా సుండుపల్లె, గాలివీడు, అనంతపురం జిల్లా ఎన్‌.పి.కుంట, కదిరి తదితర ప్రాంతాల్లో అలజడి ఏర్పడింది. స్కీం ప్రారంభంలో చేరిన వారు లాభపడినా..ఆలస్యంగా చేరిన వారు నష్టపోయారు. ఇలాంటి వారి నుంచే అక్కడక్కడ ఆందోళన మొదలవడంతో పెద్దమండ్యం పోలీసులు స్పందించారు. వారంరోజుల క్రితం కడప జిల్లాలో రూపేష్‌ను అదుపులోకి తీసుకుని పెద్దమండ్యానికి, ములకలచెరువు సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు.నిందితుడిచ్చిన సమాచారం మేరకు పెద్దమండ్యం మండలంలో 40 మంది ఏజెంట్లున్నట్టు గుర్తించారు. వారిలో 15 మంది జాబితా సిద్ధం చేశారు. డిపాజిటర్లకు సొమ్ములు ఇవ్వాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏజెంట్లుగా ఉన్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, కొందరు మహిళలు పోలీసుల పంచాయితీలో ఒప్పందం చేసుకుని సొమ్ములు చెల్లించేస్తున్నారు.వారంరోజుల క్రితం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న బాధితులు..వివిధ ప్రాంతాల నుంచి పెద్దమండ్యానికి భారీగా చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. విచారణ పేరుతో పోలీసులు రూపేష్‌కుమార్‌ను ములకలచెరువుకు, తర్వాత పెద్దమండ్యం స్టేషన్‌కు తీసుకొచ్చి వదిలేశారని బాధితులు వాపోతున్నారు. 


Updated Date - 2020-11-10T07:05:39+05:30 IST