ఆఖరి నిమిషంలో మాస్టర్ ప్లాన్ మార్చేశారు..!

ABN , First Publish Date - 2021-07-24T06:00:17+05:30 IST

ఆఖరి నిమిషంలో కల్పించుకొని మొత్తం ప్లాన్‌ మార్చివేసిందని...

ఆఖరి నిమిషంలో మాస్టర్ ప్లాన్ మార్చేశారు..!

  • అధికారికంగా లీ అసోసియేట్స్‌కు తయారీ బాధ్యత
  • మధ్యలో అనధికార సంస్థ ప్రవేశం
  • సీఎం పేషీ అధికారి ఒత్తిళ్లతో మార్పులు
  • భీమిలి, కాపులుప్పాడ, భోగాపురం ప్రాంతాల్లో భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులకు అనుగుణంగా ప్లాన్‌ వుండాలని పలు సూచన
  • పనిలో పనిగా నగరంలో రహదారులన్నింటినీ విస్తరించాలని దేశం
  •  ఎన్నో లోపాలు
  • పెదవివిప్పని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ ప్లాన్‌-2041 తయారీలో లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారికంగా ఏర్పాటుచేసుకున్న సంస్థ కాకుండా వేరే అవసరాల కోసం నియమించిన సంస్థ ఆఖరి నిమిషంలో కల్పించుకొని మొత్తం ప్లాన్‌ మార్చివేసిందని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం పేషీలో మొన్నటివరకు చక్రం తిప్పిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇందులో కల్పించుకోవడంతో వీఎంఆర్‌డీఏ అధికారులు నోరెత్తలేక మౌనం దాల్చారు. రాజధాని అధికారుల ఆలోచనలు, అభీష్టం మేరకు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశారని చెబుతున్నారు. 


వుడాకు గతంలో మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేసిన లీ అసోసియేట్స్‌ సంస్థకే ఈసారి కూడా మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేసే బాధ్యత అప్పగించారు. విశాఖపట్నంలో పనిచేసే ప్లానింగ్‌ అధికారులకు లీ అసోసియేట్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రణాళికలు తయారు చేయాలన్నా వారికే బాధ్యతలు అప్పగిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా వారి బంధం కొనసాగుతోంది. విశాఖపట్నం-కాకినాడ పెట్రో కారిడార్‌ ప్లాన్‌ను కూడా ఈ సంస్థతోనే తయారు చేయించారు. లీ అసోసియేట్స్‌ దగ్గర మూడు జిల్లాల సమాచారం సిద్ధంగా వుండడం వల్ల ఎటువంటి ప్రణాళిక అయినా పాత డేటాకు చిన్న చిన్న మార్పులు..చేర్పులు చేసి అందించడం, దానిని అధికారులు ఆమోదించడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటి మాస్టర్‌ప్లాన్‌ను కూడా లీ అసోసియేట్స్‌ ఆ విధంగానే రూపొందించింది. అయితే చివరి నిమిషంలో సీఎం పేషీలో కీలక అధికారి ఇక్కడికి వచ్చి మాస్టర్‌ ప్లాన్‌ మొత్తం మార్చేశారు. భీమిలి, కాపులుప్పాడ, భోగాపురం ప్రాంతాల్లో భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులకు అనుగుణంగా ప్లాన్‌ వుండాలని పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కాపులుప్పాడలో చేపట్టిన రాష్ట్ర అతిథి గృహ నిర్మాణానికి కన్సల్టెంట్‌గా వున్న అహ్మదాబాద్‌ కంపెనీ ‘హెచ్‌ఎస్‌ఎల్‌’కు మాస్టర్‌ప్లాన్‌ తయారీ బాధ్యత అప్పగించారు. లీ అసోసియేట్స్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టారు. పనిలో పనిగా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటైతే...నగరంలో ట్రాఫిక్‌ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రధాన రహదారులన్నీ విస్తరించాలని ఆదేశించారు. దాంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే గ్రీన్‌ ఫీల్డ్‌ (నూతన) సిటీకి మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసినట్టుగా పాత నగరమైన విశాఖకు ప్లాన్‌ రూపొందించారు. అన్ని రహదారులను ప్రస్తుతం వున్న వాటి కంటే కనీసం 50 శాతానికి మించి విస్తరించాలని ప్రతిపాదించారు. ఇవన్నీ గమనించిన వీఎంఆర్‌డీఏ అధికారులు కొన్ని సూచనలు చేసినా, వాటిని అహ్మదాబాద్‌ కంపెనీ పట్టించుకోలేదని, ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చెప్పినట్టు మార్పులు చేసి ప్రజల ముందుకు తీసుకువచ్చారని చెబుతున్నారు. 


