పోయిన పరువును తిరిగి రాబట్టుకుంటా.. : చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-09T11:40:17+05:30 IST

పోయిన పరువును తిరిగి రాబట్టుకుంటా.. : చంద్రబాబు

పోయిన పరువును తిరిగి రాబట్టుకుంటా.. : చంద్రబాబు

  • షో చేసే వాళ్లొద్దు.. 
  • కుప్పంలో సీనియర్లను నమ్మి నష్టపోయామని ఆగ్రహం

చిత్తూరు జిల్లా/కుప్పం : ‘నేను పర్యటనకు వచ్చినపుడు నావద్ద షో చేయడం తప్ప మీలో ఒక్కరైనా ప్రజల్లో ఉంటున్నారా? మిమ్మల్ని నమ్ముకున్నందువల్ల నా పరువు, పార్టీ పరువు పోయింది. మీ వల్లే ఈ దుస్థితి తలెత్తింది’ అంటూ కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్‌ నాయకులకు అధినేత చంద్రబాబు తలంటిపోశారు. శనివారం ఉదయం స్థానిక రహదారులు-భవనాల శాఖ అతిథి గృహంలో నియోజకవర్గంలోని సీనియర్‌ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయానికి సీనియర్ల వ్యవహారశైలే కారణమని ఆయన తప్పుపట్టారు.


ఘోరమైన తప్పు..

మీలో ఎన్నికల సమయంలో ఎవరెవరు, ఏ రకంగా వ్యవహరించారన్న విషయం నాకు తెలుసు. ప్రజల్లోకి ఒక్కరు కూడా వెళ్లలేదు. పైగా కొంతమంది నాయకులైతే కోవర్టులుగా వ్యవహరించి, అవతలివారికి పార్టీ వ్యవహారాలన్నింటినీ చేరవేస్తూ వచ్చారు. ఇది సహించరాని విషయం’ అని మండిపడ్డారు. ‘వ్యాపారాలు చేసుకోవడంలో తప్పులేదు. అధికార పార్టీ నాయకులతో కలిసిపోయి వ్యాపార ప్రయోజనాలకోసం, పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టడం మాత్రం ఘోరమైన తప్పుఅని వ్యాఖ్యానించారు. ప్రజలకే కాదు, కార్యకర్తలకు కూడా దూరంగా ఉన్నారని, వారి కష్టనష్టాలేవీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.


తిరిగి రాబట్టుకుంటా..!

ముప్పయ్యయిదేళ్లుగా మిమ్మల్నే చూస్తున్నా. ఎప్పుడు పర్యటనకు వచ్చినా మీ ముఖాలు తప్ప కొత్త ముఖాలు నాకు కనబడడంలేదు. ఏం పార్టీలో యువకులు ఉన్నారా లేదా? ఉంటే వారికి ఎందుకు అవకాశం కల్పించరు?’ అని మండిపడ్డారు.  ‘మీ చేష్టలవల్లే నేను అటు ప్రజలకు, ఇటు కార్యకర్తలకు కూడా దూరమవుతున్నా. ఇకమీదట అలా జరగనివ్వను, పార్టీ ప్రక్షాళన కుప్పంనుంచే ప్రారంభిస్తా.  షోమేన్లను, పర్సనల్‌ అజెండాలతో పనిచేసేవారిని తొలగించి, పోయిన పరువును తిరిగి రాబట్టుకుంటా అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-01-09T11:40:17+05:30 IST