ఛత్తీస్‌ఘడ్‌ బాలుడి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-03-04T06:36:13+05:30 IST

తిరుపతిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాపయ్యాడు.

ఛత్తీస్‌ఘడ్‌ బాలుడి కిడ్నాప్‌
శివకుమార్‌సాహు

గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు

 బాలుడి తండ్రితో కలసి మఫ్టీలో ఎస్పీ పరిశీలన


తిరుపతి(నేరవిభాగం), మార్చి 3: తిరుపతిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాపయ్యాడు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ కథనం మేరకు...  ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం గరియుబంద్‌ జిల్లా కురుద్‌ గ్రామానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌సాహు కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 27న తిరుపతి వచ్చారు.అలిపిరి లింక్‌ బస్టాండులో సేదదీరారు. ఆ సమయంలో పక్కనే ఆడుకుంటున్న కుమారుడు శివకుమార్‌సాహు(6) కనిపించకపోవడంతో  చుట్టుపక్కల ఉత్తమ్‌కుమార్‌సాహు  గాలించారు. ఆచూకీ తెలియపోవడంతో 28న అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు శివకుమార్‌సాహు తప్పిపోలేదని.. కిడ్నాప్‌ అయినట్లు గుర్తించారు. ఓ వ్యక్తి చిన్నారిని తనతోపాటు తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో ఎస్పీ వెంకట అప్పలనాయుడు మంగళవారం రాత్రి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు పంపించారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలుడిని తీసుకెళ్తూ సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తి లుంగీ కట్టుకుని ఉండటంతో బహుశా తమిళనాడు వాసి అయి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.బుధవారం సాయంత్రం తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మఫ్టీలో ఓ ద్విచక్రవాహనంపై బాలుడి తండ్రి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి కిడ్నాపర్‌ తిరిగిన ప్రాంతాలను పరిశీలించారు. 

Updated Date - 2021-03-04T06:36:13+05:30 IST