Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘చంద్రబాబు ఓ ప్రజాస్వామ్యవాది’

twitter-iconwatsapp-iconfb-icon

రాజకీయ నాయకుల వ్యక్తిత్వాల్ని, వ్యవహారశైలిని పోల్చి అంచనా వేసేందుకు విమర్శకులు, విశ్లేషకులు సాధారణంగా సాపేక్షపద్ధతినే ఎంచుకుంటారు. ప్రజలు సైతం నాయకుల్ని ఎక్కువగా ఆ కోణం నుంచే చూస్తారు. ఎన్నికల సమయంలో అందరిలోకెల్లా ‘ఎవరు మెరుగు?’ అనే అంశం ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకుంటారు.


ఈ ఉపోద్ఘాతం దేనికంటే, తెలుగునాట పేరొందిన జర్నలిస్ట్‌, జాతీయ స్థాయిలో జర్నలిస్ట్‌ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న కె. శ్రీనివాసరెడ్డి ఇటీవల ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ‘ఇపుడు అధికారంలో ఉన్నవారిని, గతంలో అధికారంలో ఉన్నవారిని పోల్చి చూస్తే.. చంద్రబాబునాయుడు ఈజ్‌ ఎ గ్రేట్‌ డెమొక్రాట్‌’ అని అన్నారు. కొనసాగింపుగా ‘ఎవరికైనా అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా నాకు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కరే’ అని కూడా వ్యాఖ్యానించారు.


తన వృత్తి జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను అతి సన్నిహితంగా గమనించిన, గమనిస్తున్న అనుభవంతో జర్నలిస్ట్‌ కె.శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యకు విశేష రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో పరిపాలనా పద్ధతులలో, ప్రజాస్వామ్య విధానాలకు, సంప్రదాయాలకు తిలోదకాలు పలుకుతున్న ప్రస్తుత సందర్భంలో శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యపై విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది.


ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా మొత్తం 14 ఏళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు పాలనలో సంపూర్ణ ప్రజాస్వామ్యం అడుగడుగునా కనిపించి ఉండకపోవచ్చు. అయితే చంద్రబాబునాయుడి ఆలోచన, ఆచరణ, ప్రవర్తన, పరిపాలనలో ప్రజాస్వామ్యం ప్రస్ఫుటంగా కనిపించినట్లు ఆయన విమర్శకులు నేడు చెప్పడం ఓ వాస్తవం, ఓ ఆవశ్యకత, ఓ అనివార్యత.


చంద్రబాబునాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే రాష్ట్ర ఆర్థికరంగంతో సహా వివిధ రంగాలలోని వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల రూపేణా ప్రజలకు స్పష్టంగా వివరించారు. పరిపాలనలో దాపరికం లేకుండా పారదర్శకత తేవడానికి కృషి చేశారు. అందుకోసం అన్ని రంగాలలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు తెచ్చినా అందుకు సహేతుక కారణాలను చూపారు. దానిపై ప్రజలకు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శల్ని, ప్రశ్నల్ని ఎదుర్కొని జవాబిచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినపుడు కూడా అందులో లాభనష్టాల కూడికలు తీసివేతలు, అలాగే ఓటుబ్యాంకులను దృష్టిలో పెట్టుకోకుండా ధైర్యంగా, సాహసోపేతంగా ముందడుగు వేశారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమర్థులైన ఉన్నతాధికారుల్ని కీలకస్థానాలలో నియమించి పరిపాలన సజావుగా, వేగంగా, సమర్థంగా సాగడానికి చర్యలు తీసుకోవడం కనిపిస్తుంది. తన క్యాబినెట్‌లోని మంత్రులను విశ్వాసంలోకి తీసుకొని వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఆయా శాఖలపై వారు పట్టు సాధించి ఫలితాలు రాబట్టే దిశగా అందర్నీ ప్రోత్సహించడం కనిపించేది. మంత్రులు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఆయన కల్పించారన్నది ఓ వాస్తవం. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అంతకుముందెన్నడూ కనిపించని ఓ వినూత్న రాజకీయ సంస్కృతి కనబడేది. హంగులు, ఆర్భాటాలు, విందులు, వినోదాలు ఉండేవికావు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా పనితప్ప మరో ధ్యాస కనపడేది కాదు. ఉన్నతాధికారులతో చేసే సమీక్షలు మొక్కుబడిగా ఉండేవికావు. సమగ్ర సమాచారంతో రానివారిని చంద్రబాబు ఉపేక్షించరన్న భయం అధికారులందరిలో ఏర్పడింది. దానిని భయం అనే కంటే జవాబుదారీతనం అనాలి. ప్రతి ప్రభుత్వోద్యోగిలో ప్రజల పట్ల జవాబుదారీతనం పెరిగిన దశ అది.


మంత్రులేకాదు. శాసనసభ్యులు, ప్రతిపక్ష నేతలు, వివిధ సంఘాల నేతలకు చంద్రబాబుని తరచుగా కలుసుకొనే వెసులుబాటు ఉండటం వల్ల వారు క్షేత్రస్థాయి ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని సత్వరం పరిష్కరించుకునేందుకు కృషి చేసేవారు. వివిధ అంశాల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించడానికి తరచుగా అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసేవారు. తమకంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతలే ముఖ్యమంత్రిని కలిసివస్తున్నారని కూడా అధికార పార్టీ నేతలు అనుకొనేవారు. అసెంబ్లీ సమావేశాలు క్రమం తప్పకుండా జరగడమేకాదు.. ఎంతో సీరియస్‌గా సాగేవి. అసెంబ్లీ స్పీకర్‌ సమక్షంలో బిజినెస్‌ ఎడ్వయిజరీ కమిటీ నిర్ణయించిన అంశాలనే కాకుండా ఇతరత్రా ప్రజాసమస్యలపై అత్యవసరంగా చేపట్టవలసిన అంశాలను కూడా చర్చకు చేపట్టినట్లు అసెంబ్లీ రికార్డులు తెలియజెబుతాయి. దాదాపుగా ప్రతిరోజూ అసెంబ్లీ నిర్ణీత గడువును దాటి పనిచేసేది. ఎక్కువగా వర్కింగ్‌ లంచ్‌లతో అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగేవి. అసెంబ్లీ సమావేశాలు అర్ధరాత్రివరకు జరిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు సజావుగా పని చేశాయంటే అర్థం తదనుగుణంగా అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యయుతంగా నడుచుకున్నారనే కదా.


ప్రభుత్వానికి ప్రజలకు నడుమ పార్టీని వారధిగా చేసి ప్రజలకు మరింత మేలు చేయడం అన్నది పార్టీ ప్రజాస్వామ్యంలోని ప్రధాన లక్షణం. ఈ అంశంలో చంద్రబాబుని మించిన మరొక నేత భారతదేశంలో కనపడరు. కొత్త పథకాల రూపకల్పనకు, అమలు జరుగుతున్న కార్యక్రమాల సమర్ధ నిర్వహణకు పార్టీ యంత్రాంగం అలోచనలను, శక్తియుక్తులను అద్భుతంగా వినియోగించుకొనే ప్రజాస్వామిక లక్షణం చంద్రబాబు సొంతం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలను, అనుబంధ సంఘాలను భాగస్వాములుగా చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే ప్రక్రియను క్రియాశీలంగా అమలు చేయడం ఆయన పాలనలో మరో విశేషం. ఇక, ప్రభుత్వపరంగా చేపట్టే నియామకాలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి అత్యున్నత పదవులకు చేసే ఎంపిక ఏకపక్షంగాకాక పార్టీ ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి, పార్టీ అత్యున్నత వింగ్‌ అయిన పోలిట్‌బ్యూరోలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం, అందులో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతలు పాటించడం వంటి ప్రజాస్వామిక విధానాల్ని అనుసరించినట్లు కనబడుతుంది. నెలకొకసారి చంద్రబాబు అధ్యక్షతన జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజాసమస్యల్ని చర్చించడం, వివిధ ప్రభుత్వ పథకాలలోని మంచిచెడులపై చర్చ జరగడం వంటి ప్రక్రియ కూడా ప్రజాస్వామ్యంలో ఓ భాగమే. ప్రజలను ప్రతిరోజూ కలవడం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు దినచర్యలో ఓ భాగంగా ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు పూర్తిచేసుకొని అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తనకోసం వేసి చూసే ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం, ఆయా విజ్ఞప్తులను మొక్కుబడిగాకాక క్షుణ్ణంగా పరిశీలించి తన కార్యదర్శి ద్వారా సంబంధిత శాఖలకు పంపడం జరిగేది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రతిరోజూ సగటున కనీసం ఓ వెయ్యి మందిని కలుసుకొనేవారని పత్రికలు పేర్కొనేవి. అలాగే, ఆయన తరచుగా చేసే జిల్లాల పర్యటనలలో కూడా అక్కడి ప్రజలను, పార్టీ నేతలను కలవడం ఆయన విధుల్లో భాగంగా ఉండేది.


ఇక మీడియా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు లభించిన పేరు దేశంలోనే వేరొక సీఎంకు లేదనడం అతిశయోక్తి కాదు. చంద్రబాబునాయుడు తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను, పార్టీ చేపట్టే కార్యక్రమాలను విపులంగా చెప్పేవారు. తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పడం ఆయన ఉద్దేశంగా ఉండేది. ఆ క్రమంలో మీడియా ప్రతినిధులు ఎటువంటి చిక్కు ప్రశ్నలు సంధించినా చిరాకుపడటం, వారిపట్ల అసహనం ప్రదర్శించడం ఎన్నడూ చేయలేదు. అటు సచివాలయంలోనో, ఇటు పార్టీ కార్యాలయంలోనో దాదాపుగా ప్రతిరోజూ మీడియా ప్రతినిధులు ఆయనను కలుస్తూనే ఉండేవారు. రెండు, మూడు పత్రికలు పనిగట్టుకొని తన ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసినా.. ఎన్నడూ ఆయన సదరు పత్రికల అధిపతుల్ని లేదా వాటి ప్రతినిధుల్ని కించపరుస్తూ మాట్లాడినట్లు కనపడదు.


చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన పరిపాలన మొత్తం పూర్తి ప్రజాస్వామ్యయుతంగా జరిగి ఉండకపోవచ్చు. దేశ తొలి ప్రధాని నెహ్రుకే అది సాధ్యపడలేదు. అయితే, తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరిలో జర్నలిస్ట్‌ కె. శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు నారా చంద్రబాబునాయుడు ఓ ప్రజాస్వామ్యవాది. ఇది వాస్తవం. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోతుందా?

విక్రమ్‌ పూల

సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ విశ్లేషకుడు

(నేడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.