Abn logo
Sep 28 2021 @ 16:01PM

జీఎస్‌టీలో త్వరలో మార్పులు...

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) విధానాన్ని సమీక్షించే క్రమంలో కేంద్రం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. జీఎస్‌టీ వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన ఈ కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఈ కమిటీలకు సారథ్యం వహిస్తారు. రేట్‌ స్లాబ్‌లు– విలీనం, జీఎస్‌టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారణకు మార్గాల అన్వేషణ, ట్యాక్స్‌ బేస్‌ పెంపు తత్సంబంధిత అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. క్లిష్టమైన పరోక్ష పన్ను రేట్ల వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ, నాలుగేళ్ల క్రితం(2017 జూలై నుంచి) జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థను మరింత సరళతరం చేయడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


కమిటీలు ఇలా... 

బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. శ్చిమ బెంగాల్‌ ఆర్థికమంత్రి అమిత్‌ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్‌ బాలగోపాల్, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తార్‌కిషోర్‌ ప్రసాద్‌ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వం వహిస్తారు. వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి టీఎస్‌ సింగ్‌ డియో సభ్యులు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో లక్నోలో కొద్ది రోజుల క్రితం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌... ఈ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జీఎస్‌టీకి సంబంధించి మరికొన్ని వివరాలిలా ఉన్నాయ. 


ప్రస్తుతం ప్రధానంగా నాలుగు జీఎస్‌టీ రేట్ల వ్యవస్థ అమల్లో ఉంది. నిత్యావసరాలపై కనిష్టంగా ఐదు శాతం పన్ను అమలవుతుండగా, కార్లపై అత్యధికంగా 28 శాతం పన్నును వసూలు చేస్తున్నారు. కాగా... 12-18 శాతం పన్ను స్లాబ్‌లు  కూడా ఉన్నాయి. లగ్జరీ, పొగాకు వంటి డీమెరిట్, సిన్‌ గూడ్స్‌పై ఉన్న అత్యధిక 28 శాతంపై సెస్‌ విధింపు కూడా అమల్లో ఉంది.  కాగా... 12-18 శాతం శ్లాబ్‌లను ఒకటిగా చేయాలన్న డిమాండ్‌ గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. మినహాయింపుల కేటగిరీ నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగించి, స్లాబ్‌ల హేతుబద్ధీకరణ వల్ల తలెత్తే రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలని కూడా కొన్ని వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక తుది వస్తువులపై, వాటి ఇన్‌పుట్‌లపై విధించే పన్ను కంటే తక్కువ రేటును విధింపు(ఇన్‌వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్‌) విషయంలో పన్ను వ్యత్యాసాలను ఇప్పటికే జీఎస్‌టీ కౌన్సిల్‌ తొలగించిన విషయం విదితమే. మొబైల్‌ హ్యాండ్‌సెట్, పాదరక్షలు,  వస్త్రాల విషయంలో  ఈ రేటు వ్యత్యాసాలను సరిచేస్తూ సవరణలు జరిగాయి.


పెట్రోలుకు సంబంధించి... 

జీఎస్‌టీ వ్యవస్థ అమలు తర్వాత పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడాయిల్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి సమావేశం... అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో... ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముండడమే కౌన్సిల్‌ నిర్ణయానికి దోహదపడినట్లు చెబుతున్నారు.