Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మారిన వ్యూహం, మారని హృదయం!

twitter-iconwatsapp-iconfb-icon
మారిన వ్యూహం, మారని హృదయం!

అనూహ్య రీతుల్లో వ్యవహరించడం ఘటనాఘటన సమర్థులైన నాయకుల స్వతస్సిద్ధ లక్షణం. ముందేమి జరగనున్నదోనని నిరంతరం అంచనావేయడంలో ప్రత్యర్థులు తలమునకలయ్యేలా చేయడం ఒక చతుర చాణక్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటువంటి రాజకీయ చదరంగంలో ఆరితేరిన నేత అని మరి చెప్పాలా? పుణ్యాత్ముడు గురునానక్ జయంతి నాడు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు నరేంద్ర మోదీ నాటకీయంగా ప్రకటించి పక్షం రోజులు గడిచిపోయాయి. సాగుచట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత పదిహేను నెలలుగా రైతులు దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్నా కించిత్ కూడా పట్టించుకోని ప్రధానమంత్రి ఎట్టకేలకు ఎందుకు వెనుకడుగు వేశారు? ఏ ఒక్కరికీ స్పష్టత లేని, స్పష్టత రాని విషయమది. మోదీ చెప్పిన ‘క్షమాపణ’ రైతులకు గురుపూర్ణిమ ‘కానుక’ అని ఆయన మద్దతుదారులు ఘంటాపథంగా చెబుతున్నారు. అంతేకాదు, అది ఆయన విశాల హృదయానికి ఒక తార్కాణమని కూడా వారు అంటున్నారు. అయితే మోదీ రాజకీయాలను మొదటి నుంచీ సన్నిహితంగా గమనిస్తున్నవారు పశ్చాత్తాపం అనేది ఆయన వ్యక్తిత్వంలో కానవచ్చే గుణవిశేషం కాదని అభిప్రాయపడుతున్నారు. అవును, మోదీ లాంటి శక్తిమంతుడైన నాయకుడు మట్టిమనుషుల డిమాండ్‌కు దిగిరావడం ఆయన హృదయ పరివర్తన ఫలితం కాదు; ఆయన వ్యూహంలో మార్పును మాత్రమే అది సూచిస్తుంది.


తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగానూ, ఇప్పుడు దేశ ప్రధానమంత్రిగానూ నరేంద్రమోదీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు తక్కువేమీ కావు. ఇంచుమించు రెండు దశాబ్దాలుగా అధికారాన్ని చెలాయిస్తున్న నరేంద్ర మోదీ తన వివాదాస్పద, నిర్ణయాలు చర్యలకు కనీసం ఒక్కసారైనా బహిరంగంగా క్షమాపణలు చెప్పలేదు. క్షమాపణలు చెప్పడం కాదు కదా సంజాయిషీ ఇవ్వడమనేది నాయకత్వ బలహీనత అవుతుందని మోదీ విశ్వసిస్తారు. క్షమాపణలు చెప్పడమనేది ఆయన పురుషహంకృత వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధం. 2002 మతతత్వ అల్లర్లను అదుపు చేయడంలో వైఫల్యానికి, పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఎదురయిన కష్టాలకు ఒకటే కారణం ఉంది. అది: విమర్శకుల ముందు ఒక బలహీన నేతగా కనిపించేందుకు మోదీలో పూర్తి విముఖత. ఇదే ఆయన బలం. సదా మహాబలుడుగా కన్పించాలన్నదే మోదీ అభిలాష. 


అయితే రైతుల ఉద్యమం రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో, మరీ ముఖ్యంగా కీలక ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలను దెబ్బ తీయగలదనే వాస్తవాన్ని నరేంద్ర మోదీ గుర్తించారు. ఎన్నికలు మోదీకి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటివి. అవి ఆయనకు ఒక టానిక్ (బలవర్ధక ఔషధం); ఎక్కడ లేని సత్తువను సమకూరుస్తాయి. ఒక సామాన్య కార్యకర్త (1980 దశకంలో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన రాత్రిపూట వాల్‌పోస్టర్లు అతికించారు)గా ఎంత ఉత్సాహంతో పని చేసారో, ఇప్పుడు ప్రధానమంత్రిగా వివిధ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థుల విజయానికి అంతే ఉత్సాహంతో పని చేస్తున్నారు. ‘ప్రచారాన్ని కవిత్వంలో నిర్వహించాలి, పరిపాలనను వచనంలా నిర్వహించాలన్న’ అమెరికా రాజనీతిజ్ఞుడు మేరియో క్యూమో మాటలు మోదీకి పూర్తిగా వర్తిస్తాయి. ప్రచారం, పాలన మధ్య విభజన రేఖలను పూర్తిగా అస్పష్టపరచిన నాయకుడు మోదీ. పరిపాలకుడిగా ఆయన ప్రతి చర్య, రాబోయే ఎన్నికలకు సంవత్సరం పొడుగునా జరిగే ప్రచారంలో భాగమే. ఓటర్లను గరిష్ఠంగా ఆకట్టుకోవడానికి ఉద్దేశించినవే.


వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు ముంచుకొస్తున్నందునే వివాదాస్పద సాగుచట్టాలను నరేంద్ర మోదీ ఉపసంహరించారు. వాటిని పూర్తిస్థాయిలో అమలుపరచడంలో తాను వ్యక్తిగతంగా విఫలమయ్యానని కూడా అంగీకరించారు. నిజానికి ఈ వైఫల్య బాధ్యతను తన కేబినెట్ సహచరులలో ఎవరో ఒకరి పైకి ఆయన సునాయాసంగా నెట్టివేయవచ్చు. కొవిడ్ రెండో విజృంభణను సకాలంలో అదుపుచేయడంలో కేంద్రప్రభుత్వ వైఫల్యానికి డాక్టర్ హర్ష్‌వర్థన్‌ను బాధ్యుడ్ని చేయలేదూ? అలాగే రైతుల ఆందోళన విషయంలో కూడా వ్యవసాయ మంత్రి నరేంద్ర తొమార్‌ను బలిపశువు చేయవచ్చు. కానీ అలా జరగలేదు. ఈ వైఫల్యం తనదే అని మోదీ అంగీకరించారు. అయితే ఈ ఒప్పుకోలు ఆయన నాయకత్వ శైలిలో ఒక వ్యూహాత్మక మార్పును వెల్లడించింది. సంపూర్ణ అధికారాలను చెలాయించే సర్వోన్నత నాయకుడి స్థాయి నుంచి వినయశీలుడయిన ఒక సామాన్య నేతగా ఆయన మారిపోయారు. వైఫల్య బాధ్యత తనదే అని స్వయంగా ప్రకటించారు. ఈ వ్యూహాత్మక మార్పు తాత్కాలికం కావచ్చునేమో కానీ మోదీలో అది నిస్సందేహంగా ఒక గమనార్హమైన మార్పు. తాను బిగ్‌బాస్ అయినప్పటికీ అప్పుడప్పుడూ తప్పులు చేసే వాడినేనని ఆయన చెప్పదలుచుకున్నారు. తద్వారా దురహంకారి అయిన నిరంకుశ పాలకుడు అనే ప్రత్యర్థుల విమర్శలోని తీవ్రతను తగ్గించడమే ఆయన ఉద్ధేశ్యమని అర్థమవుతోంది. మోదీ మొదటి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు 2016లో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకునేందుకు ఆయన్ని పురిగొల్పాయి. ఆ నిర్ణయంతో తనను తాను శక్తిమంతుడినైన ప్రధానమంత్రిగా ఆయన నిరూపించుకున్నారు. అంతేకాకుండా అవినీతి వ్యతిరేక ధర్మ పోరాట యోధుడిగా ప్రజల్లో పేరు పొందారు. 


సాగుచట్టాల విషయంలో నరేంద్ర మోదీ ‘క్షమాపణ’ చెప్పడం ఒక వ్యూహాత్మక చర్యే. అయితే పేదరైతు సంరక్షకుడిగా ప్రజల మనస్సుల్లో తన గురించి ఉన్న ఒక భావనను మరింత పటిష్ఠం చేసుకునే ప్రయత్నంతో ముడివడివున్న చర్య అది. ఎన్నికల ప్రచార సభలలో మోదీ ఉపన్యాసాలను నిశితంగా పరిశీలించండి. పేద రైతు శ్రేయస్సు విషయంలో తన నిబద్ధత గురించి ఆయన ప్రస్తావించిన ప్రసంగం ఒకటంటే ఒకటి కూడా లేదు. నోట్ల రద్దుతో దేశ ధనిక వర్గాల వ్యతిరేకతను భరించగల సత్తా మోదీకి ఉంది. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మిన్నంటేందుకు అనుమతించడం ద్వారా మధ్యతరగతి వర్గాల ఆగ్రహావేశాలను కూడా ఆయన తట్టుకోగలరు. అలాగే హిందూత్వ భావోద్వేగాలను పురిగొల్పడం ద్వారా సంపన్న, మధ్యతరగతి వర్గాలను, తన పక్షాన నిలుపుకోగల సామర్థ్యమూ ఆయనకు ఉంది. 2002 అనంతర గుజరాత్ ఓటర్లలోని ‘నయా మధ్య తరగతి’ హిందూ ఓటర్లను సంఘటితం చేసేందుకే ‘హిందూ హృదయ్ సమ్రాట్’ (హిందూ హృదయాల చక్రవర్తి) అనే విశేషణాన్ని సృష్టించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.


