Abn logo
Oct 23 2020 @ 02:08AM

‘చారు’ బాటలో నష్టపోయింది చాలు!

కమ్యూనిస్టు ఉద్యమంలో చారుమజుందార్ ఓ అతివాద దుస్సాహసిక విధానానికి ప్రతీక! ప్రజాయుద్ధ పంథాలో ఎదిగొచ్చిన నక్సల్బరీ ఉద్యమాన్ని ‘వర్గ శత్రు నిర్మూలన’ పేరిట అతివాదంలోకి మళ్లించి నాశనం చేసిన ఘనత చారుబాబుకే దక్కుతుంది.


ఆంధ్రజ్యోతి దినపత్రికలో అక్టోబరు 17న ప్రచురితమైన వైకె వ్యాసం (‘1920 అక్టోబర్ 17’) పక్షపాతం, అర్ధసత్యాలతో నిండివుంది. ‘‘చారుమజుందార్ నాయకత్వంలో నక్సల్బరీపోరాటం కమ్యూనిస్టు ఉద్యమానికి సాయుధ మలుపు’’ అని ఆయన సూక్ష్మీకరించడం అవాస్తవం. ఎందుకంటే అంతకుముందే నిజాం సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్మించి 3000 గ్రామాలను విముక్తం చేసి వాటిలో ప్రజారాజ్యాన్ని స్థాపించిన అనుభవం కమ్యూనిస్టు పార్టీకి వుంది. కమ్యూనిస్టు ఉద్యమానికి సాయుధ మలుపు ఆ పోరాటం అవుతుంది తప్ప నగ్జల్బరీ కాదు.


కమ్యూనిస్టు ఉద్యమంలో చారుమజుందార్ ఓ అతివాద దుస్సాహసిక విధానానికి ప్రతీక! ప్రజాయుద్ధ పంథాలో ఎదిగొచ్చిన నక్సల్బరీ ఉద్యమాన్ని ‘వర్గ శత్రు నిర్మూలన’ పేరిట అతివాదంలోకి మళ్లించి నాశనం చేసిన ఘనత చారు బాబుకే దక్కుతుంది. వైకె పేర్కొన్నట్లు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి లేదా కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య తదితరులు సాయుధ పోరాటానికి వ్యతిరేకులు కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ స్ధాయికి తీసుకు వెళ్లి ప్రత్యక్షంగా నడిపిన అనుభవం వున్న నాయకత్వ ప్రముఖులు. ప్రజల పాత్ర లేని సాయుధ దళాలు, చర్యలు, వర్గ శత్రు నిర్మూలన కార్యక్రమం అంతిమంగా పార్టీ నాశనానికి దారితీస్తుందని వారు చెప్పారు. చివరకు వారు చెప్పిందే జరిగింది. 


కానీ చారు బాబు నాయకత్వం కామ్రేడ్ టియన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల కమిటీ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తోందని, పెద్ద ఎత్తున అసత్య, దుష్ప్రచారానికి, కుట్రలు కుతంత్రాలకు పాల్పడింది. రివిజనిస్టులపై భ్రమలున్నాయంటూ ప్రచారం చేసింది. సిపిఎం కాలంలోనూ, ఆం.ప్ర. కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో ఎదిగిన శ్రీకాకుళం గిరిజన ఉద్యమ నాయకత్వం చారుమజుందార్ అతివాద విప్లవ వాగాడంబరానికి ప్రభావితమై వర్గశత్రు నిర్మూలన చేపట్టి నాశనమైంది. ఇదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో సిపిఎం విధానాలు నచ్చక విప్లవకారులుగా బయటకు వచ్చిన నిర్మాణాలకు అతివాద భ్రమలు కల్పించి కోలుకోలేని నష్టాన్ని తెచ్చిన ఘనత చారుమజుందార్‌కే దక్కుతుంది. ఈ రోజు కూడా ఆ నష్టాన్ని భరిస్తున్నాం. ఇదంతా మన స్వానుభవంలో కళ్లముందరి చరిత్ర. డాక్యుమెంట్లలో ఈ వాస్తవాలన్నీ సంక్షిప్త పరిచి వున్నాయి. దాన్ని కప్పెట్టేసి కమ్యూనిస్టు ఉద్యమంలో సాయుధ మలుపు చారుమజుందార్ తెచ్చాడనడం చారిత్రక వక్రీకరణ తప్ప మరోటి కాదు.


ఇక సిపిఐ, సిపిఎంల నడక మౌలికంగానే కమ్యూనిస్టు స్రవంతి కాదనడం, అదే సమయంలో మారోజు వీరన్న నాయకత్వంలోని సిపియుఎస్‌యుఐ కమ్యూనిస్టు ఉద్యమంలో సామాజిక మలుపు తెచ్చిందని కితాబునివ్వడం వైకె హ్రస్వ దృష్టికీ, పక్షపాత వైఖరికి నిదర్శనం. కార్యక్షేత్రంలో ఉన్న పార్టీలకు ఇష్టమైన రీతిలో గ్రేడింగ్ ఇవ్వడం శాస్త్రీయ విశ్లేషణ కాదు. ఆయా పార్టీలననుసరిస్తోన్న ప్రజానీకం, విప్లవోద్యమాలే తేలుస్తాయి. 


వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించుకొని, గుణపాఠాలు తీసుకుని తమ ఆచరణకు అన్వయించుకోవడం, మన దేశంలో సోషలిజం సాధించడానికి కృషి చేస్తోన్న వివిధ రూపాల్లో వున్న కమ్యూనిస్టు శక్తుల బాధ్యత. అటువంటి అవసరం, బాధ్యత లేని వైకె లాంటి వారు తమ ఇష్టాయిష్టాలకనుగుణంగా చరిత్రను, వర్తమానాన్ని వక్రీకరించి, విశ్లేషించి తీర్మానాలు చేస్తుంటారు. ఇలాంటి పడక కుర్చీ పండితులను పట్టించుకోనవసరంలేదు.

దినకర్

Advertisement
Advertisement
Advertisement