Abn logo
May 17 2021 @ 00:51AM

అక్షర తత్త్వం తెలిసిన కవిత్వం

‘‘అక్షరం అయినా సరే ఒంటరిది కానే కాదు

ఏకాంత ప్రవాస ద్వీపంలో

ఎక్కడ దాచుకున్నా

అక్షరం ఒంటరిది కాదు’’ (అఫ్సర్‌ కవిత్వం: పు. 107)

కందుకూరి వీరేశలింగం పంతులు ‘సరస్వతీ నారద విలాపం’లో తన కాలపు కవిత్వం ఎలా ఉందో చెప్పే క్రమంలో కవిత్వం ఎలా ఉండకూడదో చెప్పారు. గురజాడ అప్పారావు ‘దేశభక్తి’ కవితలో (1910) కవిత్వం ఎలా ఉండాలో, కవిత్వం ఏమి చేయాలో చెప్పారు. 

‘‘ఆకులందున అణగిమణగీ

కవిత కోకిల పలుకవలెనోయ్‌

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలనోయ్‌’’ - అన్నారు గురజాడ. గత  పదకొండు దశాబ్దాలలో ఆధునిక తెలుగు కవులు కవిత్వాన్ని గురించి తమ అభిప్రాయా లను కవిత్వ రూపములో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సంఘ సంస్కరణో ద్యమం మొదలుకొని నేటి అస్తిత్వ ఉద్యమాల దాకా కనీసం ఒక వెయ్యి కవితలు కవిత్వాన్ని గురించి వచ్చి ఉంటాయి. ఈ రకమైన కవిత్వాన్ని ‘‘కవిత కవిత’’ అనవచ్చు. ఆంగ్లంలో ‘‘మెటా పొయెట్రీ’’ అంటారు. దానిని తెలుగులో ‘‘అధికవిత’’ అనవచ్చు. కవిత్వాన్ని నిర్వచిస్తూవస్తున్న తెలుగు కవులలో అఫ్సర్‌ ఒకరు. అయిదు దశాబ్దాల నుంచీ కవిత్వం రాస్తున్న అఫ్సర్‌ కవిత్వ అభిప్రాయాలను పరిశీలిద్దాం. ‘‘అక్షరం ఏకాకి కాదు’’ (‘ఇవాళ’, 1981-86), ‘‘యానం వేమన ఏమనె’’ (‘వలస’, 1992-99), ‘‘పద్యం పుట్టుక గురించి మళ్ళీ’’ (‘ఊరి చివర’, 2000-2009), ‘‘కవిత్వం యెదుట నా భాష’’  (‘ఇంటివైపు’, 2010-2018) వంటివి అఫ్సర్‌ కవిత్వం గురించి ప్రత్యేకంగా రాసిన కవితలు. 


కళ సమూహం నుంచి, సమూహం కోసం, సమూహం చేత సృష్టింప బడింది. అఫ్సర్‌ ‘‘అక్షరం ఏకాకి కాదు’’ అనడంలో ఈ సమూహ దృష్టే ఉంది. సమాజం నుంచి సాహిత్యాన్ని విడదీసి చూడలేం. కవిత్వం ఊహా విహారుల కోసం కాదు, కవిత్వం ప్రపంచ పరిణామాలకు ప్రతిఫలనం. కవిత్వంలో ఊహ ఉన్నా, అది ఏకాకి కాదు అంటారు అఫ్సర్‌: ‘‘ఏడేసి ఊహల సముద్రాల ఆవల/ ఎటు విసిరేసినా అక్షరం వొంటరిదైపోదు’’. సామాజిక వాస్తవికతను దాటి కవిత్వం మనుగడ సాగించదు అన్నది ఒక శాస్త్రీయ ఆలోచన. అలాగే మనిషిని ఆవరించే కవిత్వం తిరుగుతూ ఉంటుందన్నది కూడా ఒక సత్యం. మానవుడికి ఎంత ఊహా శక్తి ఉన్నా అదంతా మనిషి అనుభవాన్నే ఆధారం చేసుకుని ఉంటుంది. మనిషి సృష్టించే కథ కవిత్వం. మానవుల అనుభవాలను ప్రదర్శిస్తుంది. అఫ్సర్‌ అదే చెప్పారు: ‘‘నిన్నూ నీ చుట్టూ కమ్ముకున్న నీడల్ని/ తనలో పొదువుకుంటుంది అక్షరం’’. 


కవిత్వం ఎప్పుడైనా స్థలకాలబద్ధమై ఉంటుంది. కవి తన అనుభవానికి, తన పరిశీలనకు, తన ఊహకు, తన పరిసరాలకు మించి ఏదీ చెప్పడు. చెప్పడం సాధ్యం కాదు. చెప్పేది వాస్తవమైనా, వాస్తవాన్ని ఆధారం చేసుకున్న అవాస్తవమైనా, అది కవి ప్రాంగణాన్ని అధిగమించి ఉండదు: ‘‘నువ్వు ఎక్కడా ఏకాకివి కావు/ నువ్వు ఎక్కడా ఏకాంతం గుహల్లోని/ కాలం స్పర్శ తెలీకుండా తప్పించుకోలేవు.’’ కవి, కవిత్వం కాలాతీతంగా ఉండడం సాధ్యం కాదన్నది కవిగా అఫ్సర్‌ తెలుసుకున్న సత్యం. కవిత్వం మనిషి జీవితంలోని విభిన్న దశలను, మనిషి ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. అందుకే అఫ్సర్‌: ‘‘అక్షరం నువ్వు వాడేసుకున్న స్వప్నం/ అక్షరం నువ్వు పారేసుకున్న బాల్యం/ అక్షరం నువ్వు రాల్చుకున్న యవ్వనం’’ అనడం ఈ ఉద్దేశంతోనే. 


కవిత్వానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. కవిత్వానికే పరిమితమైన చరిత్ర ఉండదు. సామాజిక చరిత్రకు అతీతంగా, దానికి భిన్నంగా కవిత్వ చరిత్ర ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే, కవిత్వం సమాజ సృష్టి. సమాజం తన శ్రమ ద్వారా, తనకోసం, తనలోంచి, తాను సృష్టించిన కళా ప్రక్రియ కవిత్వం. ఏ సమాజం కూడా తానే తనకు అతీతమైన వస్తువును సృష్టించు కోదు: ‘‘మిత్రుడా!/ ఏకాంతం ఇక్కడ నిషిద్ధం/ ఇక్కడ అభ్యంతర మందిరాలు లేవు’’. 


1992 మే నెలలో అఫ్సర్‌ యానాం వెళ్ళారు. అక్కడ మాదేటి సుబ్రహ్మణ్యం అనే దళితుడు ఈయనకు పరిచయమయ్యారు. ఆయన వేమన పద్యాలు, పల్లె పదాలు పాడారు. మాటల మధ్య ‘‘మా కష్టాలు మీకు అర్థమయ్యాయా?’’ అని అఫ్సర్‌ను అడిగారు. ఆయన ప్రశ్నకు స్పందనగా  అఫ్సర్‌ ‘‘యానాం వేమన ఏమనె?’’ అనే కవిత రాశారు. ఈ కవిత కవిత్వం పట్ల అఫ్సర్‌కు ఏర్పడిన నిర్దిష్ట భావనను ధ్వనిస్తున్నది. ఈ కాలానికి కారంచేడు సంఘటన, పాదిరికుప్పం సంఘటన జరిగిపోయాయి. చుండూరు సంఘటన ప్రాణం పోసుకుంటున్నది. దళిత కవిత్వం బాల్యావస్థలో ఉంది. అయితే దళితలను గురించి, దళిత దళితేతర రచయితలు అప్పటికే విభిన్న ఉద్యమాలు, భావజాలాల వెలుగులో గొప్ప సాహిత్యం సృష్టించి ఉన్నారు. ఏమైనప్పటికీ సుబ్రహ్మణ్యం ప్రశ్న, అఫ్సర్‌ను ఆలోచనలో పడవేసి ఈ కవిత రాయించింది. అప్పటికే గొంతు విప్పుతున్న దళిత అస్తిత్వానికి అఫ్సర్‌ తన స్వరం జోడించారు: ‘‘చితికిపోయిన ఆకాశం మీంచి నువ్వు/ నన్ను భూమ్మీదికి నెట్టినప్పుడు/ నా ప్రపంచం మీద కొత్త సూర్యుడు పొడిచాడు’’. 


