తప్పుడు ఆరోపణలపై తప్పవు చర్యలు!

ABN , First Publish Date - 2022-04-04T08:41:59+05:30 IST

అక్షరం మా ఆయుధం! నిబద్ధత మా విధానం! ఆపన్నులను ఆదుకునేందుకు వివిధ సందర్భాల్లో సేకరించిన విరాళాల్లో...

తప్పుడు ఆరోపణలపై తప్పవు చర్యలు!

అక్షరం మా ఆయుధం! నిబద్ధత మా విధానం! ఆపన్నులను ఆదుకునేందుకు వివిధ సందర్భాల్లో సేకరించిన విరాళాల్లో ప్రతి నయా పైసాకు లెక్కలు చూపించాం. ఏ ప్రయోజనం కోసం విరాళాలు సేకరించామో... దానిని నెరవేర్చాం. ఇందులో తిరుగులేని పారదర్శకత పాటించాం, పాటిస్తున్నాం. అయినా సరే... ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన వీణా-వాణిలకు శస్త్ర చికిత్స కోసం పాఠకుల నుంచి వసూలు చేసిన సొమ్మును సొంతానికి వాడుకున్నామని... నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశామని కుళ్లిపోయిన ఆరోపణలను మళ్లీ మళ్లీ చేస్తున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ వారిచేత చిల్లర ఆరోపణలు చేయిస్తున్నారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఆరోపణలు చేసే వ్యక్తులకున్న విశ్వసనీయత ఏపాటిదో తెలుసు కాబట్టి వారి ఆరోపణలకు విలువ ఇవ్వడం ఎందుకని ఇన్నాళ్లు ఉపేక్షిస్తూ వచ్చాం. దీనిని అలుసుగా తీసుకుని మళ్లీ మళ్లీ ప్రేరేపిత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇకపై.... ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థలపై ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే ఏమాత్రం సహించేది లేదు. ఆయా వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం!


అవిభక్త కవలలు వీణా-వాణిలను విడదీసే శస్త్రచికిత్స కోసం కొంత సాయం అందించే సదుద్దేశంతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఒక చర్చా కార్యక్రమం నిర్వహించింది. మనసున్న దాతల నుంచి విరాళాలు ఆహ్వానించింది. 2012 జనవరి 18వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రూ.2,46,366 విరాళాలు అందాయి. ‘వీణా వాణి రిలీఫ్‌ ఫండ్‌’ పేరిట ప్రత్యేక ఖాతా తెరిచి ఆ విరాళాల మొత్తాన్ని అందులో జమ చేశాం. ప్రతి ఏటా ఈ ఖాతా చట్టబద్ధంగా ఆడిట్‌ అయ్యింది. కాలం గడిచిందే తప్ప... శస్త్రచికిత్స చేసి వీణా-వాణిలను విడదీయడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ అవిభక్త కవలలు తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో కాకుండా వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్నారు. తర్వాత వారి యోగ క్షేమాలను తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చూసుకుంటోంది. 2021 ఆగస్టు 23వ తేదీ నాటికి విరాళాల సొమ్ము వడ్డీతో కలిపి 5,36,268లకు చేరుకుంది. వీణా-వాణిలకు మైనారిటీ తీరిన నేపథ్యంలో... ఆ మొత్తాన్ని సమానంగా విభజించి, నేరుగా వారిద్దరి పేరుతో రెండు డీడీల రూపంలో తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందించింది. ఆ సొమ్మును వీణా, వాణిల చదువు, ఆరోగ్యం, సంక్షేమం కోసం వినియోగించాల్సిందిగా కోరింది. ఈ వివరాలన్నింటినీ అప్పుడే ప్రజలముందు ఉంచింది. దీనిపై అడ్డగోలుగా ఎవరైనా ఆరోపణలు చేస్తే సహించబోం! నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సేకరించిన విరాళాలను కూడా ‘ఆంధ్రజ్యోతి’ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలను కొందరు చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అందిన విరాళాల మొత్తం రెండు కోట్ల 52 లక్షల 47 వేల 259 రూపాయలు; నాలుగు బంగారు గాజులను 2014 అక్టోబరు 24వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ స్వయంగా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందచేశారు.


ఆ వివరాలన్నీ ఆంధ్రజ్యోతి పత్రికలో అప్పుడే ప్రచురించాం. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు సేకరించిన విరాళాలు రూ.కోటీ 14 లక్షలను ఆంధ్రజ్యోతి స్వయంగా బాధితులకు అందించింది. 2015 నవంబరు 27వ తేదీన హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి... ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో పంపిణీ చేసింది. సాయం పొందిన రైతు కుటుంబాల జాబితాను కూడా ప్రచురించింది. ఆపన్నులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఎప్పుడు విరాళాలు సేకరించినా... ఆ వివరాలను, దాతల జాబితాను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతోంది. వాటిని ఎలా వినియోగించిందీ కూడా స్పష్టం చేస్తోంది. ఇందులో ప్రతి పైసకు లెక్క పక్కాగా ఉంది. వీణా-వాణి రిలీఫ్‌ ఫండ్‌, నవ్యాంధ్ర రాజధాని, రైతు సంక్షేమ విరాళాలపై ఏ ప్రభుత్వమైనా, ఏ దర్యాప్తు సంస్థయినా విచారణ జరుపుకోవచ్చు. గతంలోనే పత్రికా ముఖంగా ఈ సవాలు విసిరాం! ఇది మా నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనం. అయినప్పటికీ... ప్రకటనలు, లేఖలు, వార్తలు, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌ల వంటి మాధ్యమాల ద్వారా కొందరు అడ్డగోలుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వాటా ఉందని మరికొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివాటిని ఇకపై ఎంతమాతరం సహించేది లేదు. అటువంటి వ్యక్తులు, సంస్థలపై సివిల్‌, క్రిమినల్‌, పరువు నష్టం చర్యలు తప్పవు. తస్మాత్‌ జాగ్రత్త!!







Updated Date - 2022-04-04T08:41:59+05:30 IST