ఎన్నో లోపాలు


- ఎవరైనా అభ్యంతరం వ్యక్తంచేయాలంటే...ఏ మాస్టర్‌ప్లాన్‌ రహదారి..ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్ల గుండా వెళుతుందో ప్రకటించాలి. కానీ ఈ ప్లాన్‌లో ఎక్కడా ఒక్క సర్వే నంబరును ప్రస్తావించలేదు. 

- ఏ ప్లాన్‌ అయినా సరే గూగుల్‌ మ్యాప్‌ను ఆధారంగా చేసుకొని..దానిపై కొత్త ప్లాన్‌ ఇంపోజ్‌ చేసి చూపిస్తారు. ఇప్పటికే అక్కడున్న గ్రామాలు, సౌకర్యాలు..ఇప్పుడు కొత్తగా వచ్చేవి ఏమిటనేది అర్థమయ్యేలా చూపిస్తారు. కానీ ఇక్కడ అటువంటి సమాచారం ఏదీ లేదు.

- వార్డు, జోన్‌ స్థాయిలో సూక్ష్మ ప్రణాళిక లేదు. 

- గత మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన అనేక అంశాలను ఇప్పటి దాంట్లో ప్రస్తావించలేదు. 

- కనీసం 10 కి.మీ. పొడవు కూడా లేని మార్గాల్లో 60 మీటర్ల వెడల్పు, 5 కి.మీ. కంటే తక్కువ వున్న రహదారులను 30 మీటర్లకు, కేవలం 2 కి.మీ. పొడవు వున్న రహదారులను 25 మీటర్ల మేర విస్తరిస్తామని కొత్త మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. అంత తక్కువ పొడవున్న మార్గాల్లో ఎక్కువ ట్రాఫిక్‌ ఉండదు కానీ రహదారులను బాగా విస్తరిస్తామని పేర్కొన్నారు.


అభ్యంతరం వస్తేనే తొలగిస్తారట


కొత్త మాస్టర్‌ప్లాన్‌-2041పై అన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నా...వీఎంఆర్‌డీఏ అధికారులు పెదవి విప్పడం లేదు. ఆ ప్లాన్‌ను ఏ ఉద్దేశంతో ఎందుకు తయారుచేశారో సవివరంగా చెప్పే ధైర్యం లేకే వారు ప్రజల ముందుకు రావడం లేదనే వాదన వినిపిస్తోంది. దీనిపై అభ్యంతరాలు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకొని మార్పులు చేస్తారని, అభ్యంతరాలు రాని వాటిని యథాప్రకారం కొనసాగిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకైతే ప్లానింగ్‌ అధికారుల నుంచి తగిన సూచనలు సలహాలు అందుతాయి. కానీ గ్రామాల్లో సామాన్య ప్రజలకు ఈ మాస్టర్‌ ప్లాన్‌ గురించి చెప్పే వారే లేరు. దాంతో వారంతా నష్టపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా విశాఖ నగరానికి అనుగుణంగా కొత్త ప్లాన్‌ తయారుచేసి, ప్రజల ముందుకు తీసుకురావాలని అంతా కోరుతున్నారు.

Updated Date - 2021-07-24T06:00:17+05:30 IST