సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న చిత్రం లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఈపాటికే పూరి ఆ సినిమాని ఓ కొలిక్కి తీసుకువచ్చేవాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి ఎప్పటి నుంచో ‘ఫైటర్’ అనే పేరు వినిపిస్తుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామి అయిన ఛార్మి, ఈ సినిమాకి టైటిల్ అది కాదంటూ చెప్పుకొచ్చింది.
‘‘పూరి జగన్‌గారు ఈ సినిమాకు ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేశారు. ‘ఫైటర్’ అనే టైటిల్ వినిపిస్తుంది కానీ టైటిల్ అది కాదు. ప్రస్తుత లాక్డౌన్ అయిన తర్వాత షూటింగ్ మొదలై.. మంచి సందర్భం రాగానే పూరిగారు టైటిల్ ప్రకటిస్తారు..’’ అని చార్మీ చెప్పుకొచ్చింది. దీంతో ఈ సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ కాకపోతే ఖచ్చితంగా ‘లైగర్’ అనేది టైటిల్ అయి ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు స్టార్ట్ అయ్యాయి. మగ సింహం, ఆడ పులి సంతానమే ‘లైగర్’. విచిత్రంగా ఇవి సింహం.. పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. అలాగే సింహంలాగే గర్జిస్తాయి. పూరి టైటిల్స్ ఎప్పుడూ చాలా కొత్తగా ఉంటాయి కాబట్టి.. ఈ చిత్రానికి ఫైనల్‌గా ‘లైగర్’ అనే టైటిలే ఫిక్స్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. మరి పూరి ఆలోచన ఎలా ఉందో చూద్దాం.