బెంచ్‌ మార్చండి.. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై టీ-హైకోర్టుకు రఘురామ విన్నపం

ABN , First Publish Date - 2021-09-15T08:04:09+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును కోరారు.

బెంచ్‌ మార్చండి.. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై టీ-హైకోర్టుకు రఘురామ విన్నపం

విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది

దీనిపై మాకు అనుమానాలున్నాయ్‌.. వేరే కోర్టుకు బదిలీ చేయండి

ఎంపీ తరఫు లాయర్‌ అభ్యర్థన.. సహేతుకం కాదు: సీబీఐ అభ్యంతరం

గతంలో విజయసాయి షరతులు ఉల్లంఘించారా?: న్యాయమూర్తి

లేదని చెప్పిన దర్యాప్తు సంస్థ.. పిటిషన్‌పై తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలోనిపలు కేసుల్లో ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్స్‌పల్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. తాను దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను ఆ బెంచ్‌ నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం భోజన విరామం తర్వాత అత్యవసరంగా విచారించారు. జగన్‌ బెయిల్‌ రద్దుచేయాలని గత నెల 26న రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్‌లో వచ్చిన కథనాన్ని ఆయన తరఫు న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి రెండు వారాలపాటు దుబాయ్‌, మాల్దీవులు, ఇండోనేషియాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కోర్టు ప్రిన్స్‌పల్‌ బెంచ్‌పై అనుమానాలు ఉన్నాయని.. అందుచేత తమ పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.


జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్‌ దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఏప్రిల్‌ నెలలో వేశామని న్యాయవాది జవాబిచ్చారు. ఆగస్టు 25న తమ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ క్రమంలో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. ఈ రెండు పిటిషన్లపై బుధవారం (15న) తీర్పు ఇస్తానని ప్రత్యేక కోర్టు పేర్కొందని తెలిపారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత అంటూ సాక్షి వెబ్‌ మీడియాలో ఆ కథనాన్ని పోస్టు చేసినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని.. ఇది విచారణలో ఉంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉంటే ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారా అని ఆయన అడుగగా.. లేదని రఘురామ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన ఆదేశాలను ఇక్కడెలా ప్రస్తావిస్తారని జస్టిస్‌ లక్ష్మణ్‌ నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని, అప్పుడు ఆయన ప్రత్యేక కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారా అని సీబీఐ స్పెషల్‌ పీపీ సురేందర్‌ను ప్రశ్నించగా.. లేదని ఆయన జవాబిచ్చారు. రఘురామరాజు పిటిషన్‌పై సురేందర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సహేతుక కారణాలు చూపకుండా.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించడానికి ఒక రోజు ముందు.. పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదన్నారు. విజయసాయిరెడ్డి విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతించినంత మాత్రాన అక్కడి నుంచి పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సహేతుకం కాదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-09-15T08:04:09+05:30 IST