మారుతున్న సమీకరణలు

ABN , First Publish Date - 2021-10-18T03:45:08+05:30 IST

కొల్లాపూర్‌ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. మొన్నటి వరకు చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్‌కు ఇప్పుడు వలసలు పెరగడంతో పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మారుతున్న సమీకరణలు
రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న రంగినేని అభిలాష్‌రావు(ఫైల్‌)

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు

ఇటీవలే హస్తం గూటికి చేరిన చింతలపల్లి జగదీశ్వర్‌రావు

త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న రంగినేని అభిలాష్‌రావు

చేరికలతో పార్టీలో పునరుత్తేజం వస్తుందని కేడర్‌లో ఆశలు

రెండు వర్గాలుగా విడిపోయిన టీఆర్‌ఎస్‌


వనపర్తి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్‌ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. మొన్నటి వరకు చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్‌కు ఇప్పుడు వలసలు పెరగడంతో పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ కార్యక్రమంలో చింతలపల్లి జగదీశ్వర్‌రావు ఆ పార్టీకి గూటికి చేరగా.. తాజాగా మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న రంగినేని అభిలాష్‌రావు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సమావేశం కావడం చర్చనీయంశంగా మారింది. తన అనుచరులతో రేవంత్‌ను కలిసిన అభిలాష్‌ కాంగ్రెస్‌లోకి రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గంలోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి.. పార్టీ మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న జగదీశ్వర్‌రావుకు కొంత కేడర్‌ ఉంది. కొన్నాళ్ల కిందట కొల్లాపూర్‌ రాజకీయల్లో అడుగుపెట్టిన అభిలాష్‌రావుకు ఎన్నికల నిర్వహణ, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కావాల్సినంత అనుభవం ఉండటం, యువకుడు కావడం, మాస్‌ లీడర్‌గా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని భావిస్తుండటం కలిసొచ్చే అవకాశం ఉంది.


రసవత్తరంగా రాజకీయాలు

గత ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌కు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉండేవారు. ఆయన టీఆర్‌ఎస్‌ మొదటి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తదనంతర పరిస్థితుల్లో హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అక్కడ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్‌ నుంచి బీరంతో వచ్చిన వర్గం ఒకవైపు, జూపల్లి కృష్ణారావు వర్గం మరోవైపు విడిపోయాయి. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపునకు పని చేసిన రంగినేని అభిలాష్‌రావు కొల్లాపూర్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడం, అప్పటికే అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన జగదీశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లోనే ఉండటంతో ఆ పార్టీలో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఎవరి కార్యక్రమాలు వారు విడివిడిగా చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ వస్తుందో తెలియని పరిస్థితులు ఉంది. ప్రస్తుతం కృష్ణారావు, హర్షవర్ధన్‌రెడ్డి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఇక మిగిలిన ఇద్దరికి ఇద్దరు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ గూటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. 


హామీ ఎవరికీ లేనట్లే..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం అయ్యే వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఆయన అధ్యక్షుడ అయ్యాక వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, ప్రధానంగా యువతలో మంచి క్రేజ్‌ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందడంతో పార్టీ కేడర్‌లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు తరలిరావడం అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌కు కేడర్‌ ఉన్నప్పటికీ నాయకత్వం లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలో నాయకులను తయారుచేసే పనిలో పడ్డారు. దాంతో పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా పార్టీలో చేరిన అభిలాష్‌రావు లేదా జగదీశ్వర్‌రావు ఇద్దరిలో ఎవరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ హామీలు లేవు. కానీ పార్టీ బలోపేతం అయితే ఎవరు క్షేత్రస్థాయిలో కీలకంగా మారుతారో వారికే టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి కేడర్‌ ఉంది. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం, గత ఎన్నికల్లో గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రజలు కూడా కొంత అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోకి వచ్చిన, రాబోతున్న నాయకులు పార్టీ మారబోమనే సంకేతాలు కేడర్‌కు కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 



Updated Date - 2021-10-18T03:45:08+05:30 IST