Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మోసం గురూ..!

twitter-iconwatsapp-iconfb-icon
మోసం గురూ..!

డ్వాక్రామహిళలకు రుణమాఫీలో భాగంగా రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆరువేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాలో వేశారు. ‘చరిత్ర ఎరుగని ఆసరా ఇది’ అని తన సొంత పత్రికలో తాటికాయంత అక్షరాలతో రాయించుకున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద సహాయమే. అయితే ఇది చరిత్ర ఎరుగని మోసమని ఎంత మందికి తెలుసు? నవరత్నాల పేరిట జగన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అంతా మోసమే ఉంటోందని ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేసి తన పేరు, తన తండ్రి పేరు మీద జగన్‌బాబు కొత్త పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మొదట్లో ఈ విషయం తెలియక ప్రజలు ముఖ్యంగా లబ్ధిదారులు ఆయన మాయలో పడ్డారు. పథకాల లోగుట్టు తెలిశాక ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ఈ కారణంగానే గురువారం ఒంగోలులో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు హాజరైన మహిళలు చప్పట్లు కొట్టడానికి కూడా ఇష్టపడలేదు. అధికారులు ఒత్తిడి తేవడంతో సదరు సభకు హాజరుకాక తప్పడం లేదని డ్వాక్రా మహిళలు పలువురు వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరిట జగన్‌ రెడ్డి చేస్తున్న మోసం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్వయంఉపాధి కింద ఆర్థికసహాయం అందించడం కోసం రాజ్యాంగబద్ధంగా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. కేంద్రప్రభుత్వం సబ్సిడీ కింద సహాయం చేస్తుంది. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల నుంచి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ మొత్తాలను నవరత్నాల అమలుకు బదిలీ చేస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రుణసహాయం నిలిచిపోయింది. చట్టబద్ధంగా ఏర్పాటైన కార్పొరేషన్లను డమ్మీలుగా మార్చారు. ఈ వర్గాలకు చట్టబద్ధంగా అందవలసిన సహాయం ఆపివేసి అమ్మ ఒడి, ఆసరా పేర్లతో పంచిపెట్టడం మొదలుపెట్టారు. దీనికే చరిత్ర ఎరుగని ఆసరా అని జబ్బలు చరుచుకుంటున్నారు. జరుగుతున్న మోసాన్ని గ్రహిస్తున్న ప్రజలు అధికారుల ఒత్తిడితో ముఖ్యమంత్రి సభకు హాజరై ‘మమ’ అనిపించుకుంటున్నారు. ఏ పథకంలో చూసినా ఇటువంటి వంచనే కనిపిస్తోంది. ఈ విషయం తెలిసి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు నోళ్లకు తాళం వేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. జగన్‌ రెడ్డి ప్రారంభించిన చాలా పథకాలు పాత వాటి స్థానంలో రూపొందించినవే. అయినా రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. అప్పు చేయనిదే పూట గడవని దుస్థితికి రాష్ర్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ఎడాపెడా కుదువ పెడుతున్నారు. భవిష్యత్‌ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. అయినా కరువు తీరడం లేదు. ఆర్థికమంత్రి బుగ్గన, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌ అయితే ఢిల్లీలో లేదా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పటికే  రెండులక్షల కోట్ల రూపాయల వరకు అప్పు చేశారు. అంత అప్పు చేసి కూడా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. అయినా ప్రతి నెలా జీతాలకు కటకటే. దసరా పండుగ సమీపిస్తున్నప్పటికీ పెన్షనర్లలో పలువురికి ఇంకా పెన్షన్‌ అందలేదు. దాల్‌ మే కుచ్‌ కాలా హై అన్నట్టు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో ఏదో లోపం ఉంది. విశాఖపట్నంలోని 2,954 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ఎస్‌బీఐకి తాకట్టు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వాలు