Oct 24 2021 @ 02:57AM

ఇంకెప్పటికీ నటించనేమో!

నటిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి నిర్మాతగా మారిన కొద్ది మంది హీరోయిన్లలో ఛార్మి ఒకరు. ‘పూరీ కనెక్ట్స్‌’లో భాగస్వామి అయిన ఛార్మి- ప్రస్తుతం ‘రొమాంటిక్‌’, ‘లైగర్‌’ చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘‘నామీద వచ్చే పుకార్లు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏ విధంగానూ ప్రభావితం చెయ్యవు’’ అనే ఛార్మి ఈ మధ్య కాలంలో మీడియాకు దూరంగా ఉంటున్నారు. ‘లైగర్‌’ తర్వాత - ఒక భారీ బడ్జెట్‌ సినిమా ప్రకటిస్తామంటున్న ఛార్మితో ‘నవ్య’ ముఖాముఖి..


ఎలా ఉన్నారు? నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయింది కదా...

చాలా చాలా బావున్నా! నిజం చెప్పాలంటే నేను ఒకప్పుడు హీరోయిన్‌ననే విషయాన్ని కూడా మర్చిపోయా! నేను నటించటం మానేసి ఐదేళ్లు అయిపోయింది. నిర్మాతగా మారిన తర్వాత బాధ్యతలు బాగా పెరిగాయి. సినీ నిర్మాణం అంటేనే రకరకాల సవాళ్లు కదా...


నటన, నిర్మాణం- ఈ రెండిటిలో మీకు ఏది ఎక్కువ ఇష్టం?

రెండూ ఇష్టమే. అయితే ఈ రెండిటికీ మధ్య చాలా తేడా ఉంది. హీరోయిన్‌గా చేసేటప్పుడు ఎక్కువ కంఫర్ట్‌ ఉండేది. మన ఫిట్‌నెస్‌... బ్యూటీ... చూసుకొని కష్టపడితే సరిపోతుంది. సెట్‌లో అందరూ గౌరవంగా చూస్తారు. మనకు ఏం కావాలన్నా వెంటనే పట్టుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. ఇక నిర్మాణం విషయానికి వస్తే- అందరి కంఫర్ట్‌ మనమే చూడాలి. రోజంతా కష్టపడాలి. అన్ని విషయాలు మనమే చూసుకోవాలి. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే దాకా గాడిద చాకిరీ అనే చెప్పాలి. 


నటన నుంచి నిర్మాణంవైపు వచ్చినప్పుడు ఇబ్బంది పడలేదా? 

లేదు. ఎందుకంటే నాన్నకు స్ర్కూలు, బోల్టులు అమ్మే వ్యాపారం ఉండేది. చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూ పెరిగాను. ఆ వ్యాపారం గురించి నాన్న చెబుతూ ఉండేవారు. పెద్ద అయిన తర్వాత బిజినెస్‌కు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. షూటింగ్‌ల మధ్య ఖాళీ దొరికినప్పుడు కూడా ఆ పుస్తకాలే చదివేదాన్ని. హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో కూడా ప్రొడక్షన్‌ అంటే ఆసక్తి ఉండేది. ‘పూరీ కనెక్ట్స్‌’ ప్రారంభించిన తర్వాత ఇది మరింతగా పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద నిర్మాణ సంస్థల్లో ‘పూరీ కనెక్స్ట్‌’ కూడా ఒకటి. 


నటన మానేసి ఐదేళ్లు అవుతోంది కదా.. మధ్య మధ్యలో ఆఫర్స్‌ ఏవీ రాలేదా?

వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ వారానికి రెండు, మూడు ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇండస్ట్రీ నన్ను ఇంకా ఒక హీరోయిన్‌గానే గుర్తుపెట్టుకుంది. ఆఫర్స్‌ వస్తున్నా నాకు నటించాలని లేదు. బహుశా ఎప్పుటికీ నటించనేమో!


ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో ఎలాంటి మార్పు వచ్చిందంటారు?

