చంద్రబాబు రోడ్‌షోపై రాళ్లదాడి

ABN , First Publish Date - 2021-04-13T05:59:01+05:30 IST

తిరుపతిలో సోమవారం సాయంత్రం చంద్రబాబు ప్రచార సభలో జరిగిన రాళ్లదాడిపై తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు రోడ్‌షోపై రాళ్లదాడి

చంద్రబాబును అంతమొందించే కుట్రేనని టీడీపీ ఫిర్యాదు


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 12: తిరుపతిలో  సోమవారం సాయంత్రం చంద్రబాబు ప్రచార సభలో జరిగిన రాళ్లదాడిపై తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంవద్ద చంద్రబాబు సమక్షంలో తిరుపతి ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు అందజేశారు.చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీకి చెందిన వ్యక్తులు గులకరాళ్లతో దాడిచేశారని, చంద్రబాబు ప్రచార రథంపై, టీడీపీ కార్యకర్తలపైన, అలాగే మీడియా వాహనాలపై ఆ గులకరాళ్లు పడ్డాయని అందులో పేర్కొన్నారు. గులకరాళ్లు తగిలి ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రచార రథం, మీడియా వాహనాలు దెబ్బతిన్నాయన్నారు. తమకు తగిలిన రెండు గులకరాళ్లను కూడా పోలీసులకు అందజేసినట్టు పేర్కొన్నారు.చంద్రబాబును భయపెట్టి ప్రచారం చెయ్యనీకుండా అడ్డుకోవడమే కాకుండా ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు దాడి చేయించారని ఫిర్యాదులో ఆరోపించారు. దాడి జరిగిన సమయంలో ఆ విషయాన్ని తెలియజేయడానికి  సమీపంలో పోలీసులు కూడా లేరంటూ జడ్‌ కేటగిరీలో ఉన్న తమ నాయకుడికి పోలీసులు తగినంత భద్రత కల్పించకుండా వైసీపీ నాయకుల ఆదేశాలతో దాడిచేసినవారిని అనుసరించినట్టుగా ఉందన్నారు. తమపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల పైన, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పైన, వారి కార్యకర్తలపైన తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సీసీ ఫుటేజీని పరిశీలించి రాళ్లెవరు వేశారన్నది తెలుచుకుని చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సుప్రజ హామీ ఇచ్చారు. రాళ్లదాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు పాకాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు మోహన్‌,తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్లపల్లెకు చెందిన జీవన్‌ కుమార్‌ రెడ్డి, తిరుపతి నగరం ఎమ్మార్‌పల్లెకు చెందిన బాలకృష్ణ   లను ఎమ్మెల్సీ నిమిత్తం రుయాస్పత్రికి పంపించారు.


రాళ్లదాడిపై చంద్రబాబు నిరసన


 చంద్రబాబు ప్రచార సభపై  రాళ్ల దాడి జరగడంతో ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. ఇంతపెద్ద సమావేశం జరుగుతుంటే పోలీసులు ఎక్కడా కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  జడ్‌ప్లస్‌ రక్షణలో ఉన్న తనకే ఇలావుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రచార రథం దిగి రోడ్డుపై బైఠాయించారు.‘రండిరా యూజ్‌లెస్‌ ఫెలోస్‌ తేల్చుకుందాం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడి చేస్తారా?ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా మీతోకలు కట్‌ చేస్తా. రౌడీలను ఎక్కడపెట్టాలో అక్కడ పెడతా’అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న తిరుమల ఏఎస్పీ మునిరామయ్యను రాళ్లదాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. దాదాపు అర్ధగంట నిరసనలు, నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. తరువాత అక్కడనుంచి నడుచుకుంటూ ఎస్పీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు.  ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సుప్రజ  హామీ ఇచ్చారు.220 మంది పోలీసులను బందోబస్తులో ఉంచామని చెప్పారు.అనంతరం కపిలతీర్థం రోడ్డులోని టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు. 

Updated Date - 2021-04-13T05:59:01+05:30 IST