హైదరాబాద్‌-విజయవాడ హైవేను 6 లేన్లుగా మార్చండి

ABN , First Publish Date - 2021-09-07T07:09:48+05:30 IST

తెలంగాణలోని మరో నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా

హైదరాబాద్‌-విజయవాడ హైవేను 6 లేన్లుగా మార్చండి

  • మరో 4 రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించండి
  • హైదరాబాద్‌ దక్షిణ ప్రాంత ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేయండి
  • కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి

 

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/విజయవాడ సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని మరో నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలంటూ సీఎం కేసీఆర్‌ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 2188 కిలోమీటర్ల పొడవైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా నోటిఫై చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ సోమవారం గడ్కరీతో భేటీ అయ్యారు.


రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడం, హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఉన్న 65వ నంబరు జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయడం, హైదరాబాద్‌-కల్వకుర్తి మధ్యలో 765 హైవేను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం, పెండింగ్‌ సీఆర్‌ఐఎఫ్‌ నిధులను మంజూరు చేయడం, హైదరాబాద్‌ దక్షిణ ప్రాంత ఎక్స్‌ప్రెస్‌ వేను మంజూరు చేయడంపై గడ్కరీతో చర్చించారు. ఈ ఐదు అంశాలకు సంబంధించి వినతిపత్రాలను సమర్పించారు. 



తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం రాష్ట్రంలోని మొత్తం 3306 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపిందని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇందులో 2188 కి.మీ. మాత్రమే హైవేలుగా అభివృద్ధి చేస్తున్నారని, ఇంకా 1138 కి.మీ. ప్రస్తావన లేదని తెలిపారు. వాటిని కూడా హైవేలుగా అభివృద్ధి చేయాలని కోరారు. వీటితో పాటు రాష్ట్రంలోని 442 కి.మీ. పొడవైన మరో నాలుగు రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా నోటిఫై చేసి, అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగు రహదారులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపామని, త్వరగా వీటిని నేషనల్‌ హైవే (ఎన్‌హెచ్‌)లుగా ప్రకటించాలని కోరారు.



65వ నంబరు జాతీయ రహదారిని.. 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన హైదరాబాద్‌- విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. బీవోటీ ప్రాతిపదికన ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనులు 2012లో పూర్తయ్యాయన్నారు. కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. దీన్ని ఆరు లేన్లుగా విస్తరించే పనులు 2024 ఏప్రిల్‌ నాటికి పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఈ రహదారిపై రోజుకు 40 వేలకు పైగా కార్లు ప్రయాణిస్తున్నాయని, ఇంతటి రద్దీ ఉన్న రోడ్డును ఆరు లేన్లుగా అభివృద్ధి చేయడానికి జీఎంఆర్‌ మొగ్గు చూపడం లేదని చెప్పారు. ఈ అంశంలో చొరవ తీసుకుని, ఆరు లేన్లుగా చేసేందుకు సహకరించాలని మంత్రిని కోరారు.


హైదరాబాద్‌-కల్వకుర్తి మధ్య 4 లేన్లు..

హైదరాబాద్‌-కల్వకుర్తి మధ్య 765వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌.. గడ్కరీని కోరారు. కొల్లాపూర్‌, సోమశిల, కరివెన మీదుగా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కే నంబరు జాతీయ రహదారిని నోటిఫై చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.  కొత్తగా ప్రకటించిన 167కే జాతీయ రహదారి.. కల్వకుర్తి గుండా వెళ్లే 765 నంబరు జాతీయ రహదారిపై 67వ కిలోమీటర్‌ వద్ద ముగుస్తుందని వివరించారు. ఈ 765 నంబరు హైవే హైదరాబాద్‌ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలాన్ని అనుసంధానం చేస్తుందని తెలిపారు.


ఈ హైవే కల్వకుర్తి మీదుగా వెళుతున్నందున.. శ్రీశైలానికి వెళ్లే భక్తుల కారణంగా రోజుకు 14 వేల కార్లు ప్రయాణిస్తుంటాయని వివరించారు. 167కే హైవే కూడా పూర్తయితే కల్వకుర్తి నుంచి కరివెన సెక్షన్‌ మధ్యలో వాహన ట్రాఫిక్‌ మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ట్రాఫిక్‌ను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌(ఓఆర్‌ఆర్‌), కల్వకుర్తి మధ్య ప్రస్తుతమున్న రెండు లేన్ల 765వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా చేయాలని కోరారు.


కాగా, రాష్ట్రాల్లోని రహదారుల అభివృద్ధికి కేంద్రం తన ‘కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సీఆర్‌ఐఎఫ్‌)’ కింద చేస్తున్న కేటాయింపులను పెంచాలని కేసీఆర్‌ కోరారు. సీఆర్‌ఐఎఫ్‌ కింద 2021కిగాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.744 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఖరారైనట్లు ఇప్పటికే రాష్ట్ర ఎంపీలకు సమాచారం అందిందన్నారు. కానీ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఏడాదికి రూ.250 కోట్లే కేటాయిస్తోందని వివరించారు.ఇలాగైతే పనులు సకాలంలో పూర్తికావన్నారు. 


ఎన్‌హెచ్‌లుగా నోటిఫై చేయాలని కోరిన రోడ్లు ఇవే

చౌటుప్పల్‌- ఆమన్‌గల్‌- షాద్‌నగర్‌- కంది(ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగం) 182 కి.మీ.

కరీంనగర్‌- సిరిసిల్ల- కామారెడ్డి- ఎల్లారెడ్డి- పిట్లం 165 కి.మీ.

కొత్తకోట- గూడూరు- మంత్రాలయం 70 కి.మీ.

జహీరాబాద్‌- బీదర్‌- డెగ్లూర్‌ 25 కి.మీ.




ఎక్స్‌ప్రెస్‌ వేను మంజూరు చేయండి


హైదరాబాద్‌ నగరం చుట్టూ అభివృద్ధి చేయతలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డులో మిగతా దక్షిణ ప్రాంత ఎక్స్‌ప్రెస్‌ వేను కూడా వెంటనే మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ గడ్కరీని కోరారు. హైదరాబాద్‌ చుట్టూ 340 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ వేను అభివృద్ధి చేసే అంశంపై 2018 ఆగస్టు 27న ఢిల్లీలో గడ్కరీతో చర్చించిన అంశాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఇందులో ఉత్తర భాగంలోని 158 కిలోమీటర్ల పొడవైన సంగారెడ్డి- గజ్వేల్‌- చౌటుప్పల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ‘భారత్‌మాల పరియోజన’ కింద మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్‌ నుంచి యాదాద్రి వరకు రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను కోరగా అంగీకరించిందని గుర్తుచేశారు.


ఇంతవరకు బాగానే ఉన్నా.. దక్షిణ ప్రాంతంలో చేపట్టదల్చిన 182 కి.మీ. పొడవైన చౌటుప్పల్‌- షాద్‌నగర్‌- సంగారెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వే విషయంలో ఎలాంటి పురోగతి లేదని వివరించారు. దీనికి సంబంధించిన అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలు, ట్రాఫిక్‌ డేటాను ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు. ఈ క్రమంలో దక్షిణ ప్రాంత ఎక్స్‌ప్రెస్‌ వేను త్వరగా మంజూరు చేయాలని కోరారు. 


Updated Date - 2021-09-07T07:09:48+05:30 IST