అస్తవ్యస్తం.. అసంపూర్ణం...

ABN , First Publish Date - 2022-07-04T05:18:19+05:30 IST

పాలకులు నాడు-నేడు పనులు ప్రారంభించారు. అయితే ఆ పనులు జిల్లాలో అస్తవ్యస్తం. అసంపూర్ణంగా ఉన్నాయి.

అస్తవ్యస్తం.. అసంపూర్ణం...
పెద్దతిప్పసముద్రం మండలం పులికల్లు ఉన్నత పాఠశాలలో పూర్తిగా నెర్రెలు చీలిన భవనం

జిల్లాలో నాడు-నేడు పనులు

జిల్లాలో మొత్తం పాఠశాలలు 2820

మొదటి విడత పూర్తయినవి 593

రెండో విడత ఎంపికైనవి 766

రేపు ప్రారంభం కానున్న పాఠశాలలు

మిగిలిన బడుల పరిస్థితేమిటో?


నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మార్చివేస్తాం. కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతాయి. అని పాలకులు నాడు-నేడు పనులు ప్రారంభించారు. అయితే ఆ పనులు జిల్లాలో అస్తవ్యస్తం. అసంపూర్ణంగా ఉన్నాయి. మొదటి విడతలో జరిగిన పనులు.. చాలా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇంకా కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు పూర్తి కాలేదు. అదేవిధంగా చాలా పాఠశాలల్లో తాగునీటి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. రెండో విడత కింద ఎంపికైన పాఠశాలల్లో ఇప్పటి వరకు చాలాచోట్ల పనులే మొదలు కాలేదు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి.. ఈ నేపధ్యంలో పూర్తిగా సమస్యల్లో ఉన్న నాడు-నేడు పనుల కింద ఎంపిక కాని మిగిలిన బడుల పరిస్థితేందని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 2820 పాఠశాలలు ఉన్నాయి. అందులో మొదటి విడత కింద 593 పాఠశాలలు ఎంపికయ్యాయి.  మొదటి విడతలో చాలాచోట్ల మరుగుదొడ్లు పూర్తి కాలేదని, తాగునీటి వసతి కూడా సరిగా పూర్తి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా రెండో విడత కింద 766 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో కనీసం పది శాతం స్కూళ్లలో కూడా పనులు మొదలు కాలేదు. రెండో విడత కింద ఎంపికైన పాఠశాలల్లో చాలా వరకు పూర్తిగా దెబ్బతిన్నాయి. గోడలు నెర్రెలు చీలాయి.. వర్షం వస్తే.. పూర్తిగా తడిసిపోతున్నాయి. మరుగుదొడ్లు లేవు. ప్రహరీగోడలు లేవు. కొన్నిచోట్ల తరగతి గదులు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో రెండో విడత పనులు వేసవి కాలంలో మొదలు కాకుండా.. తీరా పాఠశాలలు తెరుచుకునే సమయంలో మొదలు పెట్టడంపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. 


సమస్యలే సమస్యలు

కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లెలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఒకే ఆవరణలో ఉన్నాయి. 1 నుంచి 5 వరకు సుమారు 150 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో తరగతి గదులు సరిపడక గత విద్యా సంవత్సరం కొన్ని తరగతులను వరండాలోనే నిర్వహించారు. ప్రస్తుతం రెండో విడత కింద హైస్కూల్‌ భవనాలకు రూ.కోటికి పైగా నిదులు మంజూరయ్యాయి. అయితే భవనాలకు సరిపడా స్థలం లేక అధికారులు తంటాలు పడుతున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరం కూడా విద్యార్థులు అవస్థలు పడాల్సిందే. 

- రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలంలో మొత్తం 76 పాఠశాలలు ఉన్నాయి. అందులో 21 పాఠశాలలు మొదటి విడతకు ఎంపికయ్యాయి. రెండో విడత కింద ఇంకా పనులు మొదలు కాలేదు. పుత్తావాండ్లపల్లె పాఠశాల చాలా అధ్వానంగా ఉంది. ఈ పాఠశాలకు ప్రహరీగోడ లేదు, పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది. తలుపులు విరిగి పోయాయి. పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉండగా వసతులు సక్రమంగా లేవు. 

- బి.కొత్తకోట మండలం రెడ్డివారిపల్లె ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు గదుల్లో ఒకటి పూర్తిగా దెబ్బతింది. దీంతో దీనిని కూల్చివేయాలని నిర్ణయించారు. ఇంకో గదిలో సైతం పెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది. వర్షం వస్తే. గది అంతా తడిసిపోతుంది. ఇటువంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఉంది.

- పెద్దతిప్పసముద్రం మండలంలో పులికల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయి. భవనాల గోడలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. మరుగుదొడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

- రాయచోటి మండలం గరుగుపల్లె ప్రభుత్వ పాఠశాలలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. రాయచోటి ఆదర్శ పాఠశాలలో తాగునీటి శుద్ధి యంత్రం పనిచేయడం లేదు.

- కురబలకోట మండలంలో మొత్తం 45 పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడత కింద 10 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చాలాచోట్ల మరుగుదొడ్లు పూర్తి కాలేదు. 23 పాఠశాలలు రెండో విడతలో ఎంపికయ్యాయి. ఇక్కడ ఇంకా పనులు మొదలు కాలేదు. 

- రైల్వేకోడూరు పంచాయతీలో ఉన్న వెంకటేశ్వరపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు కింద రెండో విడతలో నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇక్కడ మరుగుదొడ్లు అధ్వానస్థితిలో ఉన్నాయి. పాఠశాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. పిల్లలు మరుగుదొడ్లకు వెళ్లాలంటే.. భయపడుతున్నారు. 

- రామసముద్రం మండలంలో 80 పాఠశాలలు ఉన్నాయి.. అందులో 5774 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి విడతలో 21 పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో విడతలో 18 స్కూళ్లు ఎంపికయ్యాయి. పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. చాలా పాఠశాలల్లో తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులూడి ఇనుప కమ్మీలు బయటకు కనిపిస్తున్నాయి. పలుచోట్ల గోడలు బీటలువారాయి. పలు గదుల్లో కిటికీలు ఊడిపోయాయి. తాగునీటి సమస్య ఉంది. మరుగుదొడ్లు పూర్తి కాలేదు. 

- చిన్నమండెం మండలం మల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గదులు పెచ్చులూడి ఉండడంతో విద్యార్థులను పక్క గదుల్లో కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు.

- ములకలచెరువు మండలంలో చౌడసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలు ప్రమాదకరంగా మారాయి.  28 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల తరగతి గదులకు మరమ్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. పాఠశాలలోని అన్ని తరగతి గదులు పైకప్పు పెచ్చులూడి ఇనుప కమ్మీలు బయటకు కనిపిస్తున్నాయి. పలుచోట్ల గోడలు నెర్రెలు బారాయి. 

- చిట్వేలి మండల పరిధిలో నాగవరం జడ్పీ ఉన్నత పాఠశాలను రెండో విడత కింద ఎంపిక చేశారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉంది. ప్రహరీగోడ అధ్వాన స్థితిలో ఉంది. 

- వాల్మీకిపురం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో పిచ్చి పొదల నడుమ మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు అసౌకర్యంగా ఉంది.  గుర్రంకొండ జడ్పీ ఉర్దూ హైస్కూల్‌లో నీటి కుళాయిలు విరిగిపోయాయి. ఇదే మండలం జడ్పీ తెలుగు హైస్కూల్‌లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.  


మిగిలిన బడుల సంగతేంటి ?

జిల్లాలోని 2820 పాఠశాలల్లో నాడు-నేడు కింద 1359 ఎంపికయ్యాయి. మిగిలిన 1461 పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. చాలాచోట్ల గదులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. సరైన తాగునీటి సౌకర్యం లేదు. ప్రహరీగోడలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల అసలు లేవు. మరికొన్ని చోట్ల గదులు కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ పాఠశాలల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రెండో విడత పాఠశాలల్లోనూ విద్యాసంవత్సరం ప్రారంభం సమయానికే పనులు పూర్తి చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.


రెండో విడత పనులు మొదలయ్యాయి

-రాఘవరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి.

నాడు-నేడు రెండో విడత పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మొదటి, రెండో విడత అని లేకుండా ఏ పాఠశాలలో అయినా సమస్యలు ఉన్నట్లు మా దృష్టికి వస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు చేస్తాము.



Updated Date - 2022-07-04T05:18:19+05:30 IST