ఈ మారు ఆ మార్పు కోసం!

ABN , First Publish Date - 2021-12-16T04:58:05+05:30 IST

సాధారణంగా తల్లితండ్రులు పిల్లలకు ఆస్తిని వారసత్వంగా ఇస్తుంటారు. కానీ మా అమ్మానాన్న సరస్వతీగోరా దంపతులు మాత్రం అంతకన్నా

ఈ మారు ఆ మార్పు కోసం!

‘‘58 ఏళ్ల పాటు కొన్ని లక్షల మందికి వైద్యం చేసిన అనుభవం ఆమెది. ప్రజలకు వచ్చిన కష్టాలను తనవిగా భావించి వాటిపై పోరాడిన ధైర్యం ఆమెది. 80వ పడిలో కూడా సమాజంలో సమస్యలపై తన వంతు పోరు సలుపుతున్న డాక్టర్‌ గోపరాజు మారుతో ‘నవ్య’ ముచ్చటించింది. 


సాధారణంగా తల్లితండ్రులు పిల్లలకు ఆస్తిని వారసత్వంగా ఇస్తుంటారు. కానీ మా అమ్మానాన్న సరస్వతీగోరా దంపతులు మాత్రం అంతకన్నా విలువైన తమ ఆశయాలను మాకు కానుకగా ఇచ్చారు. వాటిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మావంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. తొమ్మిది మంది తోబుట్టువుల్లో నేను ఎనిమిదవ సంతానం. మహాత్ముడి ‘క్విట్‌ఇండియా’ ఉద్యమం పిలుపు మేరకు ఒకరోజు మా అమ్మ సరస్వతి తోటి మహిళలను కొందరిని కూడగట్టి విజయవాడలో పెద్ద నిరసన ర్యాలీ తీసింది. దాంతో బ్రిటీషు పోలీసులు మూడు నెలల గర్భవతి అయిన మా అమ్మను అరెస్టు చేసి రాయివెలూర్‌ జైల్లో నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత అమ్మ జైలు నుంచి విడుదలైన మూడో రోజున...అంటే 1944, అక్టోబరు 26న నేను పుట్టాను. అదే సమయంలో  భారతదేశానికి స్వాతంత్య్రం రాబోతుందనే ఆశ అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని నింపింది. అది మంచి మార్పునకి సంకేతంగా భావించిన మా నాన్న నాకు ‘మారు’ అని పేరు పెట్టారు. ఆయన కోరిక ప్రకారం ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన నేను, మా సమరం అన్నయ్యతో కలిసి విజయవాడలోని ‘వాసవ్య నర్సింగ్‌ హోమ్‌’లో 53ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నాను. తద్వారా నావంతుగా సమాజానికి ఉపయోగపడేందుకు కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. 


వాళ్ల కష్టాలు కదిలించాయి...

ఆరోగ్య అవగాహన కల్పించడంలో భాగంగా యాభై ఏళ్ల కిందట నల్గొండ జిల్లాలోని చాలా గ్రామాలు, తండాలకు తరచుగా వెళుతుండేదాన్ని. అప్పట్లో కాన్పులన్నీ ఇళ్లల్లోనే అయ్యేవి. ఆయా తండాలలోని ఇరుగు పొరుగున ఉండే మహిళలే మంత్రసానులుగా వ్యవహరించి, పురుడు పోసేవాళ్లు. ఆ క్రమంలో పుట్టిన శిశువును నేలమీద పడుకోబెట్టి, బొడ్డుతాడును రెండు రాళ్ల మధ్య రాపిడి ద్వారా కత్తిరించేవారు. దాంతో ఇన్ఫెక్షన్‌కు గురైన పసికందులు కొందరు పుట్టిన పదిరోజులలోపే కన్నుమూయడం కళ్లారా చూసి చలించిపోయా.! దాంతో చుట్టుపక్క గ్రామాల్లోని వంద మంది మహిళలను పోగుచేసి, వారందరికీ శాస్త్రీయ పద్ధతిలో కాన్పు చేయడం మీద ప్రత్యేక శిక్షణ ఇచ్చాను.


ఆ సమయంలో వారు పాటించాల్సిన స్వీయ శుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాను. అలా ఆ చుట్టుపక్క గ్రామాలలో చాలా వరకు శిశుమరణాలను తగ్గించగలిగాం. పేదరికంతో చదువుకు దూరమైన అమ్మాయిలు, భర్త చేతిలో హింసను భరించలేక దుర్భరజీవితాన్ని వెళ్లదీస్తున్న ఆడవాళ్లు, ఒంటరి మహిళలు కొందరు నాకు తారసపడ్డారు. వాళ్ల కష్టాలు, కన్నీళ్లు నన్ను కదిలించాయి. వారంతటవారే స్వతంత్య్రంగా బతకాలంటే, వారికేదైనా విద్యలో ప్రావీణ్యం తప్పనిసరి.! కనుక వృత్తివిద్యా కోర్సులే ప్రత్యామ్నాయం అనుకున్నాను. సమస్యల్లో ఉన్న యువతులు, మహిళలకు 1977 నుంచి నర్సింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. అదీ ఏడాది పాటు ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తూ..! అందుకు మా వదిన హేమలతా లవణం, మా చెల్లి నౌవ్‌ సహకారం తోడయ్యింది.  


