Abn logo
Sep 18 2021 @ 00:43AM

ఉండవల్లిలో ఉద్రిక్తత

దాడిని నిరసిస్తూ చంద్రబాబుతో కలిసి ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం 

ఎమ్మెల్యే జోగి రమేష్‌ వైఖరిపై తమ్ముళ్ల ఆగ్రహం

పలు ప్రాంతాల్లో టీడీపీ నిరసనలు.. పోలీస్‌స్టేషన్ల వద్ద ధర్నా

నరసరావుపేటలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట


కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతమది. అనుమతి లేనిదే ఎవరికీ ప్రవేశం ఉండదు. కాని అక్కడకు దూసుకువచ్చిన వారు రాళ్లతో దాడికి యత్నించారు. అడ్డుకున్న వారితో బాహాబాహీకి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ ప్రాంతం ఉండవల్లిలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం కాగా. కార్యకర్తలతో దూసుకు వచ్చింది.. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌. వైసీపీ వర్గీయులను అడ్డుకున్న టీడీపీ వారిపై దాడికి పాల్పడ్డారు. మాజీ సీఎం నివాసంపై దాడికి యత్నించడం దారుణమంటూ టీడీపీ వర్గీయులు మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు.. పోలీస్‌స్టేషన్ల వద్ద ధర్నాలతో పాటు జోగి రమేష్‌పై నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. 

 

తాడేపల్లి టౌన్‌, నరసరావుపేట, తాడికొండ, తుళ్లూరు, కొల్లూరు, సెప్టెంబరు 17: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచరులు, కార్యకర్తలతో కలసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు ధర్నా చేసేందుకు శుక్రవారం వచ్చారు. అయితే ఈ సమాచారం ముందుగానే తెలియడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కరకట్ట వద్దకు చేరుకుని వైసీపీ వర్గీయులను అడ్డుకున్నారు.  ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రాళ్లు రువ్వుకోవడంతో టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు మరికొంత మందికి గాయాలయ్యాయి. రాళ్లదాడిలో జోగి రమేష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి  ఎమ్మెల్యేను మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, నేతలు బుద్దా వెంకన్న, పట్టాభిరామ్‌, నాగుల్‌మీరా, ఆలపాటి రాజా, పోతినేని శ్రీనివాస్‌, గంజి చిరంజీవి, కొమ్మారెడ్డి కిరణ్‌, కొల్లి శేషు, నాదెండ్ల బ్రహ్మం, తమ్మా శంకర్‌రెడ్డి, గాంఽధీ, రఘురామరాజు, చిన్నా, శిరీష, ఉమామహేశ్వరరావు, రాకేష్‌, పఠాన్‌ జానీఖాన్‌, మురళి, వెంకటరావు, లీలాకృష్ణ తదితరులు చంద్రబాబు నివాసం వద్దకు వచ్చారు. అనంతరం మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడిపై టీడీపీ నేతలు కార్యకర్తలు తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేషన్‌ గేట్లకు తాళాలు వేయడంతో  టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన తెలిపారు. తాడికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద టీడీపీ తాడికొండ మండల అధ్యక్షుడు తలశిల ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  రాస్తారోకోతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే జోగి రమేష్‌ వైఖరిని నిరసిస్తూ తుళ్లూరు గీతా మందిరం సెంటర్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు.  అనంతరం జోగి రమేష్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడిని నిరసిస్తూ కొల్లూరులోని బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ వర్గీయులు ధర్నా చేశారు. గుంటూరులోని హిమని సెంటర్‌ గాంధీ బొమ్మ వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేశారు.


ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అధ్వర్యంలో నరసరావుపేటలో చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటలో  అరవిందబాబు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో గుంటూరు రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా అరవిందబాబు మాట్టాడుతూ రాష్ట్రం మరో ఆప్ఘనిస్తాన్‌లా మారుతుందన్నారు.  ప్రజాస్వామ్యన్ని పరిరక్షించలేని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేటలో ప్రశాంతంగా నిరసన తెలయజేసే పరిస్థితి కూడా లేకపోవడం దారుణమన్నారు.   ఎమ్మెల్యే చేస్తున్న అవినీతికి హద్దులు లేవని ఆరోపించారు.