చనిపోయిన చాన్నాళ్లకు...

ABN , First Publish Date - 2021-08-09T06:24:22+05:30 IST

ఏదో గాలివాటు కబురు అలాగే తెలుస్తుంటాయి ప్రియుల సెలవు సందేశాలు తురిమిన చక్రంలో సూరీడు...

చనిపోయిన చాన్నాళ్లకు...

ఏదో గాలివాటు కబురు

అలాగే తెలుస్తుంటాయి

ప్రియుల సెలవు సందేశాలు

తురిమిన చక్రంలో సూరీడు

భలే చిక్కుకున్నాడులే చూడు


గొంతు రాసుకుపోతుంది

కవాతు రా.. రమ్మని కవ్విస్తుంది

కనుదోయిల మీదుగా

రెప్పల తుప్పలలోనా

గాలించిన స్వర్గాలూ

మరిగించిన మంచుసోనలూ

ఘనపరిచిన చలినెగళ్లూ

ఏవంటే ఏవి కవీ.. ఏవి ఏవంటే?


మీరు వదిలేసిన అంగీ

మేఘంలా చుట్టుకుంది నింగి

ఎన్ని పిలుపులూ... పిడుగులూ

ఎంత గర్జనా... దిగ్దర్శనా


గాలి మోసుకొచ్చే రహస్యాలను

డీకోడ్‌ చేసే భాషేగా కవిత్వం

రోగ నిర్ధారణ చేసే 

రక్త నాలుకా

జివ్వున పైకి తన్నే 

తుఫానూ

సర్రున లేచిన కోడె నాగు 

  మెడనరమూ

అవును... ముమూ

అందిందా మనకు 

కవితా స్వరూపమూ

(దేవిప్రియకు)

రివేరా

Updated Date - 2021-08-09T06:24:22+05:30 IST