మాళమల్లేశ్వరుడి రథోత్సవం

ABN , First Publish Date - 2021-10-18T05:20:52+05:30 IST

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం ఆదివారం రాత్రి భారీ భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది.

మాళమల్లేశ్వరుడి రథోత్సవం
దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న అశేష భక్తజనం

  1.  భక్తులతో కిటకిటలాడిన దేవరగట్టు


 హొళగుంద/ఆలూరు రూరల్‌, అక్టోబరు 17: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం ఆదివారం రాత్రి భారీ భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. స్వామి వారికి నెరణికి గ్రామ పురోహితులు ఉదయం పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బండారు అర్చన, రథసంస్కారం, రథాంగ హోమం వంటి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం బిలేహాల్‌ గ్రామస్థులు మేటి కుంభంతో రావడంతో రథోత్సవం ప్రారంభమైంది. మాళమల్లేశ్వరస్వామి వారి విగ్రహాలను రథంపైకి చేర్చి రథాన్ని ఎదురు బసవన్న గుడి వరకు లాగారు. రథోత్సవంలో గొరవయ్యల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. స్వామి వారి రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐలు విజయకుమార్‌, రామాంజులు, మల్లికార్జున బందోబస్తు నిర్వహించారు. నెరణికి తండా, నెరణికి, బిలేహాల్‌ సర్పంచ్‌లు పారుబాయి, వన్నమ్మ, మంజమ్మ, ఎంపీటీసీ సంధ్యబాయి, దేవరగట్టు ఆలయ కమిటీ సభ్యులు వీరనాగప్ప, రామునాయక్‌, రామయ్య, సోమప్ప, లక్ష్మన్న, మంజునాయక్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 


బన్నితో శాంతి భద్రతలకు సమస్య


  1. ప్రజల్లో చైతన్యం తేవాలని సీఎంకి సీపీఐ రామకృష్ణ లేఖ


ఆలూరు, అక్టోబరు 17: దేవరగట్టులో ఏటా జరిగే మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆచారం పేరిట అర్ధరాత్రి కర్రలతో కొట్టుకోవడం వల్ల అనేక మంది గాయపడుతున్నారని, మరికొందరు మృతి చెందుతున్నారని ఆయన అన్నారు. చదువు లేకపోవడం వల్ల మూఢాచారాలను నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలకు మూడు రోజుల ముందు ప్రభుత్వం అవగాహన సదస్సులు పెట్టి కర్రల సమరాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అక్కడి ప్రజల్లో మూఢ విశ్వాసాలు పోగొట్టేందుకు ప్రభుత్వం నిరంతరం చైతన్యం సదస్సులు నిర్వహించాలని, వారిని 100 శాతం అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. అందు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని లేఖ ద్వారా ముఖ్యమంత్రిని కోరామని రామకృష్ణ వెల్లడించారు. 

Updated Date - 2021-10-18T05:20:52+05:30 IST