రేపు Kadapa జిల్లాకు చంద్రబాబు రాక..

ABN , First Publish Date - 2022-05-17T14:27:28+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

రేపు Kadapa జిల్లాకు చంద్రబాబు రాక..

  • జయప్రదం చేయండి
  • కార్యకర్తలకు టీడీపీ నేతల పిలుపు

కడప జిల్లా/కమలాపురం : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కమలాపురం (Kamalapuram) నగర పంచాయతీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు, టీడీపీ (Telugudesam) పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


షెడ్యూల్ ఇదీ..

చంద్రబాబునాయుడు 18వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారన్నారు. మొదట ఉమ్మడి కడప జిల్లా నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి చెన్నూరు, ఖాజీపేట మీదుగా కమలాపురానికి చేరుకొని అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. నగర పంచాయతీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, రైతులకు జరగుతున్న అన్యాయాలను, సంక్షేమ పథకాల ఎత్తివేత గురించి, పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలతో జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలియజేస్తారన్నారు. అనంతరం స్థానిక చావిడి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.


ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. విలేకరుల సమావేశం అనంతరం నేతలంతా కలసి బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు పర్యటించే ప్రాంతాలను, సభాస్థలిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కడప ఇన్చార్జి అమీర్‌బాబు, రాజశేఖర్‌, పీరయ్య, ఖాదర్‌బాషా, రాఘవరెడ్డి, దివాకర్‌రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T14:27:28+05:30 IST