7న తిరుపతికి చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-02T06:36:42+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 7వ తేదీన తిరుపతి రానున్నారు.

7న తిరుపతికి చంద్రబాబు
చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై చర్చిస్తున్న అమరనాథ రెడ్డి

రేణిగుంటలో రాత్రి బస... 8న నగరి, జీడీనెల్లూరు పర్యటన


తిరుపతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 7వ తేదీన  తిరుపతి రానున్నారు.6వ తేదీన మదనపల్లెలో పార్టీ మినీ మహానాడులో పాల్గొని రాత్రికి కలికిరి చేరుకుని అక్కడే బస చేస్తారు. 7వ తేదీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమై సమీక్షిస్తారు. అనంతరం చివరగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తారు. సాయంత్రం కలికిరి నుంచీ బయల్దేరి పీలేరు, చిన్నగొట్టిగల్లు, భాకరాపేటల మీదుగా తిరుపతి చేరుకుంటారు. రాత్రికి రేణిగుంట వై కన్వెన్షన్‌ హాలులో బస చేస్తారు. 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గాజులమండ్యం, పుత్తూరు బైపాస్‌ రోడ్డు మీదుగా నగరి చేరుకుని బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 గంటలకు నగరి టవర్‌ క్లాక్‌ కూడలిలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత సత్రవాడ, పల్లిపట్టు, కొల్లాగుంట క్రాస్‌ మీదుగా సాయంత్రం కార్వేటినగరం చేరుకుని రోడ్‌ షోలో పాల్గొని రాత్రికి తిరుగు ప్రయాణమవుతారు. 


పర్యటన ఏర్పాట్లపై నేతల కసరత్తు

చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై టీడీపీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు.మాజీ మంత్రి అమరనాధరెడ్డి, తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుడు బీద రవిచంద్ర, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, స్టేట్‌ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ, చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల పరిశీలకులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, బొమ్మిసురేంద్రలతో కూడిన బృందం శుక్రవారం తిరుపతి, నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటించి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ పరిశీలించింది. తొలుత తిరుపతి రూరల్‌ మండలంలోని పులివర్తి నాని కార్యాలయంలో తిరుపతి ఇంఛార్జి సుగుణమ్మ, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, ముఖ్యనాయకులు బుల్లెట్‌ రమణ, పుష్పావతమ్మ, విజయలక్ష్మి, పులిగోరు మురళి, మబ్బు దేవనారాయణరెడ్డి తదితరులతో మాజీ మంత్రి అమర్‌ బృందం సమావేశమైంది. తిరుపతిలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులతో విడిగా సమావేశమైంది. పుత్తూరులో నగరి ఇంఛార్జి గాలి భానుప్రకాష్‌, సత్యవేడు ఇంఛార్జి జేడీ రాజశేఖర్‌లతోపాటు ఆయా నియోజకవర్గాల మండల స్థాయి నాయకులతో సమావేశమై నగరిలో బాదుడే బాదుడు, బహిరంగసభలను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చించింది. ఆపై కొల్లాగుంట క్రాస్‌, కార్వేటినగరాల్లో పర్యటించి జీడీనెల్లూరు ఇంఛార్జి చిట్టిబాబు, ఇతర మండలస్థాయి నాయకులతో రోడ్‌షో ఏర్పాట్ల గురించి చర్చించింది. అధినేత పర్యటన సందర్భంగా ప్రతి చోటా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో తరలివచ్చేలా నాయకులు చొరవ తీసుకుని పనిచేయాలని అమర్‌ బృందం కోరింది. శ్రేణులతో పాటు ప్రజలను కూడా సమీకరించాలని సూచించింది.

Updated Date - 2022-07-02T06:36:42+05:30 IST