Abn logo
Mar 27 2020 @ 03:26AM

సరిహద్దుల్లో ‘సంక్షోభం’!

  • లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు పయనం
  • ఇరువైపులా రాకపోకలు నిలిపివేత 
  • ఏపీ వైపు భారీగా జనం రాక
  • తిండి లేకుండా వేలమంది పడిగాపులు 
  • క్వారంటైన్‌కు సిద్ధపడినవారికే అనుమతి
  • పొందుగులలో పోలీసులతో వాగ్వాదం 
  • చేయి చేసుకున్న పోలీసులు,
  • జనం రాళ్లు రువ్వడంతో లాఠీచార్జి 
  • వందలాది మంది క్వారంటైన్‌కు తరలింపు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : మండే ఎండ ఒక వైపు! కడుపులో ఆకలి మంటలు మరో వైపు! బారికేడ్లు అడ్డు తొలగుతాయనే ఆశతో ఎడతెగని ఎదురుచూపులు! గంటలు గడిచాయి కానీ... ఆశ ఫలించలేదు. ‘అనుమతించలేం. వెనక్కి వెళ్లిపోండి’ అని చెప్పి చెప్పీ పోలీసులు అలసిపోయారు. ‘14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడితే తప్ప ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించలేం’ అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సహనం నశించిన పోలీసులు లాఠీలు ఝళిపించారు. సంయమనం కోల్పోయిన జనం రాళ్లు రువ్వారు. ఫలితం... ఉద్రిక్త వాతావరణం! ఇది... తెలంగాణ సరిహద్దులో, గుంటూరు జిల్లా పొందుగుల చెక్‌పోస్టు వద్ద గురువారంనాటి పరిస్థితి. బుధవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద చోటు చేసుకున్న దృశ్యాలు... పొందుగుల, నాగార్జున సాగర్‌ తదితర ప్రాంతాల్లో  పునరావృతమయ్యాయి.

కరోనా రక్కసి కొత్త సంక్షోభాలను సృష్టిస్తోంది. వైద్యపరమైన ఎమర్జెన్సీ కాస్తా... మానవీయ స్పందనకు పరీక్ష పెడుతోంది. ‘సరిహద్దు యుద్ధాల’కూ కారణమవుతోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో స్థిరపడినవారు తండోపతండాలుగా తరలి వస్తుండటంతో... వారిని అనుమతించలేక, అలాగని వెనక్కి పంపలేక రాష్ట్ర ప్రభుత్వం తలకిందులవుతోంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ నుంచి ఏపీ వస్తున్న వారితో పాటు ఇటునుంచి అటు వెళ్తున్న వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. మండుటెండలో కిలోమీటర్ల తరబడి నడుచుకుంటూ వచ్చినవారిని ముందుకు పోనీయకపోవడంతో ఆకలి, దప్పులతో అలమటిస్తూ గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు జిల్లా పొందుగుల చెక్‌పోస్టు వద్దకు గురువారం ఉదయం నుంచే పెద్దఎత్తున ప్రయాణికులు చేరుకున్నారు. రాత్రికి వీరి సంఖ్య దాదాపు వెయ్యికి చేరింది. ఇదే సమయంలో గుంటూరులో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు మరో వెయ్యిమంది సైతం స్వస్థలాలకు బయల్దేరారు. అనేకమంది మహిళలు, చిన్న పిల్లలతో సహా తరలివచ్చారు. ఎండ తీవ్రతకు తోడు అక్కడ ఉండటానికి సరైన సదుపాయం లేకపోవడం, తినడానికి తిండి, తాగడానికి నీరు లేక వారంతా తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు యువకులు పోలీసులను నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు వారిపై చేయి చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు ప్రయాణికులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఇరువైపులా ఉన్నవారిపై లాఠీలతో విరుచుకుపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూరల్‌ ఎస్పీ విజయరావు నేతృత్వంలో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు. తిండీతిప్పలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు వారపల్లి గ్రామస్తులు పెరుగన్నం వండి పెట్టారు. క్వారంటైన్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సుమారు 300మందిని నరసరావుపేట, మాచర్ల ప్రభుత్వాస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. లాఠీచార్జీతో భయపడిన నరసరావుపేటకు చెందిన యువకుడు కృష్ణానది బ్రిడ్జిపై నుంచి దూకడంతో కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. 


‘తూర్పు’, ప్రకాశంలో 220మంది క్వారంటైన్‌కు 

హైదరాబాద్‌ నుంచి వచ్చిన 150మందిని తూర్పు గోదావరి జిల్లా సిద్ధాంతం చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి బొమ్మూరులోని క్వారంటైన్‌గృహాలకు తరలించారు. బెంగ ళూరు నుంచి వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన 70మంది బేల్దారి కూలీలను సింగరాయకొండ క్వారంటైన్‌కు పంపారు.


‘పశ్చిమ’లో 296 మందికి స్ర్కీనింగ్‌

తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి వైపుగా వచ్చిన 19మందిని నిలిపివేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. కొవ్వూరులో గోదావరి బ్రిడ్జి వద్ద 46మందిని, వీరవాసరంలో 24మందిని, నిడదవోలులో 76మందిని, తాడేపల్లిగూడెంలో 131మందిని ఆపేశారు. వీరందరినీ స్ర్కీనింగ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. వీరిలో అత్యధికులను క్వారంటైన్‌కు పంపించారు. జీలుగుమిల్లి మండలం సరిహద్దు వద్ద వందలాది మందిని పోలీసులు నిలువరించి వెనక్కు అశ్వారావుపేట పంపారు. 


నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో క్వారంటైన్‌ 

తెలంగాణ నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించినట్టు నూజివీడు సబ్‌కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ చెప్పారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలివచ్చిన వారిని ప్రత్యేక వాహనంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కే4 బ్లాక్‌కు తరలించారు. ఏరియా ఆస్పత్రిలో వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి పరిశీలించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement