అంతాకలిసి.. బాదేశారు..!

ABN , First Publish Date - 2022-04-30T05:37:57+05:30 IST

అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేందుకు అంబులెన్స్‌ ఎక్కితే చాలు.. వారు చెప్పే రేట్లకు రోగి బంధువులకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ ఉంటే ఒక రేటు, అదనంగా టెక్నీషియన్‌ ఉంటే మరో రేటు వేసి రోగిని బాదేస్తారు. కనీసం

అంతాకలిసి.. బాదేశారు..!

ప్రైవేటు అంబులెన్స్‌లకు చార్జీల ఽధరలు ఖరారు

ఎక్కువ ఉన్నాయంటూ పేదల పెదవి విరుపు

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్రయాణం 

భారం కానున్న అంబులెన్స్‌ చార్జీలు


అనారోగ్యంతో ఆస్పత్రికి పోతే ఒక ఖర్చు.. అక్కడ ఆరోగ్యం కుదుటపడక అత్యవసరమై హైదరాబాదో, బెంగళూరో వెళ్లాలంటే.. వైద్యంకన్నా ముందు ప్రయాణం ఖర్చే భయపెడుతోంది. తిరుపతిలో అంబులెన్స్‌ నిర్వాహకుల వ్యవహారం సర్వత్రా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అధికారులు, అంబులెన్స్‌ నిర్వాహకులు కలసి కడప నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి తీసుకునే చార్జీలను ఖరారు చేశారు. అయితే ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని సామాన్యులు వాపోతున్నారు. అంతా కలిసి రోగులపై మరింతభారం మోపారని అంటున్నారు.


కడప, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేందుకు అంబులెన్స్‌ ఎక్కితే చాలు.. వారు చెప్పే రేట్లకు రోగి బంధువులకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌  ఉంటే ఒక రేటు, అదనంగా టెక్నీషియన్‌ ఉంటే మరో రేటు వేసి రోగిని బాదేస్తారు. కనీసం మానవత్వం కూడా చూపరు. ఇది కూడా మాఫియా లాగా తయారైంది. తిరుపతి రుయా ఘటనతో అంబులెన్స్‌ నిర్వాహకుల దాష్టీకంపై సర్వత్రా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అంబులెన్స్‌ల ధరలు ఖరారు చేశారు. ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ వెంకటశివారెడ్డి, సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌) సూపరింటెండెంట్‌ ప్రసాద్‌రావు అంబులెన్స్‌ యజమానులతో చర్చించి కడప నుంచి వివిధ ప్రాంతాలకు ఏ టైప్‌ అంబులెన్స్‌కు ఎంత చార్జీ అనే ధరలు ఖరారు చేశారు. అయితే ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని సామాన్యులు వాపోతున్నారు.

జిల్లా జనాభా సుమారు 27 లక్షలు ఉంది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు లాంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. అయితే జిల్లా వాసులకు ఏదైనా జబ్బు చేసినా, ఘర్షణ, ప్రమాదాల్లో గాయపడ్డా అన్ని వసతులతో కూడుకున్న ఆస్పత్రులు లేవు. ప్రమాదాల్లో గాయపడితే కడప, ప్రొద్దుటూరు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కడపలోని సర్వజన ఆస్పత్రి పేదలకు దిక్కుగా ఉంది. గుండె, న్యూరో, ఇతర విభాగాలకు సంబంధించి జిల్లాలో సరైన వైద్య సదుపాయాలు ఉండడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించినా ఒక రోజో, రెండు రోజులో చికిత్స చేసి పరిస్థితి సీరియస్‌గా ఉంటే చేతులెత్తేస్తున్నారు. చెన్నై, హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు, వేలూరు తీసుకెళ్లాలంటూ రెఫర్‌ చేస్తున్నారు. వెరసి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆదరాబాదరాగా ఆస్పత్రి వద్ద ఉన్న ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తే వారు చెప్పే ధరలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 


దూరం చార్జీలు... భారం

గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స కోసం ఎక్కువ మంది హైదరాబాద్‌ వెళుతుంటారు. అంతదూరం అంబులెన్స్‌లోనే వెళ్లాల్సి ఉంది. అయితే కడప నుంచి హైదరాబాద్‌కు టెంపో వాహనం రూ.19,000, తుఫాన్‌ అంబులెన్స్‌ రూ.15,000గా నిర్ణయించారు. బెంగళూరుకు టెంపో రూ.13.500, చెన్నైకి కూడా ఇదే ధర నిర్ణయించారు. ఎక్కువ మంది చికిత్స కోసం కడప వచ్చి పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళుతుంటారు. డీజల్‌ ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇంతకన్నా తక్కువ చార్జీలకు వెళ్లలేమని కొందరు అంబులెన్స్‌ యజమానులు అంటున్నారు. 


పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తే..

వైద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో సరైన ఆస్పత్రులు లేవు. ఇలాంటప్పుడు కనీసం అంబులెన్స్‌ డీజల్‌, పెట్రోల్‌పై పన్ను లేకుండా చూస్తే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. పెట్రోల్‌, డీజల్‌పై దేశంలో ఎక్కడా లేనివిధంగా పన్నులు మోపారని, తమది పేద ప్రభుత్వం అని చెబుతున్న జగన్‌  సర్కార్‌ ఆ పేదల కోసమైనా అంబులెన్స్‌కు ఇచ్చే పెట్రోల్‌, డీజల్‌పై పన్నులు లేకుండా విక్రయిస్తే రవాణా చార్జీలు భారీగా తగ్గుతాయని అంటున్నారు. ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి ఆ దిశగా జగన్‌ సర్కార్‌ ఎందుకు ఆలోచించడం లేదని పలువురు అంటున్నారు. అధికారుల కమిటీ కలిసి నిర్ణయించిన కొత్త అంబులెన్స్‌ చార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ప్రైవేటు అంబులెన్స్‌లకు

అంబులెన్స్‌ కమిటీ నిర్ణయించిన ధరలు రూ.లలో

===================================

ఊరు దూరం వాహనం, ధర రూలలో..

తూఫాన్‌ ఒమిని టెంపో

====================================

తిరుపతి 145 5600 3900 7000

కర్నూలు 220 7500 4750 9500

వేలూరు 220 7500 4750 9500

నెల్లూరు 180 6500 4200 8250

హైదరాబాద్‌ 430 15000 9500 19000

బెంగళూరు 270 11000 7000 13500

చెన్నై 270 11000 7000 13500

దూరం 10 700 600 800

25 1500 1200 1800

55 3500 2200 4000

75 4000 2500 4650

గమనిక :

ఆక్సిజన్‌ కోసం అదనపు చార్జీలు : 700

మెడికల్‌ టెక్నీషియన్‌కు : 700

మెడికల్‌ టెక్నీషియన్‌ ఫర్‌ వెంటిలేటర్‌ ఆపరేటింగ్‌ : 1500

Updated Date - 2022-04-30T05:37:57+05:30 IST