ఆర్టీసీకి చిల్లర కష్టాలు

ABN , First Publish Date - 2022-08-20T05:46:50+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య అధికమైంది.

ఆర్టీసీకి చిల్లర కష్టాలు

కనీస ఛార్జీ రూ.10తో ఐదు నాణేల కొరత

చిల్లర రాక ప్రయాణికులకు సర్దుబాటు చేయలేక కండక్టర్ల అవస్థలు 


ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 19 : ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య అధికమైంది. కనీస ఛార్జీని రూ.5 నుంచి రూ.10 రూపాయలకు పెంచడంతో కండక్టర్లు రూ.5 నాణేల రాక ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీస ధర ఐదు రూపాయలు ఉండేది. దీంతో ఎక్కువగా 5 రూపాయల నాణేలు వచ్చేవి. కండక్టర్ల వద్ద చిల్లర పుష్కలంగా ఉండేది. ఈ చిల్లరను నగదు జమ చేసే డీసీ రూములకు అప్పగించేవారు. డీసీ రూముల నుంచి పెద్ద సంఖ్యలో ఐదు రూపాయల నాణేలు బయటకు ఇచ్చి వాటి స్థానంలో నోట్లు తీసుకునేవారు. ఇప్పుడు బయటకు ఇవ్వడం దేవుడెరుగు కండక్టర్లకు ఇవ్వడానికి చిల్లర ఉండడం లేదు. కనీస ఛార్జీ రూ.10 పెంచడంతో ప్రతి ఒక్కరు నోట్లనే ఇస్తున్నారు. రూ.10, 20, 30 ఛార్జీలకు సమస్యలేదు. 15, 25, 35, 45 రూపాయలకే సమస్య వస్తోంది. చిల్లర రాకపోవడంతో ప్రయాణీకులకు రూ.5 ఇవ్వడానికి కండక్టర్లు వెతుక్కోవాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో చిల్లరలేక ఇద్దరికి కలిపి 10 ఇచ్చి పంచుకో మంటున్నారు. ప్రయాణీకులు దిగాల్సిన ప్రాంతాలు వేర్వేరు కావడంతో కొందరు కండక్టర్లతో వాదనలకు దిగుతున్నారు. ఒక స్టేజిలో దిగాల్సి వచ్చినా రూ.5 కోసం షాపుల వెంట తిరగాలని ఏదైనా కొంటేకాని దుకాణాల వారు చిల్లర ఇవ్వడం లేదని ప్రయాణీకులు చెబుతున్నారు. తమ దగ్గర రూ.5  ఇవ్వకపోతే ఛార్జీలు పెంచేది కాక ఇదొక అదనపు దోపిడీ అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు నుంచి తణుకు వెళ్లే బస్సులో ఒకామె బస్సు ఎక్కింది. తాను దిగాల్సిన స్టేజీకి టికెట్‌ ధర 25 రూపాయలు. కండక్టర్‌కు వంద రూపాయలు ఇచ్చింది. దీంతో కండక్టర్‌ కస్సుబుస్సులాడుతూ బస్సు ఎక్కేటప్పుడు చిల్లర తెచ్చుకోవాలని తెలియదా ? ఇస్తే చిల్లర ఇవ్వండి లేకపోతే బస్సు దిగి వెళ్లిపోండి అని చెప్పడంతో ఆమె అవాక్కయ్యింది. ఇంతలో డ్రైవర్‌ బస్సును ఆపడంతో తోటి ప్రయాణికులు కలుగజేసుకుని ఆమెకు చిల్లర సర్దుబాటు చేశారు. దీనిపై కండక్టర్‌ మాట్లాడుతూ ప్రయాణికులు అందరూ పది రూపాయల టిక్కెట్‌కు వంద, అంతకు మించి టిక్కెట్‌ ఉంటే ఐదు వందలు ఇస్తుంటే మేం మాత్రం చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ వాపోయారు. రిక్షాపై కూరగాయలు అమ్మేవారు సైతం క్యూ ఆర్‌ కోడ్‌ పెట్టి మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేసి డబ్బులు పంచుతున్నారని చిల్లర సమస్యను అధిగమిస్తున్నారని  అంటున్నారు. ఆర్టీసీ అధికారులు కండక్టర్లకు యూపీఐ ఆధారిత క్యూఆర్‌ కోడ్‌లను ఇచ్చి ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా పేమెంట్‌ చేస్తే చిల్లర సమస్య తగ్గుతుందని అంటున్నారు. 


Updated Date - 2022-08-20T05:46:50+05:30 IST