ఇచ్చే హామీల ఆధారంగా వివిధ ఆర్థికసంస్థలు సహాయం చేస్తాయి. ఇలా ఆస్తులు కుదువ పెట్టుకుని అప్పులు ఇవ్వడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. దీనికి ఎస్‌బీఐ అధికారులే సమాధానం చెప్పాలి. ‘‘ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు చేయవచ్చునన్న గొప్ప ఆలోచన పూర్వ ముఖ్యమంత్రులు ఎవరికీ రాకపోవడం ఈయన గారి అదృష్టం. రాష్ట్ర దురదృష్టం! భవిష్యత్తులో ఈయనను ఆదర్శంగా తీసుకుని ఏ ముఖ్యమంత్రీ దేన్నీ వదలరు. ప్రభుత్వ బ్యాంకులు ఇలాంటి అప్పులు ఎలా ఇస్తున్నాయో తెలియదు. రేపు అప్పులు చెల్లించకపోతే ప్రభుత్వ ఆస్తులు వేలం వేస్తారా?’’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. రాష్ర్టానికి ఈ దురదృష్టం పట్టడంలో ఈయనగారి పాత్ర కూడా ఉందని ఇప్పుడు జనం చెవులు కొరుక్కుంటున్నారు. నిన్నటి వరకు జగన్‌ రెడ్డిని వెనుకేసుకొచ్చిన వారిలో పలువురు ఇప్పుడు కృష్ణారావు బాటలోనే నొసలు చిట్లిస్తున్నారు. అప్పు కోసం ప్రభుత్వం ఇచ్చే కౌంటర్‌ గ్యారంటీని జగన్‌ ప్రభుత్వం గరిష్ఠంగా వాడుకుంది. ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేని కారణంగానే జగన్‌ బాబు గొప్పగా ప్రచారం చేసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రుణ సహాయం చేయడానికి కేంద్ర ఆర్థికసంస్థలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అయినా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని నిన్నటి వరకు గొంతు చించుకున్న మహానుభావులు ఇప్పుడు నోరు తెరవలేకపోతున్నారు. ‘‘అప్పటి ముఖ్యమంత్రి రాయలసీమ జిల్లాల పర్యటన అనగానే ఎలా అడ్డం పడాలా అని ప్రణాళికలు రచించేవారు సీమ ప్రేమికులు. అయితే జగన్‌ రెడ్డి ఇప్పుడు రాయలసీమకు ఏం చేశాడో అర్థం కావడం లేద’’ని ప్రతాపరెడ్డి అనే ఆయన ట్విటర్‌ వేదికగా నిర్వేదం వ్యక్తంచేశారు. రాయలసీమలో అభివృద్ధి మృగ్యమైనా జగన్‌ రెడ్డి తమవాడు కనుక రాయలసీమ ప్రేమికులకు నోరు పెగలడం లేదు కాబోలు! 


అడగకుంటే అథోగతే!

ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న జాడ్యాలలో కులపిచ్చి ప్రధానమైనదని వేరే చెప్పనవసరం లేదు. జగన్‌ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పులే కనిపిస్తున్నాయి కానీ అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు లక్షకోట్లు దాటి పోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని మునుపెన్నడూ చూడలేదు. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు ఏళ్లు గడుస్తున్నా అందని కారణంగా చిన్నా చితకా కాంట్రాక్టర్లు మానసిక ఆందోళనకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఒక చిన్న కాంట్రాక్టర్‌ బిల్లు బకాయిల కారణంగా అకాలమరణం చెందారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టర్లు తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించనందున హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లోగా వారందరికీ బకాయిలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో వాదనల సందర్భంగా హైకోర్టును తప్పుదారి పట్టించడం కోసం ప్రభుత్వం ప్రయత్నించడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కూడా సకాలంలో కౌలు చెల్లించని కారణంగా వారు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వారూ వీరూ అని తేడా లేకుండా ప్రభుత్వం నుంచి బిల్లులు రావలసిన వారంతా హైకోర్టు తలుపు తడుతున్నారు. బిల్లులు సకాలంలో అందని కారణంగా అప్పులపాలైన కాంట్రాక్టర్ల నుంచి ముష్టిలో వీరముష్టి వలె కమీషన్లు దండుకుంటున్నారు. ఇంతకంటే అమానవీయం ఇంకొకటి ఉంటుందా! ఆర్థిక ఉత్పాతం కళ్లెదురుగా కనిపిస్తున్నప్పటికీ తన ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని జగన్‌ రెడ్డి స్వీయకితాబులు ఇచ్చుకుంటున్నారు. ఆయన