అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరం. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే సిబ్బంది, ఉద్యోగులే అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలి. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం. అలాగే కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు..
‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో తగదు. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయాలి. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి.ఈ క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోంది. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి? అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ లేకుండా దయచేసి బయటకు రాకండి.భౌతిక దూరం పాటించండి. పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి