ఆపరేషన్‌ ‘చంద్ర’గిరి!

ABN , First Publish Date - 2020-07-05T08:45:08+05:30 IST

అధికారికంగా క్రయ విక్రయాలకు వీల్లేని డీకేటీ భూములకు ధర ఎక్కువ పలకదు. కానీ.... ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం చంద్రగిరి మండలంలోని తొండవాడ, పిచ్చినాయుడుపల్లె వంటి ప్రాంతాల్లో

ఆపరేషన్‌ ‘చంద్ర’గిరి!

  • టీడీపీ అధ్యక్షుడి సొంత ప్రాంతంలో వైసీపీ రాజకీయ వ్యూహం
  • పార్టీని పూర్తిగా బలహీనపరిచే లక్ష్యం
  • పేదలకు ఇళ్ల స్థలాల పేరిట పథకం
  • చంద్రగిరి మండలంలో తిరుపతి పేదలకు 
  • ఓట్లలో మారనున్న రాజకీయ సమీకరణాలు
  • వందల ఎకరాల సేకరణ.. చకచకా లేఔట్లు
  • డీకేటీ భూములకు అదిరిపోయే పరిహారం
  • భూసేకరణ, అభివృద్ధిలోనూ భారీ అవినీతి


అధికారికంగా క్రయ విక్రయాలకు వీల్లేని డీకేటీ భూములకు ధర ఎక్కువ పలకదు. కానీ.... ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం చంద్రగిరి మండలంలోని తొండవాడ, పిచ్చినాయుడుపల్లె వంటి ప్రాంతాల్లో ఎకరాకు రూ. 69 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తోంది. ఇక ముంగిలిపట్టు ప్రాంతంలో ఎకరాకు రూ. 24 లక్షల వంతున చెల్లిస్తున్నారు. వాస్తవానికి తొండవాడ, పిచ్చినాయుడుపల్లె గ్రామాల్లో ఎకరా మార్కెట్‌ రేటు రూ. 24 లక్షలుగా ఉంది. అది కూడా సెటిల్‌మెంట్‌ భూములకు! ఎందుకలా?


(తిరుపతి - ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పుట్టి పెరిగిన ఊరికి చుట్టుపక్కల భూములకు హఠాత్తుగా రెక్కలొచ్చేశాయి. ఆయన అధికారంలో లేరు! అక్కడ భారీ పరిశ్రమలేవీ రావడంలేదు.  అయినా అక్కడి భూముల ధరలు నమ్మలేనంతగా పెరిగిపోయాయి. అలాగని ఏ ప్రైవేటు వ్యక్తులో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేయడం లేదు. ఏకంగా ప్రభుత్వమే భారీ మొత్తాలు చెల్లించి రైతుల నుంచి భూములు సేకరిస్తోంది. అదీ... పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం. ఏమిటీ విడ్డూరమని ఆరా తీస్తే అసలు కథ బయటకొస్తోంది!


‘చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలి. సొంత మండలం చంద్రగిరిలో ఒక్క గ్రామంలోనూ టీడీపీ ఎక్కువ ఓట్లు తెచ్చుకోకూడదు. ఇదీ ఆ పార్టీ అధ్యక్షుడి పరిస్థితి... అని ఎద్దేవా చేయాలి!’... ఇది వైసీపీ వ్యూహం. ఇందుకు అమలు చేస్తున్నది ‘ఆపరేషన్‌ చంద్రగిరి’. టీడీపీకి బలమైన అనుచరవర్గం ఉన్నా, సరైన నాయకత్వం లేక పార్టీ దారుణంగా నష్టపోతున్న మండలం ఇది. అయితే చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెతోపాటు పలు  గ్రామాలు సంప్రదాయంగా తెలుగుదేశానికి అండగా ఉన్నాయి. ఇప్పుడు వాటిలోనూ సమీకరణాలు మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అనే పథకాన్ని ఆయుధంగా మలచుకున్నారు. నారావారిపల్లెతోపాటు పలు గ్రామాల పరిధిలో... పక్క మండలపైన తిరుపతి పేదలకు భారీ సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు.


తిరుపతిలో అందుబాటులో ఉన్నా...

తిరుపతి రూరల్‌ మండలం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. తిరుపతి రూరల్‌ మండల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. చాలా ఏళ్ల కిందటే రెవెన్యూ అధికారులు ఈ మండలంలో తిరుపతికి కాస్త చేరువగా ఉన్న డీకేటీ భూములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్‌ మండలానికి చెందిన పేదలకు ఇళ్ల స్థలాలను ఈ భూముల్లోనే కేటాయించడానికి వీలుంది. అంతకంటే ముఖ్యంగా ఈ భూములకు ప్రభుత్వం ఎవరికీ నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు. పైగా తిరుపతి రూరల్‌ మండలానికి చెందిన పేదలకు అదే మండలంలో ఇళ్ల స్థలాలిచ్చినట్టవుతుంది. వీటిని వదిలి చంద్రగిరి మండలంలో భారీగా పరిహారం చెల్లించి మరీ భూములను సేకరించడంలోనే రాజకీయ వ్యూహముందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.


ఇక్కడే ఎందుకు?