సమాజం నుంచి కవి ఎలా ప్రేరణ పొందుతాడో, సామాన్యుల అలవోక ప్రశ్న నుండి మేధావి వర్గానికి చెందిన కవి ఎలా ఆలోచనలు పొందుతాడో అఫ్సర్‌ సరిగ్గానే చెప్పారు: ‘‘మళ్ళా నన్నొక ప్రశ్నగా మార్చి/ నా కాళ్ళ కింద భూమిని తొలిచావు నువ్వు’’ అని కవి సామాన్యుడు సుబ్రహ్మణ్యం తనలో కలిగించిన చలనాన్ని, కదలికను నిజాయితీగా బహిర్గతం చేశారు. చరిత్రలో ఎందరో ఉద్యమకారులు, సంస్కర్తలు దళితుల పక్షాన పోరాడారు. కానీ దళిత సమస్య కొనసాగుతూనే ఉంది. దళితుల మీద దౌర్జన్యాలు కొనసా గుతూనే ఉన్నాయి. ‘‘నా ఇస్తరి దూరంగా ఎందుకు పెడ్తివి/ నా దొరా! నా రాజా!’’ అనే ప్రశ్నకు కులవాదులు, కులోన్మాదులు సమాధానం చెప్పాలి. సుబ్రహ్మణ్యం ప్రశ్న చరిత్ర మీద వేసిన ప్రశ్న. సమూహంలో కులం ఉంది గనక, కవిత్వం కులాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నది. అఫ్సర్‌ ఆ పనే చేశారు. ‘‘ఎవడు పుట్టినా ఆడదానికేగా/ ఏ ఆడది అయితేనేం?/ ఎవడు పుట్టినా రక్తంలోంచేగా/ ఏ రక్తం అయితేనేం?’’ అన్న సుబ్రహ్మణ్యం ప్రశ్న స్వచ్ఛమైన భౌతికవాద ప్రశ్న. మొన్నటికి మొన్న కరోనా వైరస్‌ సోకకుండా సామాజిక దూరాన్ని పాటించమంటే, చూశావా మేం చెప్పిన అస్పృశ్యతా సిద్ధాంతం ప్రపంచానికే ఆదర్శమైంది అని చంకలు గుద్దుకున్న దౌర్భాగ్య మేధావులు సుబ్రహ్మణ్యం ప్రశ్నకు ఆలోచించాలి. 


కవిత్వం మనిషినే వర్ణిస్తుంది, మనిషి గురించే చెబుతుంది అని సమూహ దృష్టితో అనుకున్నా, ఏ మనిషిని గురించి? అనే ప్రశ్న పుడుతుంది. ఈ ప్రశ్నను కవి ఆమోదించారు, సమాధానం చెప్పారు. ‘‘మాటకీ/ అక్షరానికీ/ మనిషి వాసన వుంటే సరిపోద్దా?/ పోదు/ ఏ మనిషి వాసనో పసికట్టనీ/మాటకీ/ అక్షరానికీ/ చెమట చేతుల మోటుతనం కావాలి’’ అన్నారు. సమాజం నుంచి, సమాజంలోని పీడితుల నుంచి వచ్చిన ప్రశ్నకు కవి ఎంత వినయంగా, ఎంత కచ్చితంగా సమాధానం చెప్పారో! 


కవి సమాజం వేసే ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాదు, తన తీర్పును కూడా ప్రకటించాలి. అఫ్సర్‌ ఈ కవితలో అలాంటి తీర్పునే ప్రకటించారు: ‘‘మాట నిజంగా మాటయితే/ మనువు మాటలో చెప్పాలంటే/ అది కాళ్ళ లోంచి పుట్టాలి/ మట్టికాళ్ళ లోంచి పుట్టాలి’’ అన్నారు. ‘‘మనువులందర్నీ మనుషులు కమ్మని శపిస్తున్నాను,’’ అన్నారు జూలూరు గౌరీశంకర్‌ ‘పాద ముద్ర’ కవితలో. అఫ్సర్‌ కవిత ముగింపు కూడా అంత బలంగానే ఉంది. కవిత్వం సమాజంలోని అట్టడుగు మెట్టు మీద నిలబడ్డ వాళ్ళ గురించి రాయాలి అన్న భావాన్ని ‘‘అంఘ్రిభవులు’’ అన్న మనువాద శబ్దాన్ని అధిక్షేపంతో మరో రకంగా వ్యాఖ్యానిస్తూ వ్యక్తం చేశారు. విభజిత సమాజంలో కవులు, కవిత్వం ఎవరి పక్షం వహించాలో అఫ్సర్‌ అస్తిత్వ ఉద్యమాల మొలకదశలో నిర్దేశించారు. సుబ్రహ్మణ్యం వేమన పద్యాలు పఠించడం, ఆయన దళితుడు కావడం, ఆయన అఫ్సర్‌ను ప్రశ్నించడం- ఈ ప్రక్రియ కవికి తానెవరి వైపు నిలబడాలో సూచించింది.  