విదేశాల్లో నా శిష్యురాళ్లు...

విజయవాడలోని వాసవ్య క్లినిక్‌ కేంద్రంగా ఇప్పటి వరకు సుమారు ఎనభైవేల మంది నర్సులను తయారుచేయగలిగాను. నా వద్ద శిక్షణ పొందిన చాలా మంది ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌, మలేషియాతో పాటు గల్ఫ్‌ దేశాల్లోనూ నర్సులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లోనూ నా శిష్యురాళ్లు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ కాలంలో వాళ్లు ఆయుధాల్లేని సైనికుల్లా రాత్రింబవళ్లు రోగులకు సేవచేసి, కొన్ని వేలమంది పాలిట ప్రాణదాతలయ్యారు. మా హేమలతా లవణం వదిన నెలకొల్పిన ‘సంస్కార్‌’ సంస్థ సహకారంతో నిజామాబాద్‌ జిల్లాలోని జోగినీల పిల్లలు కొందరికి, సెక్స్‌వర్క్‌ వృత్తిలో మగ్గుతున్న మరికొందరికీ నర్సింగ్‌ శిక్షణ ఇచ్చాను. వారంతా అప్పుడప్పుడు, నాకు ఫోన్‌ చేసి పలకరిస్తుంటారు. వారి యోగక్షేమాలన్నీ తెలియజేస్తుంటారు. మరొక రెండు వేలమందికి ఫిజియో థెరపీలోనూ శిక్షణ ఇచ్చాం. 


పోలియో మీద పోరు...

నల్గొండ జిల్లాలోని ‘చివ్వెముల’, పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘ఆకువీడు’ మండలాలను నలభై ఏళ్ల కిందటే పోలియో రహిత ప్రాంతాలుగా చేయగలిగామని గర్వంగా చెప్పగలను. అదీ కేవలం మా సమిష్టి కృషితో మాత్రమే.! అప్పట్లో పోలియోపై అంతలా పోరు సలిపామన్నమాట.! నా చెల్లెలు నౌవ్‌ నెలకొల్పిన ‘ఆర్థిక సమతా మండలి’ లోనే నా భర్త హరి సుబ్రహ్మణ్యం వలంటీర్‌గా పనిచేస్తుంటారు. ఆయన సహకారంతో చాలా గ్రామాల్లో ఆరోగ్యంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. కొన్ని గ్రామాలు, తండాలలో సిగ్గు, బిడియం కారణంగా భార్యాభర్తలు ఒకచోట కూర్చోరు. అలాంటిది, ఆలుమగలను ఒకచోటకు చేర్చి నెలసరి సమయంలో భార్యను ఎలా చూసుకోవాలి, నెలతప్పినప్పుడు ఎలాంటి ఆహారం ఆమెకు ఇవ్వాలి వంటి విషయాలమీద భర్తలకు అవగాహన కల్పించాం. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాం. ప్రముఖ వైద్యుడు డా. సీజే బ్రహ్మానందం సహకారంతో సుమారు మూడు వేల మంది పోలియో బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్స చేశాం. తద్వారా మా వద్దకు పాకుతూ వచ్చి, సంతోషంగా తిరిగి నడుచుకుంటూ వెళ్లినవారు చాలామందే ఉన్నారు. అవిగాక, మరో నాలుగు వేలమందికి కంటి శుక్లాలను ఉచితంగా తీయించాం. 


ఎమ్మెల్యేలకు రాజ్యాంగం తెలుసా..!

మాది కులాంతర వివాహం. ఆ మాటకొస్తే, మా ఇంట్లోనివారందరివీ కులాంతర, మతాంతర వివాహాలే.! మా అమ్మ, నాన్న లు సరస్వతి, గోపరాజు రామచంద్రరావు(గోరా) దంపతులు తుది శ్వాస వరకు కులనిర్మూలన ఉద్యమానికి అంకితమయ్యారు. ఒకప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కులాంతర వివాహాలు పెరిగాయి. ఆయా కుటుంబాలు కూడా వాటిని ఆమోదిస్తున్నాయి.’’

Updated Date - 2021-12-16T04:58:05+05:30 IST