మా రాత మారుస్తారా?

ABN , First Publish Date - 2021-07-30T04:55:42+05:30 IST

కనీస అవసరమైన తాగునీరు నుంచి కీలకమైన సాగునీటి వరకూ జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ప్రయాణమంటే భయపడుతున్నారు. నేటికీ ధాన్యం డబ్బులు మంజూరు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పేదల కాలనీల్లో ఏ సౌకర్యాలూ లేవు.

మా రాత మారుస్తారా?
పార్వతీపురం వెంకటపేట గోళీల వద్ద ఉన్న చెరువు అన్ని వైపులా కబ్జా

దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలు

పేదల కాలనీల్లో కానరాని మౌలిక సదుపాయాలు

అధ్వానంగా రహదారులు

నిలిచిన సాగునీటి ప్రాజెక్టులు

కొత్త కలెక్టర్‌కు సమస్యల స్వాగతం


 కనీస అవసరమైన తాగునీరు నుంచి కీలకమైన సాగునీటి వరకూ జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ప్రయాణమంటే భయపడుతున్నారు. నేటికీ ధాన్యం డబ్బులు మంజూరు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పేదల కాలనీల్లో ఏ సౌకర్యాలూ లేవు. ఇళ్ల నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో భూ ఆక్రమణలకు అంతే లేకుండా ఉంది. చెరువులను కూడా వదలడం లేదు. వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన మార్గం చూపడం లేదు. భూములు, ఇళ్లు, సొంతూళ్లను అప్పగించిన వారిని కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్న సూర్యకుమారి జిల్లా రాత మారుస్తారని ఆశగా చూస్తున్నారు.


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాను దీర్ఘకాలికంగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అధికారులు మారినా.. ప్రభుత్వాలు మారినా పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. మౌలిక సౌకర్యాలకు సంబంధించిన పనులు కూడా కావడం లేదు. ప్రధానంగా రహదారులు భయానకంగా తయారయ్యాయి. జిల్లా మీదుగా జాతీయ, అంతర్‌ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అవన్నీ అడుగుకో గోతితో దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులను ప్రమాదాల బారిన పడేస్తున్నాయి. జిల్లా కేంద్రం మీదుగా సాలూరు-రాయపూర్‌ వెళ్లే రోడ్డు రూపునే కోల్పోయింది. రాయగడ రోడ్డు గోతుల రహదారిగా పేరొందింది. 

కూలే స్థితిలో వంతెనలు

చంపావతి, వేగావతి, సువర్ణముఖి, జంఝావతి నదులపై బ్రిటిష్‌ కాలం(1933)లో నిర్మించిన వంతెలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది. సువర్ణముఖి నదిపై సీతానగరం మండలం గెడ్డలొప్పి వద్ద, నాగవాళి నదిపై పూర్ణపాడు వద్ద చేపట్టిన వంతెనలు అసంపూర్తిగా ఉన్నాయి. సంవత్సరాలుగా పనులు కదలడం లేదు. 

పెండింగ్‌లో సాగునీటి ప్రాజెక్టులు

జిల్లా రైతాంగానికి ఆధారమైన సాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వనరులు పుష్కలంగా ఉన్నా రైతులకు అనుకూలంగా వాటిని మలచడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. చంపావతి నదిపై నిర్మిస్తున్న తారకరామతీర్ధ సాగర్‌ పనులకు అనేక అడ్డంకులున్నాయి. ఆర్‌అండ్‌ఆర్‌, భూ సేకరణ సమస్యలు వేధిస్తున్నాయి. తోటపల్లి గజపతినగరం బ్రాంచి కాల్వ పరిధిలో భూ సేకరణ సమస్యలున్నాయి. చిన్నసాగునీటి వనరుల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వీటన్నింటినీ పూర్తి చేయించాల్సిన బాధ్యత నూతన కలెక్టర్‌పై ఉంది.

కొలిక్కిరాని భూ సేకరణ

జిల్లాకే తలమానికం కానున్న భోగాపురం విమానాశ్రయ భూ సేకరణ చివరి దశలో ఉంది. శంకుస్థాపనలు జరిగినా ఇంతవరకు పనులు చేపట్టే పరిస్థితి లేదు. బీచ్‌ కారిడార్‌ కోసం ప్రతిపాదనలు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడా భూ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఒక వైపు విమానాశ్రయం, మరో వైపు బీచ్‌ కారిడార్‌, ఇప్పటికే ఉన్న జాతీయ రహదారి కారణంగా భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. దీంతో చెరువులు, నది, వాగు గర్భాలు దురాక్రమణకు గురవుతున్నాయి. వీటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. 

ధాన్యం డబ్బులెప్పుడు?

రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇది పేరుకే తప్ప కొనుగోలు చేసేది మిల్లర్లే. మిల్లర్ల మాయాజాలం ముందు యంత్రాంగం చతికిలపడుతోంది. దీంతో ఇప్పటికీ రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. స్పందన కార్యక్రమానికి రైతులు వచ్చివినతులు ఇస్తున్నారు. రైతులకు డబ్బులు చెల్లించని నిల్వలు మిల్లర్ల వద్ద ఎందుకు ఉన్నదీ కలెక్టర్‌ తేల్చాల్సి ఉంది. 

పేదల కాలనీల్లో వసతులేవీ?

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న పేదల కాలనీల్లో కనీస వసతులు లేవు. ఇళ్ల నిర్మాణానికి కీలకమైన మెటీరియల్‌ రవాణాకు వీలుగా రోడ్లు అవసరం. అనేక చోట్ల లింక్‌ రోడ్లు లేవు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే నీరు తప్పనిసరి. బోరు బావుల తవ్వకాలు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు లేవు. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని పేదలకు కేటాయించిన గుంకలాం లే అవుట్‌ వర్షం పడితే చెరువును తలపిస్తోంది. జిల్లాలో అనేక లే అవుట్లలో ఇదే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎత్తు చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. 

  ప్రకృతి వ్యవసాయం ఏదీ?

ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులు ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని రైతులు చెబుతున్నారు. ఈ విధానాన్ని రైతులందరికీ అలవర్చేందుకు చర్యలు తీసుకుంటామని గత కలెక్టర్‌ ప్రకటించారు. మక్కువ మండలంలో జరుగుతున్న వ్యవసాయ విధానాన్ని చిత్రీకరించి అవార్డు సాధించారు. తరువాత వేలాది ఎకరాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాని ఇది ప్రకటనలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంపై నూతన కలెక్టర్‌ దృష్టి పెట్టాల్సి ఉంది. 

ఆగని కబ్జాలు

జిల్లాలో ప్రభుత్వ స్థలాల కబ్జా ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. చెరువులు, వాగులు, నదుల పక్కనున్న స్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించి రాత్రికిరాత్రి చదును చేసేస్తున్నారు. సర్వే నంబర్లను సృష్టించి కబ్జాకు తెగబడుతున్నారు. నేతల అండను చూసి రెచ్చిపోతున్నారు. అధికారులకు మామూలు ఎర వేసి దారికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆక్రమణలు బాగా పెరిగాయి. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా ఇది సాగుతోంది. ఈ కబ్జాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.




Updated Date - 2021-07-30T04:55:42+05:30 IST