అవ్వాతాతలకు మోసం!

ABN , First Publish Date - 2022-01-01T06:51:48+05:30 IST

అవ్వాతాతలకు మోసం!

అవ్వాతాతలకు మోసం!

పింఛనుపై మాట తప్పిన జగన్‌


3వేలు చేస్తామని ఎన్నికలముందు హామీ.. అధికారంలోకి రాగానే విడతల పేరిట మడత

250 చొప్పున పెంచుతామని ప్రకటన.. 2020లోనే రూ.2500 కావాల్సిన పింఛను

ఏడాదిన్నర ఆలస్యంగా ఇప్పుడు పెంపు.. దానికే సంబరాలంటూ హడావుడి, ఆర్భాటం

కొత్త పథకమైనట్లుగా నేడు సీఎంతో ‘ప్రారంభం’


అధికారంలోకి వస్తే పింఛను రూ.3వేలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అవ్వా తాతలు ఓట్లు వేసి గెలిపించగానే... ‘దశలవారీ’గా రూ.3వేలు చేస్తామని మాట తప్పారు!

విడతల వారీగా పింఛను మొత్తం పెంచడంలోనూ మడమ తిప్పారు. జగన్‌ చెప్పిన ప్రకారం 2020 జూలై నుంచే పింఛను రూ.2500 కావాలి. కానీ... ఏడాదిన్నర ఆలస్యంగా, 2022 జనవరి నుంచి పింఛను రూ.2500 చేస్తున్నారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘పింఛను పెంచుతున్నాం. పండగ చేసుకోండి’ అని సర్కారు హడావుడి చేస్తోంది. అవ్వాతాతలకు చేస్తున్న అసలు మోసాన్ని రంగురంగుల ప్రకటనల వెనుక దాచేసే ప్రయత్నం చేస్తోంది. కానీ... ‘జగనన్న పింఛను’లో మతలబును జనం ఎప్పుడో గ్రహించేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు జగన్‌ పింఛను హామీని బాగా వాడుకున్నారు. అప్పటికే ఇస్తున్న పింఛను 2వేలను రూ.3వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. జగన్‌ కూడా ఇదే హామీ ఇచ్చారు. పింఛను రూ.3వేలకు పెంచుతామన్నారు. అవ్వా తాతల ఓట్లు బాగా దండుకున్నారు. కానీ... అధికారంలోకి వచ్చి, ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే మాట తప్పేశారు. అప్పటిదాకాలేని ‘విడతల’ను కొత్తగా తీసుకొచ్చారు. ‘‘నవ రత్నాల్లో ప్రతి అవ్వా తాతకు, ప్రతి వితంతువుకు పెన్షన్‌ను రూ.3వేల వరకూ పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్‌ను జూన్‌ నెల నుంచి రూ.2,250లతో మొదలుపెట్టబోతున్నాను. దీనికి సంబంధించిన ఫైల్‌పైనే మొట్టమొదటి సంతకం పెడుతున్నాను. ఈ సంవత్సరం రూ.2,250తో మొదలుపెడతాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు, ఆ తర్వాత ఏడాది రూ.3వేలకు పెంచుతాం’’ అని కొత్త లెక్కలు చెప్పారు. 2019 జూలైలో మొదటిసారి పెంచారు. ఆ తర్వాత ఆ పెంపు ఊసే ఎత్తలేదు. పైగా పింఛన్ల సంఖ్యలో భారీగా కోతలు పెట్టింది. ఏ నెలకు ఆ నెల తీసుకునేవారికే డబ్బులు ఇస్తామని, లేకపోతే ఆ మొత్తం మురిగిపోయినట్లే అంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో దాదాపు 2లక్షల మందికి పైగా నష్టపోయారు. ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత తీరిగ్గా రెండో విడత రూ.250 పెంచుతామని ప్రకటించింది. 


ఐదు రోజులు సంబరాలట...

అవ్వాతాతల పెన్షన్లను సకాలంలో పెంచని సర్కారు... ఇప్పుడు మరో రూ.250 పెంచి సంబరాలు చేస్తోంది. ఇదేదో కొత్త పథకమైనట్లుగా శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. పెన్షన్ల ప్రక్రియను ఒక్కరోజులో పూర్తి చేయాల్సి ఉండగా... ఇప్పుడు ఐదు రోజులు పండుగలా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆలస్యంగా పెంచి ఇచ్చేదానికి కూడా ఇంత ఆర్భాటం దేనికంటూ పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. 


రూ.3300 కోట్లు నష్టం 

సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపుదలను అమలు చేయకపోవడంతో అవ్వాతాతలు సుమారు రూ.3300 కోట్లు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు పలు రకాల పెన్షన్లు సుమారు 60లక్షల మంది పొందుతున్నారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ మొత్తాన్ని రూ.3వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచార సభలో జగన్‌ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాట తప్పారు.. ఒక్కో ఏడాది రూ.250 చొప్పున పెంచి నాలుగేళ్లలో ప్రతి పెన్షన్‌దారునికి రూ.3వేలు అందిస్తామని చెప్పారు. 2019 జూలై 8న... వైఎస్‌ పుట్టిన రోజున పెన్షన్‌ మొత్తాన్ని రూ.250 పెంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత 2020 జూలైలో మరో రూ.250 పెంచి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ఇవ్వాలి. 2021 జూలై నుంచి రూ.2,750కి పెంచాలి. 2022 జూలై నుంచి రూ.3వేలు అందించాలి. కానీ... ఇప్పుడు, ఇన్నాళ్లకు అంటే 2022 జనవరి నుంచి రూ.2500 చేస్తున్నారు. ప్రభుత్వం మాట తప్పి ఆలస్యంగా పెన్షన్‌ పెంచిన కారణంగా ఒక్కో పెన్షన్‌దారుడు 12నెలల పాటు నెలకు రూ.250 చొప్పున మొత్తం రూ.3వేలు, 5నెలల పాటు నెలకు రూ.500 చొప్పున రూ.2500.... మొత్తం కలిపి ఇప్పటి వరకు రూ.5,500 నష్టపోయామని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల మంది పెన్షన్‌దారులకు కలిపి సుమారు రూ.3,300 కోట్లు సర్కారు ఎగ్గొట్టిందని విమర్శలు వస్తున్నాయి. 


రాష్ట్రంలో అన్ని పథకాలకు కోతలు కోసిన వైసీపీ సర్కారు... పెన్షన్ల విషయంలో కూడా తాత్సారం చేసిందని, ఇప్పుడు ఏం సాధించారని ఈ సంబరాలు చేసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. జనవరి నుంచి రూ.2,500కు పెన్షన్‌ పెంచుతున్న నేపథ్యంలో ఐదు రోజులు పండుగలా సంబరాలు చేసుకోవాలని ప్రకటించారు. ఈ పేరుతో మళ్లీ మీడియాలో ప్రకటనలు గుప్పించి నిధులు దుర్వినియోగం చేస్తారని, నిధులు లేవని పెన్షన్ల పెంపుదలపై కాలయాపన చేసిన ప్రభుత్వం... ఆర్భాటాల కోసం చేసే దుబారాను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2022-01-01T06:51:48+05:30 IST