తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు... ఆల‌య పూజారుల‌కే ప్ర‌వేశం!

ABN , First Publish Date - 2021-05-17T13:32:58+05:30 IST

ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు...

తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు... ఆల‌య పూజారుల‌కే ప్ర‌వేశం!

కేదర్‌నాథ్: ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు ఈరోజు ఉదయం ఐదు గంటలకు మేషం లగ్నంలో సంప్ర‌దాయాల‌ను అనుస‌రించి తెరిచారు. ఈ సమయంలో ఆలయ పూజారులు మాత్ర‌మే పూజ‌లు నిర్వ‌హించారు. భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే కేదార‌నాథునికి పూజ‌లు చేసుకోవాల‌ని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కేదార్‌నాథ్ ఆల‌యాన్ని భక్తుల‌కు ప్ర‌వేశం లేకుండానే తెరిచారు. కరోనా ప‌రిస్థితుల కారణంగా ప్రభుత్వం చార్‌థామ్ యాత్రను వాయిదా వేసింది. 


దీని గురించి ఉత్త‌రాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ మాట్లాడుతూ నాలుగు థామాల్లో తొలి పూజ‌ల‌ను దేవ‌స్థానం బోర్డు, ఆల‌య క‌మిటీలు నిర్వ‌హిస్తున్నాయ‌ని తెలిపారు. కాగా కేదార్‌నాథుని పంచముఖి డోలి శనివారం సాయంత్రం నాటికే కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంది. దేవస్థానం బోర్డు అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీడీ సింగ్ ఆల‌యంలో ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు. చార్‌ధామ్ తలుపులు తెరిచిన నేప‌ధ్యంలో ఆల‌య నిర్వాహ‌కులు, సిబ్బంది కోవిడ్ మార్గదర్శకాల‌ను పాటించాల‌ని దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవినాథ్ రామన్ ఆదేశించారు. బద్రీనాథ్ ఆల‌య‌ తలుపులు మే 18 న తెల్లవారుజామున 4.15 గంటలకు తెరుచుకోనున్నాయి.

Updated Date - 2021-05-17T13:32:58+05:30 IST