తిరుపతి : వరద ప్రాంతాల పరిశీలనకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి అర్బన్ ఆటోనగర్‌లో వరదతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. నాలుగు గంటలకు లక్ష్మీపురం సర్కిల్, 4.30 గంటలకు ముత్యాలరెడ్డిపల్లె, 5.45 గంటల వరకు దుర్గానగర్ కాలనీ, కృష్ణా నగర్, గాయత్రి నగర్, పద్మావతీ మహిళా వర్సిటీ తదితర ప్రాంతాల్లో వరద నష్టాలను చూస్తారు. 5.45 గంటలకు మహిళా వర్సిటీ నుంచి బయల్దేరి రేణిగుంటలోని వై కన్వెన్షన్ హాలుకు చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముఖ్యనేతలతో సమావేశమై పార్టీ స్థితిగతులను సమీక్షించనున్నారు. వర్షబాధిత ప్రజలకు సాయం అందించాలన్న తన పిలుపుపై పార్టీ నాయకులు ఎలా స్పందిస్తున్నారనే అంశాన్నీ సమీక్షించి, సూచనలు చేయనున్నారు.
‘నాదెండ్ల’ పర్యటన..
ఇదిలా ఉంటే.. మరోవైపు వరదబాధిత ప్రాంతాలను పరిశీలించి ప్రజల కష్ట, నష్టాలను తెలుసుకునేందుకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు కేఎల్‌ఎం హాస్పిటల్, పరిసర ప్రాంతాలు, 2.30గంటలకు తిరుపతిలోని కేశవాయనగుంటలో బాధితులను పరామర్శించి నిత్యావసరాలు అందించనున్నారు. కట్టకిందపల్లి, కొర్లగుంట, శ్రీకృష్ణానగర్‌లో పర్యటిస్తారు. మెడికల్ క్యాంపు నిర్వహిస్తారు. కబ్జాలకు గురైన చెరువులను సాయంత్రం సందర్శించి.. తుమ్మలగుంట, అవిలాల చెరువులను చూసుకుంటూ తిరుపతికి చేరుకుంటారు.