Andhra news: ఏలూరు జిల్లాకు చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-21T16:22:07+05:30 IST

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.

Andhra news: ఏలూరు జిల్లాకు చేరుకున్న చంద్రబాబు

ఏలూరు (Eluru) జిల్లా: గోదావరి వరద (Godavari flood) ప్రభావిత ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఇవాళ ఉదయం చంద్రబాబు ఏలూరు జిల్లాకు చేరుకోవడంతో టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలు (Activists) ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో ముంపుప్రాంతాల పర్యటనకు బయల్దేరారు. గురువారం పశ్చిమగోదావరి (West Godavari), కోనసీమ (Konaseema) జిల్లాల్లో ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని  వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు.


ముందుగా చంద్రబాబు సిద్ధాంతం చేరుకుని అక్కడి నుంచి అయోధ్యలంకకు వెళ్తారు. దారి పొడవునా ప్రజలు, రైతులను పరామర్శిస్తూ వారి కష్టనష్టాలను ఆలకిస్తూ వశిష్ఠ గోదావరిని దాటి అయోధ్యలంకకు చేరుకుంటారు. ముందస్తుగా గోదావరి ముంచెత్తిన కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో పర్యటించాలని భావించారు. ఈ రెండు చోట్ల ఇప్పటికీ వరద నీరు ఇంకా తగ్గకపోవడం, పర్యటనకు అనువుగా తగినన్ని మార్గాలు లేకపోవడంతో వశిష్ఠ ఒడ్డున బాధితులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి సీనియర్‌ నేతలంతా వశిష్ఠ బీభత్సాన్ని చంద్రబాబుకు నివేదించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకింత సాహసించి లంక గ్రామాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. 


గోదావరి జిల్లాల్లో తొలిసారిగా చంద్రబాబు పడవలో ప్రయాణించబోతున్నారు. లంకవాసులకు ధైర్యం చెప్పడం, మరోవైపు సాయం అందేలా చేయడంలోనూ చంద్రబాబు పర్యటన ఊతమివ్వబోతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయన పర్యటనకు వీలుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో  ఒక నిర్దేశిత కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ మేరకే చంద్రబాబు గురువారం అయోధ్యలంక, శుక్రవారం నాటికి పోలవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చాలాకాలం తర్వాత ఈ ప్రాంతానికి చంద్రబాబు రానుండడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు కాస్తంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్ల వెడల్పు తక్కువగా ఉండడం, ఆయా మార్గాల్లో చంద్రబాబు పర్యటన చేస్తుండడంతో దానికనుగుణంగానే పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-07-21T16:22:07+05:30 IST