Advertisement
Advertisement
Abn logo
Advertisement

చారుకేశి

వొక కవి చనిపోతాడు

కొంత కాంతి చనిపోతుంది

వెన్నెల కొంచెం దారి తప్పుతుంది

అందరి లాగే కవీ చనిపోతాడు

రాలుతూ.. రాలిన పూలు అదే పనిగా

          మందలు మందలల్ల పడి

          ఏడుస్తూనే వుంటాయి

మన లోపలా... పైనా...

అర్థం కాని భాష వొకటి పరుచుకుంటుంది

గొంతు లోపల వేదనొకటి గడ్డకడుతుంది

          కనబడీ... వినబడని

          పొలిమేరల గుడిగంటలు

          ఎగిరీ... ఎగరని దీపాలు

          వాటి స్మృతులు

జీవం పోసుకోని రూపాన్ని తొడుక్కోని

          కలలు

          అంతరాంతర తంత్ర లోక ధూపం

    అంబాడుతూ లోకాన విస్ఫుటించే దుఃఖం

          పొలమారుతూ మనస్సు కుమ్మరించే

          శరత్తుల షరతుల్లేని ప్రేమా

          పరిచయం కోరని పసిపిల్లల నవ్వులు

          చింతనాగ్ని పుటల బావి

          నీరుగారిపోయి చూస్తుంటాయి

అందరి లాగే కవీ చనిపోతాడు

అయినా...

అతని దృశ్యకేశాలు

చంద్రుని మీద తడిని ఆరబెట్టుకుంటాయి

స్థల కాలాలను నిమురుతుంటాయి

       జలపాతాల కింద తలనుబెట్టి

       తను భూకంపాలను స్వరపరుస్తుంటాడు

అందరూ...

చనిపోవడానికే పుడతారు...

కట్టుకున్న శరీరాలను

ద్రోహ విద్రోహ మోహప్పిడుగును

జారవిడిచేపోతారు

వీడ్కోలు వినిపించకుండానే

క్షమించని దిగులుతో ఎడబాటుతో...

తను మాత్రం

సంపూర్ణ రాగం... చారుకేశి

కనుకొలకుల్లోంచి కేతకీ పుష్పమై

రాల్తూనే వుంటాడు

సెగలుతూనే వుంటాడు

ఔషధీ వేరు వలే... పరుచుకుంటూ

మళ్ళీ పుట్టడానికే

చనిపోతాడు

భూ సారంలో... విత్తనమొకటి

జాగారం చేస్తుంటుంది, మేల్కొనే వుంటుంది

అతని రాక కోసం

(సిరివెన్నెల కవి 

సీతారామశాస్త్రిగారి మననంలో)

సిద్ధార్థ

73306 21563


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...