కవిత్వం గురించి అఫ్సర్‌ 2006లో రాసిన మరో కవిత ‘పద్యం పుట్టుక గురించి’ అన్నది. ఈ సమయానికి అఫ్సర్‌ కెన్‌సారోవివా, ఎస్‌.డి. బర్మన్‌ మొదలయిన కళాకారుల గురించి కవితలు రాసి ఉన్నారు. గుజరాత్‌ మారణ కాండ మరొకసారి భారత దేశ లౌకిక తత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఈ కవితలో కూడా అఫ్సర్‌ అస్తిత్వవాద సాహిత్య సూత్రాన్నే ప్రతిపాదించాడు: ‘‘బాధ లేదని కాదులే/ కాకపోతే, ఎవరి బాధో తప్ప/ రాయలేనితనం.../ సొంతమూ, పరాయీ అని కాదు కాని/ నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి/ ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ కాస్త!/ చర్మం కూడా పరాయి చొక్కా లాగే అనిపిస్తోందీ మధ్య’’. 


‘‘నువ్వు చెప్పేదేదైనా నీదై వుండాలి, నీలోంచి రావాలి’’ అన్నారు తిలక్‌. 1960లో కూడా తెలుగు కవిత్వం పాశ్చాత్య దేశాల వెర్రిపోకడల మాయలో పడడాన్ని తిలక్‌ గుర్తు చేశారు. అఫ్సర్‌ దృష్టి వేరు. అనుభవంలో లేని విషయాలను, తనది కాని భాషలో వర్ణించే ధోరణిని తిరస్కరించి, కవిత్వంలో వస్తువు, భాష ఆ కవిదై ఉండాలన్నారు. 


‘‘కొత్త మాట రాయ్‌’’ అన్నది అఫ్సర్‌ సిద్ధాంతం. నలిగిన బాటలో నడిచే కవికి ఏ సమస్యా ఉండదు. తన బాట వేసుకునే క్రమంలో ప్రతిచోటా తనను తాను నిర్వచించుకోవాలి. అఫ్సర్‌ కవిగానే గాక, ‘‘కవిత్వ కవి’’గానూ ఆ పని చేశారు. ‘‘నువ్వేమిటో/ నీ పద్యమే చెబుతుంది’’ అన్న చిక్కనైన చిన్న వ్యాకంతో కవి వ్యక్తిత్వానికీ, కవిత్వ తత్వానికీ గల సంబంధాన్ని నిర్వచిం చారు. కవిత్వంలో మౌలికత ఉండాలి తప్ప, అనుకరణ ఉండరాదని, వ్యక్తిత్వం ఉండాలి తప్ప పరాయీకరణ ఉండరాదన్నది అఫ్సర్‌కున్న గట్టి పట్టుదల. అఫ్సర్‌ సూటిగా కవిత్వం గురించి రాసిన కవితలనేగాక, పికాసో, సుధారఘునాథన్‌, బిస్మిల్లా ఖాన్‌, సురయా వంటి దేశవిదేశీ కళాకారులను గురించి రాసిన కవితలను అధ్యయనం చేస్తే ఆయన సాంస్కృతిక, కళా సిద్ధాంతం స్పష్టమౌతుంది. 


‘‘అలంకారాలన్నీ వొలుచుకున్న

మాట కోసం చూస్తున్నాను

నిఘంటువుల్ని కప్పుకొని

గాఢనిద్రిస్తున్న భాషలో’’ 

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి


Advertisement