చెగువేరా జీవితంలో రోమాలు నిక్కబొడుచుకునే ఘటనలు..

ABN , First Publish Date - 2021-12-09T17:10:42+05:30 IST

యావత్ మానవాళి ఎదుర్కొంటున్న ఆకలి..

చెగువేరా జీవితంలో రోమాలు నిక్కబొడుచుకునే ఘటనలు..

యావత్ మానవాళి ఎదుర్కొంటున్న ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం త‌దిత‌ర‌ సమస్యలను తరిమికొట్టాలని ఆ యోధుడు కలలుగనన్నాడు. కేవలం కడుపు నింపుకోవటం కోసమే పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ఆయన తపించాడు. ప్ర‌పంచ యువ‌త‌కు స్ఫూర్తిదాత‌గా నిలిచిన ఆ యోధుడు మ‌రెవ‌రో కాదు.... చెగువేరా.. ఆయ‌న జీవితాన్ని మలుపు తిప్పిన కీలక ఘ‌ట్టాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 


అర్జెంటీనాలోని రోసారియోలో 1928, జూన్ 14న జన్మించిన చేగువేరా బాల్యం నుంచీ ఎంతో చురుకుగా వుండేవాడు. అస్తమాతో బాధపడుతున్నప్పటికీ ఈత, గోల్ఫ్‌, సాకర్‌, షూటింగ్‌ తదితర క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాడు. చెగువేరా మంచి సైక్లిస్టు. సైకిల్‌ తొక్కుతూ మైళ్ళదూరం ప్రయాణించేవాడు. రగ్బీ ఆటలో ప్రావీణ్యం అతనికి మంచి  పేరు తెచ్చి పెట్టింది. చిన్నతనంలోనే ఉత్తమ సాహిత్యాన్ని, తాత్విక గ్రంథాలను చదివాడు. లాటిన్‌ అమెరికన్‌ రచయితల సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు. బుద్ధుడు, అరిస్టాటిల్‌, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, బెర్ట్రాండ్‌ రస్సెల్‌ తదితర పోరాట యోధుల భావాలు చెగువేరాను కౌమారంలోనే అమితంగా ఆకర్షించాయి.


వైద్యవిద్యార్థిగా ఉన్న సమయంలో చెగువేరా తన మిత్రుడు అల్బర్ట్‌ గ్రనాడోతో కలిసి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలన్నిటినీ చుట్టాడు. ఆయా దేశాలలో తాండవిస్తున్న పేదరికం చెగువేరాను తీవ్రంగా కలచి వేసింది. భూస్వాముల, ధనిక రైతుల దోపిడీలు చెగువేరాకు ఆగ్రహం తెప్పించాయి. అమానుషమైన పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనమయ్యేవరకూ పేదల బతుకులు మారవని గ్రహించాడు. అనుకున్నదే తడవు క్యూబన్‌ విప్లవ పోరాటంలో భాగస్వామ్యం వహించాడు. ఫిడల్‌ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవం విజయానికి వ్యూహరచన చేశాడు. క్యూబా ప్రతినిధిగా పలు దేశాలలో తిరిగాడు. 


గెరిల్లా యుద్ధతంత్రంలో చెగువేరా ఆరితేరాడు. యుద్ధభూమిలో తాను ముందు నిలబడి గెరిల్లా దళాల్ని నడిపించాడు. క్యూబా  పునర్నిర్మాణంతో సంతృప్తి చెందని చెగువేరా అనంతరం కాంగో, బొలీవియాల విముక్తి కోసం ఉద్యమించాడు. కానీ కాంగోలో ఇతని దళంలోని విప్లవ వీరుల ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అనేకమంది మరణించారు. ఈ కారణంగా మధ్యలోనే చెగువేరా వెనుదిరగాల్సివచ్చింది. ఆ తరువాత బొలీవియా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. 1967 అక్టోబర్‌ 6న బొలీవియా సైనిక దళాలకు చెగువేరా బందీగా చిక్కాడు. అయినప్పటికీ శత్రువుల కళ్ళలోకి చూస్తూ మాట్లాడాడు. అక్టోబర్‌ 9న బొలీవియా సైన్యాలు చెగువేరాను తూటాలకు బలిచేశాయి. దీనికి ముందు చెగువేరా.. తనను శత్రువులు చంపగలరేమోగానీ.. తన ఆశయాల్ని చంపలేరని నినదించాడు. 


1959లో చెగువేరా భారతదేశాన్ని సందర్శించినప్పుడు నెహ్రూతో భేటీ జరిగింది. అప్పుడు చెగువేరా.. ‘ఇంత సువిశాలమైన దేశంలో ప్రజానుకూల ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మించాలనుకుంటున్నారు? ఏ తరహా వైద్య వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడి ప్రజల ఆకలిని ఎలా తీర్చాలనుకుంటున్నారని నెహ్రూను ప్రశ్నించాడు. చెగువేరా బతికింది కేవలం 39సంవత్సరాలే. అయినప్పటికీ ప్రపంచ యువత గుండెల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్నాడు.

Updated Date - 2021-12-09T17:10:42+05:30 IST