రాత్రంతా చేజింగులే..!

ABN , First Publish Date - 2021-06-19T06:37:08+05:30 IST

శ్రీకాళహస్తి నుంచి చంద్రగిరి దాకా పోలీసులను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రంతా ముప్పుతిప్పలు పెట్టారు.

రాత్రంతా చేజింగులే..!
పాక్షికంగా దెబ్బతిన్న పోలీసు వాహనం - రాళ్ల దాడితో పగిలిన అద్దం

శ్రీకాళహస్తి నుంచి చంద్రగిరి దాకా..

పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ,రాళ్లదాడి చేసి పరారైన దుండగులు

త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హోంగార్డు

వివరాలు గోప్యంగా ఉంచుతున్న పోలీసులు


చంద్రగిరి, జూన్‌ 18: శ్రీకాళహస్తి నుంచి చంద్రగిరి దాకా పోలీసులను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రంతా ముప్పుతిప్పలు పెట్టారు. ఈ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మీదుగా వెళుతున్న ఓ కారుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై శ్రీకాళహస్తి పోలీసులు ఏర్పేడు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ వాహనం ఏర్పేడు దాటుకోవడంతో గాజులమండ్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ వాహనాన్ని అడ్డగించడంతో అందులోని దుండగులు పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఆపై తమ వాహనాన్ని వేగంగా చంద్రగిరివైపు మళ్లించారు. ఈ సమాచారం చంద్రగిరి పోలీసులకు తెలియడంతో జాతీయ రహదారిలో కాపు కాశారు. ఇక్కడ కూడా పోలీసులపై రాళ్ల దాడి చేసి పరారయ్యారు. అయితే స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఆ వాహనాన్ని వెంబడించారు. దుండగులు మాత్రం పోలీసు వాహనంపై రాళ్లు విసురుతూ.. ముంగిలిపట్టు వరకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి ఐతేపల్లె వరకు వచ్చారు. ఆ తర్వాత ఎ.రంగంపేట వైపు వెళ్లారు. మార్గమధ్యంలోని పాండురంగయ్యగారిపల్లె రైల్వే బ్రిడ్జి వద్దకొచ్చాక ఎటువెళ్లాలో అర్థంకాక రివర్స్‌ చేసే క్రమంలో వెనుక ఉన్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టి.. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీసు వాహనం పాక్షికంగా దెబ్బతినడంతో మరమ్మతులకు గురైంది. ఈ సమయంలో హోంగార్డు ఒకరు దుండగుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోగా అతడిపైకి కారును నడిపారు. హోంగార్డు అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం పాండురగయ్యగారిపల్లె నుంచి మళ్లీ ఐతేపల్లెకు రాగానే.. అక్కడ మూడు పోలీసు వాహనాలు ఉండటంతో.. మరోసారి పోలీసులపై రాళ్లదాడి చేస్తూ.. పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఓ డీఎస్పీ స్థాయి అధికారి కూడా దుండగుల వాహనాన్ని పట్టుకోవడానికి వచ్చారు. మొత్తానికి గురువారం రాత్రి గస్తీలో ఉన్న పోలీసులంతా జాతీయ రహదారిలో జరిగిన ఈ చేజింగ్‌లో ఉన్నారు. ఈ సంఘటనపై వివరాలు చెప్పడానికి మాత్రం చంద్రగిరి పోలీసులు నిరాకరించారు. 

Updated Date - 2021-06-19T06:37:08+05:30 IST