వెనుక ఉన్న నీలి మీడియా, నీలిమూక చుట్టూచేరి చిడతలు వాయిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగినవారు మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో ఊరూవాడా తిరిగి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసిన మహానుభావులు ఇప్పుడు జగన్‌ రెడ్డి దయతో లభించిన పదవులలో స్థిరపడిపోయారు. ‘ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడును ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్తుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది’ అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి రాష్ర్టాన్ని ఎటు తీసుకువెళుతున్నదీ తెలిసి కూడా ప్రశ్నించలేకపోవడం నేరమే అవుతుంది. సమంత–-నాగచైతన్య విడాకుల వార్త పట్ల చూపిస్తున్న ఆసక్తిలో పది శాతం కూడా రాష్ట్రప్రజలు తమ భవిత గురించి ఆలోచించకపోవడం విషాదమే. ఇవాళ పీతల ఇగురు వండించుకుందామా? చేపల పులుసు పెట్టించుకుందామా? రాగి సంగటి, నాటుకోడి కూరతో లాగిద్దామా? అంటూ ఆలోచించే వారిని చూసి జాలిపడ్డం మినహా చేయగలిగింది ఏమీ లేదు. ఇంతకాలంగా ప్రభుత్వానికి భయపడి వినయవిధేయతలు ప్రదర్శిస్తూ వచ్చిన ఉద్యోగసంఘాల నాయకులు కూడా ఇప్పుడు ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా నోరు తెరవక తప్పడం లేదు. పీఆర్సీ ఎప్పుడు అమలవుతుందో తెలియకపోయినా ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఎన్జీవో నాయకులు ఉండటం విడ్డూరం. విధిలేని పరిస్థితులలో ఉద్యోగ సంఘాల నాయకులు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి వినయపూర్వకంగా, వినమ్రంగా హెచ్చరిక చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వ పెద్దలు ఎంతలా భయపెడుతున్నారో తెలియజెప్పే సంఘటన విలేకరుల సమావేశం సందర్భంగానే జరగడం విశేషం. విలేకరుల సమావేశం పెడితే పెట్టారు గానీ కంట్రోల్లో ఉండండి అని సజ్జల రామకృష్ణా రెడ్డి హెచ్చరించడంతో.. చిత్తం.. కంట్రోల్లోనే ఉంటాం సార్‌! ..అని బండి శ్రీనివాసరావు అనే నాయకుడు వణికిపోతూ బదులివ్వడాన్ని విన్నాం, చూశాం. జగన్‌ ప్రభుత్వం వ్యవస్థలను ఎలా చెరబడుతున్నదో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఒకప్పుడు ఎన్జీవో నాయకులు ప్రభుత్వాలను వణికించేవారు. తెలంగాణలో కూడా ఎన్జీవో నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటానికి క్షీరాభిషేకం చేయించడానికే పరిమితం అవుతున్నారు. బలమైన ఎన్జీవో సంఘాలకు బలహీనమైన నాయకులు రావడంవల్లనే ప్రస్తుత దుస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రులను హడలెత్తించిన ఎన్జీవో నాయకులను చూశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి దర్శనం కూడా పొందలేకపోతున్న నాయకులనూ చూస్తున్నాం. ఎవరిని ఎంతగా భయపెట్టినా పర్వాలేదు గానీ రాష్ర్టాన్నయినా సరైన మార్గంలో తీసుకువెళుతున్నారా అంటే అదీ లేదు. తాను అనుకున్న వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాకో వైద్య కళాశాల అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. టెండర్లు కూడా ఖరారు చేశారు. రుణసహాయం అందని కారణంగా నిర్మాణపనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ఆర్థికసమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోండని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమీక్షలు ముగిస్తున్నారు. ‘అప్పు పుట్టే మార్గం లేనప్పుడు మేం మాత్రం ఏం చేయగలం?’ అని అధికారులు వాపోతున్నారు. నిధుల లభ్యత లేని ఏ పనులనూ చేపట్టకూడదని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఫలితంగా రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ విశ్వసనీయత ఇంతలా దిగజారిపోయినందుకు పాలకులు సిగ్గుపడాలి!


కేసీఆర్‌దీ అదే బాణీ..

