ప్రశ్నపత్రం ఏమార్చి..

ABN , First Publish Date - 2022-06-16T06:57:09+05:30 IST

పదో తరగతి ఉత్తీర్ణత శాతం మునుపెన్నడూ లేనంతగా పడిపోయింది. రాష్ట్రంలో అట్టడుగున నిలిచి.. జిల్లా అపఖ్యాతిని మూటగట్టుకుంది.

ప్రశ్నపత్రం ఏమార్చి..

పదో తరగతి పరీక్షలో నిర్లక్ష్యం

ఫిజిక్స్‌కు బదులు బయాలజీ..!

పరీక్ష కేంద్రంలో గుర్తించి.. గుట్ట్టుచప్పుడు కాకుండా మార్చేశారు

తొక్కిపెట్టిన విద్యాశాఖ అధికారులు


అనంతపురం విద్య: 

పదో తరగతి ఉత్తీర్ణత శాతం మునుపెన్నడూ లేనంతగా పడిపోయింది. రాష్ట్రంలో అట్టడుగున నిలిచి.. జిల్లా అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీనికి కొవిడ్‌ విపత్తు కారణమని ఎంత సర్దుకుపోయినా, నిర్వహణలో నిర్లక్ష్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏకంగా పరీక్ష పేపర్లను మార్చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ను బయటకు తెచ్చారు. పరీక్ష కేంద్రంలో గమనించి.. మళ్లీ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సా్ట్రంగ్‌ రూమ్‌కు పరుగు తీశారు. అసలైన పేపర్లు తీసుకొచ్చి పరీక్ష నిర్వహించేలోగా అరగంట ఆలస్యమైంది. అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ తతంగం చోటుచేసుకుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు తమ పరువు పోతుందని తొక్కి పెట్టారు. బాధ్యులపై చర్యలు కూడా తీసుకోలేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న సాకు చూపి, తప్పించుకుని, తప్పు చేసిన వారినీ తప్పిస్తున్నారు. మే 4న ఈ సంఘటనచోటు చేసుకున్నా.. ఇప్పటి వరకూ విచారణ ఊసులేదు. 


గుడ్డిగా తీసుకెళ్లారు..

పదో తరగతి-2022 పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకూ నిర్వహించారు. జిల్లా కేంద్రమైన అనంతపురంలో పలు పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేసే ప్రశ్న పత్రాలను 3వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సా్ట్రంగ్‌ రూంలో భద్రపరిచారు. ఇక్కడి నుంచి ఏ రోజుకు ఆ రోజు ప్రశ్నపత్రాలను పోలీసు భద్రత నడుమ పరీక్షా కేంద్రాలకు తరలించారు. షెడ్యూల్‌ మేరకు మే 4వ తేదీ ఫిజిక్స్‌, 5వ తేదీ బయాలజీ పరీక్ష నిర్వహించాలి. అయితే మే 4వ తేదీ ఫిజిక్స్‌ కాకుండా, బయాలజీ ప్రశ్నపత్రాలను బయటకు తీసుకొచ్చారు. పరీక్షా కేంద్రాలకు చేరుకుని తెరిచాక దీన్ని గుర్తించారు. ఒక్కసారిగా అందరిలో టెన్షన్‌ మొదలైంది. కస్టోడియన్‌ ఆఫీసర్లు, పలువురు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు ఉరుకులు, పరుగులు అందుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, బయాలజీ పేపర్‌ అక్కడ పెట్టి, మళ్లీ ఫిజిక్స్‌ పేపర్‌ తీసుకొని పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. ఈ తతంగం పూర్తయ్యే సరికి పుణ్యకాలం ముగిసింది. పరీక్ష నిర్వహణ బాగా ఆలస్యమైనట్లు సమాచారం.


ఇంత నిర్లక్ష్యమా...? 

షెడ్యూల్‌ మేరకు టెన్త్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరగాలి. ఉదయం 8.30 గంటలకు విద్యాశాఖాధికారులు సెట్‌ మెసేజ్‌ ద్వారా పరీక్షల డ్యూటీలో ఉన్న సిబ్బందిని అలర్ట్‌ చేస్తారు. ఇది ముగిసిన తర్వాత 8.45 గంటలకు పోలీస్‌ స్టేషన్లలోని ప్రశ్నపత్రాలను తీసుకుని బయటకు వస్తారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 3వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి మే 4వ తేదీ పరీక్షల అధికారులు ఎప్పటిలాగే ప్రశ్నపత్రాలను తీసుకువెళ్లారు. 9.30 గంటలకు ప్రశ్నపత్రాలు పిల్లలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకుని.. పరీక్షలు ప్రారంభించేందుకు 20 నుంచి 30 నిమిషాలు ఆలస్యమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 3వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 2 నుంచి 3 మున్సిపల్‌ స్కూళ్లలో పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. పరీక్షను కూడా ఆలస్యంగానే ముగించినట్లు తెలిసింది. 


తొక్కిపెట్టి.. 

ప్రశ్నపత్రాలను పోలీస్‌ స్టేషన్లలో భద్రపరుస్తారు. పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చే ముందు కస్టోడియన్‌ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు స్టేషన్లకు వెళ్తారు. విత్‌డ్రా బుక్‌, పహారా బుక్‌లో సంతకాలు చేసి పేపర్లు తీసుకురావాలి. ప్రశ్న పత్రాలను భద్రపరిచే బాక్స్‌ తాళం చెవులు స్టేషన్‌ పోలీసులు, కస్టోడియన్‌ ఆఫీసర్‌ వద్ద ఉంటాయి. మే 4న పేపర్‌ మారిన విషయం విద్యాశాఖతోపాటు, పోలీసులకు కూడా తెలుసని సమాచారం. ప్రశ్నపత్రాల కోసం పరీక్షల స్టాఫ్‌ రోజుకు ఒకసారి మాత్రమే స్టేషన్‌కు వెళతారు. ఆ రోజు 2 సార్లు వెళ్లారు. ఈ విషయం అక్కడున్న సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్‌ అయ్యుంటుంది. పరిశీలిస్తే.. బాగోతం ఇట్టే బయటపడుతుంది. అయినా తొక్కిపెట్టడం తప్పించుకునేందుకే అన్న విమర్శలు వస్తున్నాయి.


పిల్లలు చస్తున్నా.. పట్టించుకోరా?

పదో తరగతి ఫలితాల ప్రకటన తరువాత జిల్లాలో పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఫెయిల్‌ అయ్యామన్న ఆత్మన్యూనతకు లోనయ్యారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధిత కుటుంబాలను పరామర్శించాలన్న ఆలోచన కూడా జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు చేయలేదు. దారుణమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం వహించిన పరీక్షల స్టాఫ్‌, జిల్లా విద్యాశాఖ, పరీక్షల విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తప్పులు పునరావృతం కాక మానవు. 

Updated Date - 2022-06-16T06:57:09+05:30 IST