సంప్రదాయబద్ధంగా ఒకే పార్టీకి మద్దతుగా ఉన్న గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మార్చాలంటే ఏం చేయాలి? ఆ గ్రామాల్లోకి కొత్త ఓటర్లను చేర్చాలి. చంద్రగిరి మండలంలోని చంద్రబాబు సొంత గ్రామంతోపాటు ఇతర గ్రామాల సమీపంలోనే తిరుపతి అర్బన్‌, రూరల్‌ మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇవ్వడం వెనుక ఇదే వ్యూహం ఉందని స్థానిక టీడీపీ  వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉదాహరణకు... 4వేల మందికి స్థలాలు ఇచ్చి, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇళ్లు కూడా కట్టిస్తే... కనీసం 8వేల నుంచి 16వేల కొత్త ఓటర్లు జత అవుతారు. తద్వారా మొత్తం మండలంలో రాజకీయ సమీకరణలు మారతాయని, టీడీపీ మరింత బలహీనపడి, తాము ఇంకా బలపడతామని ఆశాభావంతో ఉన్నారు. కుదిరితే నారావారిపల్లెలోనూ టీడీపీని ‘మైనారిటీ’లోకి దించడమే ఈ వ్యూహం లక్ష్యం!


వందలాది ఎకరాల్లో లేఔట్లు

తిరుపతి అర్బన్‌, రూరల్‌ మండలాలకు చెందిన వేలాదిమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చంద్రగిరి మండలం కల్లూరుపల్లె నుంచి ఎం.కొంగరవారిపల్లె, ముంగిలిపట్టు, ఎం.కొత్తపల్లె, ఐతేపల్లె గ్రామాలన్నీ తాకేలా 150 ఎకరాల భూమి సేకరించారు. డీకేటీ పట్టాలు కలిగిన రైతుల నుంచీ కొనుగోలు చేశారు. అక్కడే మరో 60 ఎకరాలు సేకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. అంటే మొత్తం 210 ఎకరాలతో భారీ లేఔట్‌ వేస్తున్నారు. ఇక్కడ తిరుపతి అర్బన్‌ మండలానికి చెందిన నాలుగు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించనున్నారు. అలాగే డోర్నకంబాల, పిచ్చినాయుడుపల్లె, తొండవాడ గ్రామాల వద్ద మరో వంద ఎకరాలు సేకరించారు. డోర్నకంబాలలో ఇళ్ల స్థలాల కోసం ఓ భారీ కొండగుట్టను ఇప్పటికే సగం తవ్వేశారు. ఇక్కడ తిరుపతి రూరల్‌ మండలానికి చెందిన లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెతో పాటు దానికి అనుబంధంగా వున్న కందులవారిపల్లె, శేషాపురం వంటి గ్రామాలపై పట్టు పెంచుకునేందుకు వాటి మధ్య 50 ఎకరాల భూమి సేకరించే పనిలో పడ్డారు. నారావారిపల్లెకు చేరువలో ఉన్న భీమవరం, ఎ.రంగంపేట వంటి చోట్ల కూడా భూములు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మండలంలో 14 చోట్ల లే ఔట్లు సిద్ధం చేసేందుకు ఇప్పటివరకూ సేకరించిన 418 ఎకరాలకు తోడు అదనంగా మరో 200 ఎకరాల వరకూ సేకరించాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.


అదిరిపోయే పరిహారం!

రాష్ట్రంలో అనేక చోట్ల అసైన్డ్‌ భూములను అధికారులు పోలీసులను కూడా తీసుకెళ్లి స్వాధీనం చేసుకున్నారు. ‘ప్రభుత్వం ఇచ్చిన భూమి... ఎప్పుడైనా వెనక్కి తీసుకునే  హక్కు ప్రభుత్వానికి ఉంది’ అనేలా వ్యవహరించారు. కానీ, చంద్రగిరి మండలంలో మాత్రం డీకేటీ భూములకు కళ్లుచెదిరే పరిహారం చెల్లించడం గమనార్హం. జిల్లా చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ డీకేటీ భూములకు ఈ స్థాయిలో పరిహారం లభించలేదని రెవెన్యూ, రాజకీయవర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఉదాహరణకు... పిచ్చినాయుడుపల్లెలో మార్కెట్‌ విలువ రూ.24 లక్షలు. కానీ, ఏకంగా రూ.69 లక్షల చొప్పున పరిహారం నిర్ణయించారు. ముంగిలిపట్టులో ఎకరా మార్కెట్‌ రేటు రూ. 8.50 లక్షలు. అక్కడ దానికి మూడురెట్లు అధికంగా పరిహారం నిర్ణయించారు.


పనిలో పనిగా అవినీతి?

చంద్రగిరి మండలంలో భారీ పరిహారాలిచ్చి జరుగుతున్న భూసేకరణలో అంతేస్థాయిలో అవినీతి కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అధికార పార్టీ నేతలే ముందుండి భూసేకరణ జరిపిస్తున్నారు. డీకేటీ భూములను వాటి భౌగోళిక స్వరూపం, రికార్డులు, ఎవరి అనుభవంలో ఉన్నాయన్న వివరాలను బట్టి ఏ, బీ, సీ గ్రేడులుగా వర్గీకరించారు. వీటిలో పక్కాగా రికార్డులుండి, భూములు అసలైన రైతుల ఆధీనంలోనే ఉన్న వాటిని ఏ గ్రేడ్‌ భూములుగా నిర్ధారించి... వాటికి అధిక మొత్తంలో పరిహారం చెల్లిస్తున్నారు. మిగిలిన బీ, సీ కేటగిరీ భూములకు కాస్త తక్కువ ధర అందుతోంది. ఈ ప్రక్రియలో బీ- గ్రేడు భూములను కూడా ఏ -గ్రేడుగా చూపుతూ పరిహారం పెంచి, అందులో వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-07-05T08:45:08+05:30 IST