రైతులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం శుభవార్త... గో మూత్రం కొనుగోలు పథకం త్వరలో...

ABN , First Publish Date - 2022-07-15T20:24:12+05:30 IST

రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి గో మూత్రాన్ని కొనేందుకు ఛత్తీస్‌గఢ్

రైతులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం శుభవార్త... గో మూత్రం కొనుగోలు పథకం త్వరలో...

రాయ్‌పూర్ : రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి గో మూత్రాన్ని కొనేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రెండు వారాల్లో దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఆవు పేడను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. పాడి పరిశ్రమ ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడం కోసం ఈ చర్యలను అమలు చేస్తోంది. 


ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సలహాదారు ప్రదీప్ శర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఆవు పేడను సేకరించినట్లుగానే గో మూత్రాన్ని కూడా రైతుల నుంచి సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో నిర్ణయించిందని చెప్పారు. ఈ పథకంపై పరిశోధన చేయడానికి, సేకరించే విధానాన్ని నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను సమర్పించిందని, ముఖ్యమంత్రి బాఘెల్ దీనిని త్వరలోనే పరిశీలిస్తారని చెప్పారు. లీటరు గో మూత్రాన్ని రూ.4 చొప్పున కొనాలని ప్రతిపాదించిందని, ముఖ్యమంత్రి నుంచి త్వరలో ఆమోదం పొందుతామని చెప్పారు. గ్రామ గోధన్ సమితుల ద్వారా గో మూత్రాన్ని సేకరిస్తామని చెప్పారు. దీనిని అమ్మినవారికి 15 రోజులకు ఒకసారి సొమ్ము చెల్లిస్తామని తెలిపారు. 


హెరెలి పండుగ సందర్భంగా జూలై 28న ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఓ అధికారి చెప్పారు. 2020 జూన్ 25న గోధన్ న్యాయ్ యోజనను ముఖ్యమంత్రి బాఘెల్ ప్రారంభించారు.  పాలు ఇవ్వని ఆవులు, పశువులను రోడ్లపై వదిలేస్తున్నారని, వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆస్తి నష్టం జరుగుతోందని ప్రభుత్వం చెప్పింది. ఆవుల పెంపకాన్ని లాభదాయక వ్యాపారంగా చేయాలన్న లక్ష్యంతో ఆవు పేడను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. 


రైతుల నుంచి సేకరించిన ఆవు పేడతో వర్మి కంపోస్టును తయారు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గో మూత్రంతో ఆర్గానిక్ పురుగు మందులు, ఫంగిసైడ్స్ తయారు చేయనున్నట్లు తెలిపింది. గో మూత్రాన్ని కేవలం వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఇది మానవ వినియోగం కోసం కాదని స్పష్టం చేసింది. 


Updated Date - 2022-07-15T20:24:12+05:30 IST