తెలంగాణకైనా, ఆంధ్రప్రదేశ్‌కైనా రాష్ట్ర విభజన మంచి చేసిందా? చెడు చేసిందా? అంటే ఇప్పుడు ఎటూ చెప్పలేని స్థితికి చేరాం. విభజన తర్వాత కొంతకాలం పాటు రెండు రాష్ర్టాలూ అభివృద్ధిలో పోటీపడ్డాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి టర్మ్‌లో రాష్ర్టాన్ని ప్రగతిమార్గంలోనే నడిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను పూర్తిచేశారు. హైదరాబాద్‌ మహానగరాన్ని కూడా అభివృద్ధి చేశారు. అధికారులు కూడా కొత్తమోజుతో పాటు తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నందున రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఫలితంగా విడిపోవడం వల్ల తెలంగాణకు మేలు జరిగిందని సమైక్యవాదులు కూడా అంగీకరించారు. రాజధాని కూడా లేకుండా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను గాడినపెట్టడానికి చంద్రబాబు కొంతమేరకు కృషి చేశారు. పైసా ఖర్చు లేకుండా రాజధానికి భూమి సేకరించారు. కియా వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయించారు. అయితే పాలనాపరంగా, రాజకీయంగా కొన్ని తప్పులు చేయడంతో ప్రజలు ఆయన చేసిన కృషిని ఆమోదించలేదు. దీనికితోడు వ్యక్తులు, శక్తులు చేసిన దుష్ప్రచారంతో అధికారం కోల్పోయారు. తెలంగాణలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ పనితీరు ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేసిన కృషి కారణంగా హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధి చెంది తెలంగాణ ధనికరాష్ట్రం అయింది. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ఇరువురు మాజీ ముఖ్యమంత్రులనూ ఎగతాళి చేసినా వాస్తవం ఇదే. చంద్రబాబు కృషి వల్లే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వచ్చిందని మంత్రి కేటీఆర్‌ బాహాటంగానే అంగీకరించారు కదా! కారణం ఎవరైనా హైదరాబాద్‌ వల్ల తెలంగాణ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అధికారం చేపట్టేనాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణలో ఇప్పుడు అప్పులు పెరిగిపోయాయి. కేసీఆర్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాల భారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. రాజకీయంగా బలహీనపడుతున్నాను అని భావించినప్పుడల్లా కేసీఆర్‌ ఏదో ఒక కొత్త పథకం ప్రారంభిస్తూ వస్తున్నారు. దళితబంధు పథకం కూడా ఈ కోవలోనిదే. మొత్తంగా రాష్ట్రంపై ఆర్థికభారం పెరిగిపోయింది. ఉభయ రాష్ర్టాలూ గిల్లికజ్జాలు పెట్టుకుని నీటి ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నాయి. దీంతో వాటికి అప్పులు ఇవ్వడానికి కేంద్ర ఆర్థికసంస్థలు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా పాలమూరు-–రంగారెడ్డి వంటి పథకాల అమలు ప్రశ్నార్థకమైంది. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితి వచ్చింది. కేసీఆర్‌ ఇస్తూ వచ్చిన అడ్డం పొడవు హామీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ అంత కాకపోయినా బాగా దెబ్బతిన్నది. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు పెరిగిపోతున్నాయి. జగన్‌ రెడ్డి బాటలోనే కేసీఆర్‌ కూడా పయనించడం మొదలుపెట్టారు. దీంతో ఏడున్నరేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ ధనిక రాష్ట్రమా? అంటే చెప్పలేని పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ ఉంటే తెలంగాణలో ప్రభుత్వ భూములను ఎడాపెడా అమ్ముతూ సంక్షేమం పేరిట ఖర్చు చేస్తున్నారు. తన నీడను చూసి తానే భయపడే పరిస్థితికి కేసీఆర్‌ చేరుకున్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం కేసీఆర్‌ భూమ్యాకాశాలను ఏకం చేయడాన్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్నంత