13 నెలల్లో వైసీపీ ఏం చేసిందో చెప్పగలదా..? : చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-10T23:31:49+05:30 IST

సీనియర్ నాయకుడిగా ప్రజలను చైతన్యవంతులను చేయడం తన బాధ్యత అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

13 నెలల్లో వైసీపీ ఏం చేసిందో చెప్పగలదా..? : చంద్రబాబు

అమరావతి : సీనియర్ నాయకుడిగా ప్రజలను చైతన్యవంతులను చేయడం తన బాధ్యత అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సర్కార్‌పై సూటి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏది నిజమైన అభివృద్ధి.. ఏది నిజమైన విధ్వంసమో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. 13 జిల్లాలకు టీడీపీ హయాంలో మేం ఏం చేశామో చెబుతామని.. 13 నెలల్లో వైసీపీ ఏం చెసిందో చెప్పగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగువారి శ్రేయస్సు తప్ప మరేది టీడీపీ ఆలోచించలేదన్నారు.


మేం చేసింది ఇదీ...

విభజన తర్వాత 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో వచ్చాం. రామాయపట్నం, బందర్‌, కాకినాడ, బావనపాడు పోర్టులకు నాంది పలికాం. గోదావరి మిగులు జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చూశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. పోలవరం పూర్తి చేయాలని ముందుకు పోయాం..72 శాతం పూర్తి చేశాం. 2019కి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌.. ఇప్పుడెలా ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం. 62 ప్రాజెక్ట్‌లకు నాంది పలికాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌కు శ్రీకారం చుట్టాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ పూర్తయితే 32 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. సింగిల్‌ విండో క్లియరెన్స్‌ తీసుకొచ్చాం. ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్స్‌టైల్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు శ్రీకారం చుట్టాం. ఇన్ని కష్టాలు ఉన్నా మా హాయంలో నాలుగేళ్లు రెండెంకల అభివృద్ధి ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ. సేంద్రీయ వ్యవసాయానికి శ్రీకాకరం చుట్టాంఅని చంద్రబాబు చెప్పుకొచ్చారు.


కేవలం మూడు నెలల్లోనే..

మూడు నెలల్లోనే 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతను అధిగమించాం. గ్రామాల్లో 25 వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేసిన ఏకైక రాష్ట్రం ఏపీ. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని.. ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచి జీవనప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ముందుకెళ్లాం. అనంతపురం జిల్లాకు నీరిచ్చాం కాబట్టే కియా పరిశ్రమ వచ్చింది. అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు శ్రీకారం చుట్టాం. కర్నూలుకు ట్రిపుల్‌ ఐటీ, ఉర్దూ వర్సిటీ, సీడ్‌ పార్క్‌, ఎయిర్‌పోర్టు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకు స్టేట్‌ క్యాన్సర్ సెంటర్‌, సోలార్‌ పార్క్, ఇండస్ట్రియల్ టౌన్‌ షిప్ తెచ్చాం. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్‌కు రూ.3 వేల కోట్ల ఖర్చు చేశాం. పోతిరెడ్డిపాడు పెండింగ్ వర్క్స్‌ పూర్తి చేశాంఅని చంద్రబాబు వెల్లడించారు.


రాయలసీమకు మా హయాంలో..

రాయలసీమకు జీవనాడి లాంటి ముచ్చుమర్రిని పూర్తి చేశాం. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పేరుతో లేనిపోని గొడవలు పెట్టి ఇవాళ ఏం సాధించారు. ఇరిగేషన్‌కు ఈ 15 నెలల్లో రూపాయి ఖర్చు పెట్టలేదు. మా హయాంలో 64 వేల కోట్లు ఖర్చు చేశాం. కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాం. మూతపడ్డ కడప ఎయిర్‌పోర్టును ఆధునీకరించాం. తిరుపతిని హార్డ్‌వేర్‌ హబ్‌గా తయారు చేశాం. శ్రీసిటీకి 90 వరకు పరిశ్రమలు వచ్చాయి అని చంద్రబాబు వివరించారు.


ఉత్తరాంధ్రకు.. 

విశాఖను స్మార్ట్‌ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. విశాఖలో ఫిన్‌టెక్, మెడ్‌టెక్ పార్క్‌లకు శ్రీకారం చుట్టాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ ఏమైంది వైసీపీ చెప్పాలి. విశాఖలో 700 కోట్లతో అండర్‌గ్రౌండ్ పవర్‌ లైన్స్ వేశాం. విశాఖలో 10 వేల కోట్ల విలువైన భూములను పేదలకు ఇచ్చాం. తోటపల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాం. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు మూడు పంటలు నీరిచ్చే అవకాశముంది. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టా నీటి కష్టాలు తీర్చాంఅని చంద్రబాబు నిశితంగా వివరించారు.

Updated Date - 2020-08-10T23:31:49+05:30 IST