కురుపాం.. అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2020-06-05T10:10:20+05:30 IST

ఏడాది కాలంలో కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని నాగూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే (ప్రస్తుతం కురుపాం), వైసీపీ సీనియర్‌ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు వ్యాఖ్యానించారు.

కురుపాం.. అభివృద్ధి శూన్యం

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు 


పార్వతీపురం టౌన్‌,  జూన్‌ 4: ఏడాది కాలంలో కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని నాగూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే (ప్రస్తుతం కురుపాం), వైసీపీ సీనియర్‌ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి ఆయన స్వయంగా మామగారు (భర్త తండ్రి) కావడం గమనార్హం. గురువారం పార్వతీపురంలోని తన నివాసంలో చంద్రశేఖరరావు మాట్లాడుతూ. .‘ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి నేను మామనైనప్పటికీ అభివృద్ధిని విస్మరించడంతో ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చిందని’ అన్నారు.  కురుపాం నియోజ కవర్గంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదని..  పింఛన్ల మంజూరు, పంపిణీకి సంబంధించి అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణం విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. 


రేగిడి గెడ్డ నుంచి వట్టిగెడ్డ వరకు అనుసంధాన కార్యక్రమం కాగితాలకే పరిమితమైందని తెలిపారు. నాగావళి నది ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం కాలగర్భంలో కలిసి పోయిందన్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగి నుంచి పిప్పలభద్ర, పరసపాడుతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఏడాదిగా ఒక్క అడుగు కూడా  పడకపోవడం విచారకరమన్నారు. 


జియ్యమ్మవలస మండలం మరువాడలో పిడుగు పడి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు చొప్పున చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాల  తన  రాజకీయ జీవితంలో  వ్యవసాయ రంగంంలో ఇటువంటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సామాన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేదని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, రజకులు తదితరులకు సాయం అందించి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న అనేక కుల వృత్తుల వారిని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. 


Updated Date - 2020-06-05T10:10:20+05:30 IST