ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం చన్నీ

ABN , First Publish Date - 2022-02-14T22:56:32+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా..

ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం చన్నీ

ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఉచిత విద్యను అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారంనాడు హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ తనపై తప్పుడు ప్రచారం సాగిస్తూ, నేరచరిత్ర ఉన్న చాలామందికి టిక్కెట్లు ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 44 మందికి ఆప్ టిక్కెట్లు ఇచ్చిందని, ప్రతి నలుగురిలో ముగ్గురు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారేనని అన్నారు.


'మార్పు' తెస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడాన్ని చన్నీ తిప్పికొడుతూ, ఇతర పార్టీలు వద్దనుకున్న వారికే ఆప్ టిక్కెట్లు ఇచ్చిందన్నారు. ఆ పార్టీ ప్రచారం పూర్తిగా అబద్ధాలు, తప్పుడుతడకల మాటలతోనే సాగుతోందని అన్నారు. ఎలాగూ తాము గెలవమని గ్రహించిన తర్వాతే ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. చంకౌర్ సాహిబ్, బదౌర్ అసెంబ్లీ నియోజవర్గాలు రెండింట్లోనూ చన్నీ ఓడిపోతారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ, కేజ్రీవాల్‌ను తనపై పోటీ చేయాలని గతంలో సవాలు చేశానని, అయితే ఆయన తన సవాలును స్వీకరించలేదని చెప్పారు. తాను పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లోనూ 25,000 ఓట్లకు తగ్గకుండా గెలుస్తానని, గరిష్టంగా 50,000కు పైగా ఓట్లు రావచ్చని చెప్పారు.


చిత్తుగా ఓడిపోనున్న ఆప్ సీఎం అభ్యర్థి

'ఆప్' సీఎం అభ్యర్థి భగవంత్ మాన్... ధురి నియోజకవర్గం నుంచి చిత్తుగా డిపోనున్నారని చన్నీ జోస్యం చెప్పారు. సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా మాన్ నెగ్గినప్పటికీ తన నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. తన ఆస్తుల విలువ రూ.170 కోట్ల వరకూ ఉంటుందని ప్రతిరోజూ వాళ్లు విమర్శలు చేస్తున్నారని, దీనిపై వాళ్లు తన అఫిడవిట్ చూస్తే బాగుంటుందని సీఎం అన్నారు. రూ2 నుంచి రూ.4 కోట్ల విలువచేసే ఆస్తిని రూ.170 కోట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్‌సీ స్కాలర్‌షిప్‌లను మరింత పటిష్టం చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల కోసం 'జనరల్ క్యాటగిరీ స్కీమ్' తెస్తామని చన్నీ వాగ్దానం చేశారు. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఫీజులను రెగ్యులేట్ చేసేందుకు ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. చంకౌర్ సాహిబ్‌లో స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని, ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తొలి ఆరు నెలల్లో పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ఆరోగ్య సేవలందిస్తామని చెప్పారు. తాను సీఎంగా ఉన్న 111 రోజుల్లో విద్యుత్ టారిఫ్ తగ్గింపు, ఇంధనం ధరల తగ్గింపు సహా పలు నిర్ణయాలను ప్రకటించినట్టు చన్నీ చెప్పారు. 

Updated Date - 2022-02-14T22:56:32+05:30 IST