ఏపీలో అస్తవ్యస్తం, అరాచకం

ABN , First Publish Date - 2022-08-07T07:54:51+05:30 IST

ఏపీలో అస్తవ్యస్తం, అరాచకం

ఏపీలో అస్తవ్యస్తం, అరాచకం

ప్రజలు జగన్‌ సర్కార్‌ను ఇంటికి పంపనున్నారు

ఢిల్లీలో జాతీయ మీడియాతో చంద్రబాబు


న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అస్తవ్యస్త, అరాచక పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం అధినేత,  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  శనివారం ఢిల్లీలో తనను కలుసుకున్న జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా  మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే నిర్ణయానికి వచ్చారన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నేను కృషి చేశాను. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాను. ఈ రెండింటినీ జగన్‌ నాశనం చేశారు. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కానీ, ఇప్పుడు అభివృద్ధి పక్క దారి పట్టింది. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం  బ్రాండులను ఉత్పత్తి చేయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్నారు. మద్యం, మైనింగ్‌ ద్వారా అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో చూస్తే ఎటువంటి శక్తులు రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోందన్నారు. ఇలాంటి ఎంపీలు పార్లమెంటులో ఉండడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదంతాన్ని పార్లమెంటు లో లేవనెత్తాల్సిందిగా తాను తమ పార్టీ ఎంపీలకు చెప్పానని తెలిపారు. యూరప్‌ సహా అనేక ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్నారు. 8 శాతం వృద్ధి రేటు కొనసాగుతోందని, తలసరి ఆదాయం కూడా మెరుగ్గా ఉన్నదని  చంద్రబాబు వివరించారు. ఏపీలో జాతీయ పార్టీలు బలంగా లేవని ఆయన అన్నారు. విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ  బలహీనపడిందని, అయినప్పటికీ చాలా చోట్ల తెలుగుదేశం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. తెలంగాణలో త్రిముఖ పోటీ పరిస్థితులు నెలకొన్నాయని, చివరకు రెండు పార్టీలు మాత్రమే మిగులుతాయని అభిప్రాయపడ్డారు.  


రఘురామరాజుతో భేటీ

వైసీపీ ఎంపీ రఘురామరాజు శనివారం మధ్యాహ్నం చంద్రబాబునాయుడుతో దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఎన్టీఆర్‌ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాదం నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించేందుకు తా ను వెళ్లానని, సహజంగానే తమ మధ్య రాజకీయాలు చర్చకు వచ్చాయని చెప్పారు.  తెలుగుదేశం  తిరిగి వస్తుందనే ఆత్మవిశ్వాసం చంద్రబాబులో కనపడిందని రఘురామరాజు తెలిపారు.

Updated Date - 2022-08-07T07:54:51+05:30 IST