నేడు చంద్రబాబు కీలక సమీక్ష.. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు

ABN , First Publish Date - 2022-03-03T14:05:15+05:30 IST

నేడు చంద్రబాబు కీలక సమీక్ష.. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు

నేడు చంద్రబాబు కీలక సమీక్ష.. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు

చిత్తూరు/తిరుపతి : మదనపల్లె నియోజకవర్గ టీడీపీ స్థితిగతులపై గురువారం పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించనున్నారు.సమీక్షా సమావేశానికి హాజరు కావాల్సిందిగా నియోజకవర్గ పార్టీ ముఖ్యులకు అధిష్టానం నుంచీ పిలుపు అందింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం తొలుత పొలిట్‌ బ్యూరో సభ్యులు మదనపల్లె నేతలతో ఉమ్మడిగానూ, విడివిడిగానూ మాట్లాడనున్నారు. ఆ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు వంటివాటిపై మాట్లాడి వివరాలు సేకరించనున్నారు. అలాగే నాయకత్వం మార్పు అవసరమా అన్న దానిపై కూడా అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఈ మొత్తం సారాంశాన్ని పొలిట్‌ బ్యూరో సభ్యులు అధినేతకు నివేదించనున్నారు.మధ్యాహ్నం తర్వాత మదనపల్లె నేతలతో అధినేత చంద్రబాబు సమావేశమై సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశం కోసం నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది ముఖ్యులకు ఆహ్వానం అందింది.


నాయకత్వ మార్పుపై ఊహాగానాలు

చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశమనగానే నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఎన్నికల ముందు నుంచే మదనపల్లె ఇంఛార్జి పదవి కోసం పెద్దఎత్తున ఆశావహులు పోటీ పడుతునే వున్నారు. గత ఎన్నికల్లో దొమ్మలపాటి రమే్‌షకు టికెట్‌ దక్కి, ఎన్నికల తర్వాత ఆయనే ఇంఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆ పదవికి పోటీ మాత్రం కొనసాగుతూ వస్తోంది. సాంప్రదాయకంగా ఈ స్థానాన్ని టీడీపీ కమ్మ సామాజికవర్గానికి కేటాయిస్తూ వస్తోంది. 2014లో బీజేపీతో పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా చల్లపల్లి నరసింహారెడ్డి పోటీ చేయడం మినహాయిస్తే 1983 నుంచీ 2019 వరకూ ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ టికెట్‌ కమ్మ సామాజికవర్గానికే దక్కింది. కాకపోతే గత ఎన్నికల నుంచీ బీసీ వర్గాలు ఇంఛార్జి పదవికి, టికెట్‌కూ పోటీ పడడం మొదలైంది. కమ్మ సామాజికవర్గం నుంచీ దొమ్మలపాటి రమేష్‌, మాజీ ఎమ్మెల్యేలు రాటకొండ సాగర్‌రెడ్డి సోదరుడు, రాటకొండ శోభ భర్త అయిన బాబురెడ్డి, బోడపాటి శ్రీనివా్‌స తొలినుంచీ నాయకత్వ రేసులో వుండగా ఇపుడు కొత్తగా జయరామనాయుడు రంగంలోకి వచ్చారు.


ఇక బీసీ అందునా చేనేత సామాజికవర్గం నుంచీ తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు రేసులో నిలిచారు. బీసీలకు కేటాయించేటట్టయితే తనకు అవకాశమివ్వాలని ఆయన అధిష్ఠానాన్ని కోరుతున్నారు. వీరి ప్రయత్నాల సంగతెలా వున్నప్పటికీ నాయకత్వ మార్పుపై అధిష్ఠానం స్పష్టమైన వైఖరి ఇంకా తీసుకోలేదని సమాచారం. కేవలం పార్టీ పరిస్థితి గురించి, నాయకత్వ పనితీరు గురించి సమీక్షించడం, నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు సేకరించడం వరకే సమావేశాన్ని పరిమితం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమీక్ష సందర్భంగా మెజారిటీ నాయకులు నాయకత్వ మార్పు అవసరమని అభిప్రాయపడితేనే అధిష్ఠానం కూడా ఆ మేరకు ఆలోచిస్తుందంటున్నాయి.

Updated Date - 2022-03-03T14:05:15+05:30 IST