దేశవ్యాప్తంగా పేద రైతులు ఎంతోమంది ఉన్నారు. నిరుపేద ప్రజలు అసంఖ్యాకంగా ఉన్నారు. మరి వారందరూ తమ శ్రేయస్సునకు అంకితమైన ‘వికాస్ -పురుష్’ (అభివృద్ధి సాధకుడు)గా ప్రధాని మోదీని భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2019 సార్వత్రక ఎన్నికల ముందు ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ని ప్రారంభించారు. కనీస ఆదాయానికి భరోసా కల్పించి రైతులను ఆకట్టుకునే లక్ష్యంతోనే ఆ ‘నిధి’ని ప్రారంభించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సాగుచట్టాల రద్దుకోసం ఢిల్లీ శివార్లలో నిరసనోద్యమానికి దిగిన రైతుల విషయంలో పాలకులు వ్యవహరించిన తీరుతో రైతు శ్రేయస్సుకు అంకితమైన నాయకుడిగా మోదీ పొందుతున్న గౌరవానికి తీవ్ర విఘాతం వాటిల్లింది. ఉద్యమిస్తున్న రైతులు ‘అరాచకవాదులు’ అనీ, ‘ఉగ్రవాదులు’ అనీ మోదీ సర్కార్ నిందించింది. తద్వారా విశాల ప్రజానీకం మద్దతు వారికి లభించకుండా ఉండేలా అడ్డుపడింది. ప్రభుత్వ గర్హనీయ తీరు తెన్నులకు అన్నదాతలు ముఖ్యంగా పంజాబ్ రైతులు తీవ్రంగా స్పందించారు. పరిస్థితులు విషమించాయి. సాగుచట్టాల లక్ష్యాలు, ఆచరణీయత విషయం అటుంచి రైతు వ్యతిరేకిగా నరేంద్ర మోదీపై రైతులలోనూ, విశాల ప్రజానీకంలోనూ ఒక అభిప్రాయం దృఢపడింది. దీనివల్ల తనకు, తన పార్టీకి తీవ్ర హాని జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించారు. 


మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రైతుల పైకి ఒక కేంద్రమంత్రి కుమారుడు అమానుషంగా కారును నడపడం దేశప్రజలను దిగ్భ్రాంతి పరిచింది. ఆ ఘటన సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమంలో నిస్సందేహంగా ఒక ముఖ్యమలుపు అయింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. లఖీంపూర్ ఘటన, బీజేపీ మీడియా మేనేజర్లు అంగీకరించిన దానికంటే చాలా ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసింది. ఇది, వార్తలకు భౌగోళిక హద్దులు పూర్తిగా చెరిగిపోయిన కాలం కదా. లఖీంపూర్ ఘటన, అది జరిగిన ప్రదేశంలోనే కాదు, ఆసేతు హిమాచలం ప్రతి రైతునూ తీవ్ర ఆగ్రహావేశాలకు లోను చేసింది. రాకేశ్ తికాయత్ వంటి రైతు నేతకు హర్యానా, పంజాబ్, యూపీలోనే కాకుండా మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఆదరణ ఇతోధికంగా పెరిగిపోయింది. తికాయత్ దేశంలో ఎక్కడకు వెళ్ళినా ఆయన సభలకు ప్రజలు వెల్లువెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘ఆందోళన్ జీవి’గా మారిన రైతన్నను ప్రభుత్వం ఎలా ఉపేక్షించగలదు? 


లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్న కారణంగా రైతుల ఆందోళనను మోదీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. గర్హనీయంగా నిర్లక్ష్యం చేసింది. అడ్డు అదుపులేని ఈ దురహంకార ధోరణి చివరకు మోదీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించేందుకు దారితీసింది. అంతిమంగా సాగుచట్టాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రధానమంత్రి తన ప్రతిష్ఠకు వాటిల్లుతోన్న నష్టాన్ని కొంతమేరకు తగ్గించుకోగలిగారు. రైతుల పట్ల మోదీ వైఖరిలో ఆకస్మిక మార్పు ఆయన హృదయ పరివర్తన ఫలితం కాదు. రాజకీయాలలో సదా ఒక అంతర్వాణి వినిపిస్తుంటుంది. ఏ నాయకుడూ దానిని విస్మరించడు, నిర్లక్ష్యం చేయడు. చేయలేడు. ఎన్నికల నగారాయే ఆ అంతర్వాణి.

మారిన వ్యూహం, మారని హృదయం!

gరాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.