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని సినిమాలు ఎలా ఉంటాయో తెలిసింది. అనేక మంచి కథలు.. కథనాలు.. స్ర్కీన్‌ప్లేలు వారికి పరిచయమయ్యాయి. దీనివల్ల వారి అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది. ఒక విధంగా చూస్తే- ఈ పరిణామం... కొత్త తరహాలో చిత్రాలు తీయాలనుకొనేవారికి మంచి అవకాశం. రకరకాల కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు వారికి అవకాశం చిక్కుతుంది. అయితే ఓటీటీలో సినిమాలు చూసే వారితో పాటుగా థియేటర్లకు వచ్చి నిజమైన సినిమా అనుభూతిని పొందాలనుకొనే ప్రేక్షకులు కొందరు ఉన్నారు. వీరికి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి. భారీ బడ్జెట్లతో సినిమాలు కావాలి. వీరిని కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. అలాంటి సినిమాలు వస్తున్నాయి కూడా!


అంటే భవిష్యత్తులో ఓటీటీ సినిమాలు- థియేటర్‌ సినిమాలు అనే విభజన స్పష్టంగా కనిపిస్తుందంటారా?

భారీ బడ్జెట్‌ సినిమాలను థియేటర్‌లో చూస్తేనే బావుంటుంది. ఆ అనుభూతి కోసం ప్రేక్షకులు తప్పనిసరిగా థియేటర్లకు వస్తారు. కొన్ని సినిమాలు ఓటీటీలలో కూడా విడుదలవుతాయి. వాటికి కూడా ఆదరణ లభిస్తుంది. ఇంకొన్ని సినిమాలు ముందు థియేటర్‌లో విడుదలలై... ఆ తర్వాత ఓటీటీకి వస్తాయి. రెండు చోట్ల వాటికి ఆదరణ లభిస్తుంది. మరి కొద్దికాలం పోయిన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుంది. 


ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘లైగర్‌’ ఒకటి. ఈ సినిమా ఎక్కడిదాకా వచ్చింది?

అవును... ఈ సినిమా గురించి అనేక మంది ఎదురుచూస్తున్నారు. వీరందరూ ఊహిస్తున్న దానికన్నా ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా ఒక థమాకా. విజయ్‌ నటన వేరే స్థాయిలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కొన్ని సార్లు పూరీగారు షాట్‌ అయిన వెంటనే - ‘‘కిక్‌ ఇచ్చావు రాజా!’’ అనేవారు. ఈ సినిమా అందరికీ కిక్‌ ఇవ్వటం ఖాయం. అలాగే మేం నిర్మిస్తున్న మరో సినిమా ‘రొమాంటిక్‌’ కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మీ గురించి రకరకాల వదంతులు వింటున్నప్పుడు.. సోషల్‌ మీడియాలో వార్తలు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?

సర్వకాల సర్వావస్థలలో నాకు మద్దతు ఇచ్చే కుటుంబం ఉండటం నా అదృష్టం. వారికి నాపై పూర్తి నమ్మకం ఉంది. నన్ను అన్నీ విషయాలలోను వారు నమ్ముతారు. అంతకన్నా నాకు ఏం కావాలి? 


కొవిడ్‌ అనేక మందిని ఇబ్బంది పెట్టింది. రకరకాలైన ఇబ్బందులకు గురి చేసింది. మీ అనుభవాలేమిటి?

అదృష్టవశాత్తు నాకు అలాంటి ఇబ్బందులేవీ కలగలేదు. నా గురించి ఆలోచించుకోవటానికి ఒక అవకాశం లభించింది. నా దగ్గర పనిచేసే వాళ్లకు రకరకాల ఫుడ్స్‌ వండటం నేర్పా. అప్పుడు నేర్పిన వంటలను వారు ఇప్పుడు నాకు వండిపెడుతున్నారు. 


మీరు పంజాబీ... హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యారు... తెలుగు, పంజాబీ సంస్కృతుల్లో మీకేది ఎక్కువ ఇష్టం...

నా ఉద్దేశంలో సంస్కృతులు ఏవైనా- వాటిలో అంతఃసూత్రంగా ఉండే విలువలు ఒకటే! అందువల్ల నాకు పెద్దగా ఇబ్బందులేవీ కలగలేదు. ఉదాహరణకు పెద్దలు కనిపించినప్పుడు దండం పెట్టాలనుకుందాం. అది తెలుగు సంస్కృతిలోనైనా... పంజాబీ సంస్కృతిలోనైనా ఒకటే కదా!

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