Abn logo
Jun 8 2021 @ 00:22AM

చౌక, సురక్షిత విద్యుదుత్పాదన

ప్రపంచవ్యాప్తంగా తుపానులు, వరదలు, కరువు కాటకాలు, మహమ్మారుల తాకిడి అంతకంతకూ పెరిగిపోతోంది. కారణమేమిటి? ప్రాకృతిక జగత్తుపై మానవుని విధ్వంసపూర్వక ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతుండడమేనని ఖాయంగా చెప్పవచ్చు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఆధునిక సమాజాల ఆరాటమే ఆ వినాశనాన్ని సృష్టిస్తోంది.. అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, నదుల సహజ ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు మొదలైనవన్నీ ప్రకృతి సహజక్రమాన్ని ఎంతగా దెబ్బతీయాలో అంతగా దెబ్బతీస్తున్నాయి. అయితే విద్యుత్ ఉత్పత్తి అవశ్యం. నవీన నాగరికత దానిమీదే ఆధారపడి ఉంది కదా.

మన దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరులు బొగ్గు, నదులు. థర్మల్, జల విద్యుదుత్పత్తికి అవి మూలాధారాలుగా ఉన్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలలోనూ, దక్కన్ లోనూ సౌరశక్తి ఆధారిత విద్యుదుత్పత్తి జరుగుతోంది. థర్మల్ విద్యుదుత్పత్తితో సమస్య ఏమిటంటే బొగ్గు నిక్షేపాలు మనకు పరిమితంగా మాత్రమే ఉన్నాయి. అవి కేవలం 150 సంవత్సరాలకు మాత్రమే సరిపడా ఉన్నాయని అంచనా. గనుల నుంచి బొగ్గును మరింతగా వెలికితీస్తున్న కొద్దీ ఆ సహజ సంపద నాణ్యత క్షీణించిపోతోంది. మనకు అవసరమైన బొగ్గును పెద్దఎత్తున దిగుమతి చేసుకోవలసివస్తోంది. అలా చేయడంలో మనం అడవుల నరికివేత, గనుల తవ్వకాల ప్రతికూల పర్యవసానాలను ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తున్నాం. అయితే భూ తాపం రూపేణా ఆ వినాశన ప్రభావం మనలను వెంటాడుతూనే ఉంది. ఒక యూనిట్ విద్యుదుత్పత్తి ప్రక్రియలో 900 గ్రాముల కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. ఈ ఉద్గారాలు భూతాపాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. 

నదులపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది స్వచ్ఛమైన విద్యుత్‌గా పేరు పొందింది. దీని ఉత్పత్తిక్రమంలో పర్యావరణానికి హాని కలిగించే కర్బన ఉద్గారాలు వెలువడవు. అయితే జలవిద్యుదుత్పాదన ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్, ఉక్కు తయారీలో కర్బన ఉద్గారాలు భారీగా వెలువడుతాయి. సగటున అవి 3000 గ్రాములుగా ఉన్నాయి. జల విద్యుదుత్పత్తి వల్ల కర్బన ఉద్గారాల తగ్గుదల నికరంగా 600 గ్రాముల మేరకు ఉంటుంది. అయినప్పటికీ ఇది గణనీయమైన పరిమాణమే. అయితే జల విద్యుదుత్పత్తి పర్యావరణంపై చూపే ప్రతి కూల ప్రభావం తీవ్రత తక్కువేమీ కాదు. నీటి వనరులు ఎండిపోతున్నాయి. సొరంగాల నిర్మాణంలో పేలుడు పదార్థాలు ఉపయోగించడం వల్ల భూపాతాలు అధికమవుతున్నాయి. జలసంబంధింతిత జీవ వైవిధ్యం నశించిపోతోంది. ప్రస్తావిత కారణాల వల్ల థర్మల్, జల విద్యుత్ రెండూ మనకు సుస్థిర ఇంధన వనరులను సమకూర్చలేవు. 

సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడమే ఒక సంభావ్య పరిష్కారం. సౌర విద్యుదుత్పత్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు పటిష్ఠ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆశించిన విధంగా సౌర విద్యుదుత్పత్తి శీఘ్రగతిన ఇతోధికమవుతోంది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే సౌర విద్యుత్ ధర యూనిట్‌కు రూ.3 మాత్రమే. అదే థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.6 అయితే జలవిద్యుత్ ధర యూనిట్ రూ.8. పర్యావరణంపై సౌర విద్యుత్ ప్రతి కూల ప్రభావాలు సైతం ఏమంత తీవ్రమైనవి కావు. అయితే సౌర విద్యుదుత్పత్తి పగటి పూట మాత్రమే సాధ్యమవుతుంది. మేఘాల కదలికలపై ఆధారపడి ఉన్నందున సౌర విద్యుదుత్పత్తి నిలకడగా సాగదు. ఈ కారణంగా సౌరవిద్యుత్ వల్ల ఉదయం, సాయంత్రం, రాత్రి మన విద్యుత్ అవసరాలు చెప్పుకోదగిన స్థాయిలో కూడా తీరడం లేదు. 

మార్గాంతరమేమిటి? పంప్ స్టోరేజ్ విద్యుదుత్పాదన కేంద్రాలను మరింతగా నెలకొల్పుకోవడమే. ఈ విద్యుదుత్పాదన కేంద్రాలలో రెండు జలాశయాలు ఉంటాయి. ఒకటి బాగా ఎత్తైన స్థలంలో, రెండోది తక్కువ ఎత్తులో ఉన్న స్థలంలో ఉంటాయి. సౌరశక్తి లభ్యమయ్యే పగటిపూట దిగువ జలాశయం నుంచి నీటిని ఎగువ జలాశయానికి పంపింగ్ చేస్తారు. రాత్రిపూట ఎగువ జలాశయంలోని నీటిని టర్బైన్ల ద్వారా దిగువ జలాశయానికి విడుదల చేస్తారు. ఈ రెండు జలాశయాలను నదీ ప్రవాహానికి అవరోధం కాని ప్రదేశంలో మాత్రమే నిర్మిస్తారు. రెండిటికీ వేర్వేరు టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఉన్న జల విద్యుదుత్పాదన కేంద్రం సదుపాయాలను ఉపయోగించుకోవడం జరగదు. ఫలితంగా పగటిపూట ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను రాత్రిపూట వినియోగించుకునే విద్యుత్‌గా మార్చేందుకు అయ్యే వ్యయం యూనిట్‌కు రూ.3గా ఉండగలదని నా అంచనా. సౌర విద్యుదుత్పాదన, పంప్ స్టోరేజ్ విద్యుదుత్పాదన ప్రక్రియల కలయికతో పగటిపూట విద్యుత్ సౌర విద్యుదుత్పాదన కేంద్రాల నుంచి ఒక్కో యూనిట్‌ను రూ.3కే సమకూర్చవచ్చు. రాత్రి పూట వినియోగించుకునే విద్యుత్ ఒక్కో యూనిట్‌ను రూ.6కి సమకూర్చవచ్చు. దీనివల్ల సౌర విద్యుత్ ధర ఒక్కో యూనిట్ సగటున రూ.4.50గా ఉంటుంది. అయినా ఇది థర్మల్ విద్యుత్ (యూనిట్ ధర రూ.6), జలవిద్యుత్ (యూనిట్ ధర రూ.8) కంటే తక్కువ ధరకు లభ్యమవడం గమనార్హం. థర్మల్ విద్యుదుత్పత్తి వల్ల సంభవించే కర్బన ఉద్గారాలను, జల విద్యుదుత్పత్తి వల్ల వాటిల్లే పర్యావరణ నష్టాలను నివారించడం సాధ్యమవుతుంది.

- భరత్ ఝున్‌ఝున్‌వాలా(వ్యాసకర్త ఆర్థికవేత్త,

బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)