కాలం తెలంగాణకు అండగానే ఉంటుంది. కేసీఆర్‌ కూడా అదే ధీమాతో ఉన్నారు. అయితే సంక్షేమం విషయంలో జగన్‌ రెడ్డితో పోటీ పడాలనుకుంటే మాత్రం తెలంగాణ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. రెండు తెలుగు రాష్ర్టాలలోనూ అపసవ్య విధానాలు అవలంబించడం వల్ల గతం నుంచి అమలులో ఉన్న పథకాలు కుంటుపడుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు పెరిగిపోతున్నాయి. రెండు రాష్ర్టాలలో కూడా ఆరోగ్యశ్రీ బిల్లులను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ కారణంగానే అనేక ఆస్పత్రులలో రోగులకు ఈ పథకం కింద చికిత్స అందడం లేదు. తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా ప్రభుత్వ ప్రాధాన్యాలు దారితప్పడం వల్లనే ప్రస్తుత గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేసీఆర్‌ ఏం చేసినా రాజకీయ ప్రయోజనం చూసుకుంటారన్న అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా వ్యాపించడం వల్ల ఆయన దళితబంధు వంటి పథకాలకు శ్రీకారం చుట్టినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. కేసీఆర్‌ మాటలకు తెలంగాణ ప్రజలు ఇప్పుడు మోసపోయే పరిస్థితి లేదు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడం కోసం ఇటు కేసీఆర్‌, అటు జగన్‌ రెడ్డి ఒకే తరహా ఆలోచన చేస్తున్నారు. అయితే సదరు ఆలోచనలు వికటించడం మొదలైంది. ఫలితంగా ఇరువురు ముఖ్యమంత్రులూ ప్రజల్లో పలుచన అవుతున్నారు. అధికారాన్ని వదులుకోవడానికి ప్రాణం ఒప్పదు గనుక ఈ ఇరువురు నాయకులూ మున్ముందు ఇంకే పథకాలకు రూపకల్పన చేస్తారో తెలియదు. నాయకుల అధికార కాంక్షకు తెలుగు రాష్ర్టాలు బలి కాకూడదని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించేవారిని జగన్‌ ప్రభుత్వం భయపెట్టి నోళ్లు మూయించగా, తెలంగాణలో ప్రశ్నిస్తారనుకొనే వారిలో పలువురికి పదవులు కట్టబెట్టి వారిని కేసీఆర్‌ తన గడీలో కట్టేసుకున్నారు. దీంతో ప్రజలే ప్రశ్నించే బాధ్యతను చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాలకు లొంగిపోతే కేసీఆర్‌, జగన్‌ బాటలో మనకు మరెందరో పౌండ్రక వాసుదేవులు పుట్టుకొస్తారు. ఎవరికి వారు ‘కొత్తా దేవుళ్ల’మని ప్రకటించుకుంటారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును పథకాల పేరిట ఓట్లు కొనుగోలు చేయడానికి వెచ్చిస్తారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్నా మౌనంగా ఉండే మేధావులను భావితరాలు క్షమించవు. అప్పులు చేసి, ఆస్తులు అమ్మి సంక్షేమం పేరిట ఖర్చు చేసే అధికారం నాయకులకు ఉంటుందా? ఈ అంశంపై తెలుగు రాష్ర్టాలలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దేశంలో న్యాయవ్యవస్థ ఇప్పుడు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నందున బడ్జెట్‌లో సంక్షేమం పేరిట ఖర్చు చేసే నిధులపై సీలింగ్‌ విధించడానికి చొరవ తీసుకోవడం అవసరం. పులి మీద స్వారీ చేస్తున్న రాజకీయపార్టీలు తమంత తాముగా ఈ పని చేయవు. పరిధిలో లేకపోయినా న్యాయవ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకుంటే రాజకీయ నాయకులే మొదటగా సంతోషిస్తారు. చీకటిలో వచ్చి అభినందనలు తెలుపుతారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చురుగ్గా వ్యవహరిస్తున్నందున ఈ విషయం ఆలకిస్తారని ఆశిద్దాం. సంక్షేమంపై పరిమితులు విధించగలిగితే ఆయన దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. చరిత్రలో నిలిచిపోతారు. సాధ్యం కాని పక్షంలో దేశంలోని అన్ని రాష్ర్టాలూ ఆంధ్రప్రదేశ్‌ బాటనే ఎంచుకుంటాయి. ముందు రాష్ర్టాలు, ఆ తర్వాత దేశం దివాలా తీస్తాయి!

ఆర్కే

మోసం గురూ..!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.